నిన్న కేశినేని, ఇవాళ రాయపాటి- టీడీపీలో సీట్ల పంచాయితీ!
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ పార్టీల్లో టికెట్ రేసు మొదలైపోయింది. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న నేతలంతా మీడియా ముందుకు వచ్చి తమ మనసులోని మాటను బయట పెడుతున్నారు.
ఇప్పటి వరకు అధికార పార్టీలోనే కనిపించిన సీన్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో కనిపిస్తోంది. టికెట్ తమకే ఇవ్వాలంటూ ఒత్తిళ్లు అన్ని పార్టీల్లో సర్వసాధారణంగా మారిపోతున్నాయి. లేకుంటే మా తడాఖా చూపిస్తామంటూ నేతలు వార్నింగ్‌లు ఇస్తున్నారు. దీంతో పార్టీ దూతలు రంగంలోకి దిగి.. నేతలను కూల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ పార్టీల్లో టికెట్ రేసు మొదలైపోయింది. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న నేతలంతా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి తమ మనసులోని మాటను బయట పెడుతున్నారు. మొన్నటికి మొన్న వైసీపీలో ఇలాంటి సీన్స్ కనిపించాయి. మేకతోటి సుచరిత లాంటి వీరవిధేయులు కూడా ఒత్తిడి తెచ్చేలా మాట్లాడారు. ఇప్పుడు అలాంటివే తెలుగుదేశం పార్టీలో మొదలయ్యాయి.
ఇటీవల కాలంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని... పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. పార్టీ టికెట్లపై కీలక కామెంట్స్ చేశారు. ఆ ముగ్గురికి టికెట్‌లు ఇస్తే సహకరించబోనంటూ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ తనకు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసే సత్తా కూడా తనకు ఉందంటూ సందేశాన్ని పంపించారు. ఇది పార్టీలోనే తీవ్ర దుమారాన్ని రేపింది.
కేశినేని నాని టెకెట్ ఇవ్వొద్దంటున్న ఆ ముగ్గురిలో తన సోదరుడు చిన్ని కూడా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వీళ్లిద్దరికి చాలా కాలం నుంచి పడటం లేదు. ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకున్నారు. నాని చెప్పిన లిస్ట్‌లో బుద్దా వెంకన్న కూడా ఉన్నట్టు సమాచారం. నాగుల్ మిరా, జలీల్‌ఖాన్‌పై కేశినేని నాని గుర్రుగా ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. తన కుమార్తెను మున్సిపల్ ఎన్నికల్లో ఓడించడానికి వీళ్లంతా తెరవెనుక ప్రయత్నాలు చేశారని.... అందుకే వాళ్లకు టికెట్ ఇస్తే మాత్రం సహకరించేది లేదని నాని చెప్తున్నారట. తమను కాదని వాళ్లకు టికెట్ ఇస్తేమాత్రం ఓడిస్తామని సిగ్నల్స్ పంపించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అదే టైంలో తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని కూడా సందేశం పంపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పనిలో పనిగా... దేవినేని ఉమపై కూడా నాని కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో ఆ వ్యక్తిని తప్పిస్తే బెటర్ అన్నట్టు మాట్లాడారు.
కేశినేని నాని దుమారం ఇంకా చల్లారక ముందే ఇప్పుడు గుంటూరులో మరో ముసలం రేగింది. తెలుగుదేశం అధిష్ఠానం ముందు సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లా టికెట్ల పంచాయితీ పెట్టారు. తన కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అధిష్ఠానం ముందు కూడా ఇదే ప్రపోజల్ పెట్టినట్టు సాంబశిరావు వివరించారు. కొన్ని నియోజకవర్గాల పేర్లను కూడా ప్రస్తావించారాయన. తన కుమారుడు రంగబాబును రంగంలోకి దింపుతానని.. పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వనంటే తానే రంగంలోకి దిగుతానంటూ చెప్పారు.
గుంటూరు జిల్లా అసెంబ్లీ సీట్లపై కచ్చీప్ వేసిన సాంబశివరావు... నరసరావుపేట ఎంపీ టికెట్‌పై కూడా కీలకమైన కామెంట్స్ చేశారు. ఆ స్థానం నుంచి స్థానికులే పోటీ చేయాలని.. నాన్ లోకల్ క్యాండిడేట్‌ను తీసుకొస్తే మాత్రం గెలిపించబోమని స్పష్టం చేశారు. ఈ స్థానం నుంచి కడపకు చెందిన ఓ సీనియర్ నేత కుమారుడు కన్నేశారని.. ఎప్పటి నుంచో ఇక్కడ కార్యకలాపాలు జరుపుతున్నారని ప్రచారం నడుస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా రాయపాటి సాంబశివరావు ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జోరుగా సాగుతోంది.
జనసేనతో కలిసి ఎన్నికలను ఎదుర్కోవాలని టీడీపీ అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని గ్రహించిన నేతలు తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అని చెప్పిం ముందుగానే వార్నింగ్స్ ఇస్తున్నారు. మొన్న కృష్ణా జిల్లా, నేడు గుంటూరు జిల్లా ఇలా రోజుకో జిల్లాలో నేతల స్వరాలు సవరించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.