KCR Reservation Politics : ముస్లిం రిజర్వేషన్లకూ జీవో ఇస్తారా ? కేసీఆర్ ముందు మరో క్లిష్టమైన సవాల్ !
ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. మరి మా సంగతేమిటని మజ్లిస్ నేత ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఏం చేస్తారు ?
KCR Reservation Politics : తెలంగాణ సీఎం కేసీఆర్ గిరిజనుల మద్దతు పొందడానికి మరోసారి రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. రేపోమాపో జీవో కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఆయనకు అప్రకటిత మిత్రుడు, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ నుంచి ఊహించని సమస్య ఎదురొచ్చింది. అదే ముస్లిం రిజర్వేషన్ల డిమాండ్. ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ చేసిన తీర్మానంలోనే ముస్లిం రిజర్వేషన్ల ను 12 శాతానికి పెంచాలన్న విషయం ఉంది. అయితే ఆ తీర్మానాన్ని కేంద్రం పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎస్టీల కోసం జీవో జారీ చేస్తానని కేసీఆర్ అన్నారు. మరి ముస్లింల సంగతేమిటని అసదుద్దీన్ ప్రశ్నిస్తున్నారు. వారి కోసమూ ఓ జీవో జారీ చేస్తానంటారా ? అలా చేస్తే బీజేపీకి ఆయుధం ఇచ్చినట్లు కాదా ? ఇవ్వకపోతే ముస్లిం వర్గాల మద్దతు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందా ?
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్ హామీలు
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధినతే కేసీఆర్ ఎస్టీలు, ముస్లింలకు చెరో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ముస్లింలకు 4 నుంచి 12 శాతానికి, గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో 2017లోనే తీర్మానం చేశారు. ‘‘సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింల జనాభా 9.56 శాతం. వారికి అమలైన రిజర్వేషన్లు 4 శాతం. గిరిజనుల జనాభా 7.11 శాతం. వారికి అమలైన రిజర్వేషన్లు 6 శాతం. కానీ, రాష్ట్ర విభజనతో తెలంగాణలో ఈ రెండు వర్గాల జనాభాలో భారీ వ్యత్యాసం వచ్చింది. తెలంగాణలో ముస్లింల జనాభా 12.68 శాతానికి చేరింది. గిరిజనుల జనాభా 9.08 శాతానికి పెరిగింది’’ అని ..జనాభా ప్రాతిపదికిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని తెలంగామ ప్రభుత్వం చెబుతోంది. అయితే గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ ఒకే బిల్లును కేంద్రానికి పంపారు.
సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఆమోదించని కేంద్రం !
తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. ప్రస్తుతం తెలంగాణలో 50 శాతం వరకు రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుతో మొత్తం రిజర్వేషన్ల కోటా 62 శాతానికి పెరుగనుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతానికి మించి ఉండకూడదు. కానీ తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నందున, అదే రీతిని తెలంగాణకు అవకాశం కల్పించాలని సిఎం కెసిఆర్ కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో 90శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఉన్నాయని, దేశమంతా ఒకేరీతిలో లేదని వాదిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం అంగీకరించలేదు. అసలు ఆ తీర్మానాన్ని పట్టించుకోలేదు.
రిజర్వేషన్ల జీవోకు కేంద్రం అనుమతి అవసరం లేదంటున్న నిపుణులు !
రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50శాతం మించకూడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందిని నిపుణులు చెబుతున్నారు. ఏడాది క్రితం వరకు.. రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ పెంచుతూ జీవో జారీ చేసినా కేంద్రం ఆ జీవోను నోటిఫై చేయాల్సి ఉండేది. కానీ, గత ఏడాది జరిగిన ఆర్టికల్ 342(ఏ) 105వ సవరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ పెంచుతూ జారీ చేసే జీవోకు కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు పొందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఎవరైనా కోర్టుకు వెళ్తే రిజర్వేషన్లు ఆగిపోయే అవకాశం ఉంది.
ముస్లిం రిజర్వేషన్లకూ అలాంటి జీవోనే ఇస్తారా ?
ఎస్టీ, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ ఒకే బిల్లు ఆమోదించారు. ఇప్పుు ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల కోసం జీవో ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఓవైసీ ముస్లింల రిజర్వేషన్ల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్లపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మజ్లిస్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముస్లిం వర్గాల మద్దతు టీఆర్ఎస్‌కు ఎంతో బాగా ఉపయోగపడుతోంది. అయితే ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారాయి. ముస్లింలకు రిజర్వేషన్ల జీవో ఇస్తే.. అది బీజేపీకి ప్రత్యేకంగా ఇచ్చిన అస్త్రం అవుతుంది.
ముస్లిం రిజర్వేషన్లకూ జీవో ఇస్తే బీజేపీ ఊరుకుంటుందా ?
మత పరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ముస్లిం రిజర్వేషన్లు అంటే అసలు అంగీకరించదు. దీనికి వ్యతిరేకంగా భారీగా ఉద్యమం చేపట్టి ఇతర వర్గాలను ఏకం చేస్తే.. రాజకీయంగా టీఆర్ఎస్‌కు గడ్డు కాలం ఎదురవుతుంది. అందుకే ఈ అంశం ఇప్పుడు కేసీఆర్‌కు ఇబ్బందికరం అవుతుంది. ఒక వేళ తనకు ఇబ్బంది అవుతుందని రిజర్వేషన్ల అంశంపై పట్టుబట్టవద్దని ఓవైసీని కేసీఆర్ ఒప్పించగలిగితే సమస్య తాత్కలికంగా సద్దుమణిగే చాన్స్ ఉంది . లేకపోతే కేసీఆర్‌కు మరో సవాల్ ఎదురైనట్లే !