(Source: ECI/ABP News/ABP Majha)
KCR: చంద్రబాబు బాటలో సీఎం కేసీఆర్, ఆ వ్యూహం ఈయనకైనా పని చేస్తుందా?
KCR follows Chandrababu: చంద్రబాబు 2019కి ముందు కమలనాథులతో కయ్యానికి దిగారు. ఇప్పుడు కేసీఆర్ సైతం ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ వ్యూహం సఫలీకృతమవుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Telangana Politics: అప్పటి వరకు బీజేపీతో (BJP) కలసి ఉన్న చంద్రబాబు (Chandrababu) 2019కి ముందు కమలనాథులతో కయ్యానికి దిగారు. చావో రేవో అంటూ సవాల్ విసిరారు. దేశరాజకీయాల్లో చక్రం తిప్పుతా అంటూ పరుగులు పెట్టారు. జాతీయ, ప్రాంతీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కానీ ఆ వ్యూహం కాస్తా బెడిసి కొట్టింది. మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సైతం ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.. అయితే అక్కడ చంద్రబాబుకు (Chandrababu) ఓటమి ఎదురుకాగా ఇక్కడ కేసీఆర్ ప్రస్తుతం పన్నుతున్న వ్యూహం సఫలీకృతమవుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు.. భాష ఒక్కటైనా యాస వేరు.. సంస్కృతి సాంప్రదాయాలు భిన్నం.. రాజకీయ పరిపక్వతలో దేశంలో ఎవరికి అందని తెలుగువారి నాడిని పట్టుకునేందుకు చేస్తున్న రాజకీయ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుంది.
కేసీఆర్ దూకుడు 2023లో కలిసోస్తుందా..?
సరిగా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని (YSRCP) పక్కనపెట్టేందుకు చంద్రబాబు (Chandrababu) బీజేపీతో కయ్యానికి కాలుదువ్వారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తుపెట్టుకుని పోరులో దిగాయి. టీడీపీ (TDP) 102 చోట్ల విజయం సాధించగా బీజేపీ 4 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ రెండు ఎంపీ సీట్లు సాధించింది. సుమారు మూడేళ్ల పాటు ఎన్‌డీఏలో ఉన్న చంద్రబాబు అకస్మాతుగా కూటమి నుంచి బయటకు వచ్చి నరేంద్రమోదీపై యుద్ధం ప్రకటించారు. బీజేపీ ఓటమే తన లక్ష్యమని ముందుకు సాగాడు. అయితే, ఈ వ్యూహం కాస్తా బెడిసి కొట్టింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమి పాలయ్యారు.
ఇక్కడ తెలంగాణలో (Telangana Politics) ఇప్పటి వరకు అంతర్గతంగా బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం అదేస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నోట్ల రద్దు విషయంలో సైతం మోదీపై విమర్శలు చేసిన కేసీఆర్ ఆ తర్వాత వెనుకంజ వేశారు. రైతు చట్టాల విషయంలో విమర్శలు చేసినప్పటికీ రైతుల ఆందోళనలో అంతగా పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో బీజేపీతో ఉన్న అంతర్గత సంబంధాలు కారణంగానే కేసీఆర్ ఇలా వ్యవహరించాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు తన టార్గెట్ బీజేపీ అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. ఏకంగా నరేంద్రమోదీ కేంద్రంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సందిస్తున్నాడు. జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతీయ పార్టీల నాయకులను కలుస్తూ బీజేపీని గద్దె దించేందుకు మూడో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని ముందుకు సాగుతున్నాడు. అయితే, ఈ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందనే విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలో చర్చనీయాంశం అయింది.
బలమైన ప్రత్యర్థిని వదిలి..
2019 ఎన్నికల ముందు ఏపీలో వైఎస్సార్‌సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. వైసీపీ నాయకుడు వై.ఎస్.జగన్ పాదయాత్రతో జనంలోని వెళ్లారు. అయితే స్థానికంగా బలంగా ఉన్న పార్టీని వదిలేసి బీజేపీపై పోరు చేయడం ద్వారా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలనే భావనలోకి చంద్రబాబు వెళ్లారనే విమర్శలు వచ్చాయి. ఈ వ్యూహం కాస్తా విఫలం అయింది. ప్రస్తుతం తెలంగాణ విషయానికి వస్తే ఆది నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అయితే పార్టీ ఫిరాయింపుల ద్వారా కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే బలహీన పరిచిన కేసీఆర్, ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో తన ప్రత్యర్థి బీజేపీ అన్నట్లుగానే ఎన్నికల వ్యూహంలోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణలో లేన్నట్లు వ్యవహరించడంతోపాటు ఇప్పటి వరకు రాహుల్, సోనియాగాంధీలపై విమర్శలు చేసిన కేసీఆర్ వారికి సానుకూలంగా మాట్లాడటం, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే ఇటీవల కొన్ని సర్వేలలో కాంగ్రెస్ పార్టీ మరింతగా పుంజుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అయితే ఇందుకు భిన్నంగా కేసీఆర్ తన ప్రత్యర్థిగా బీజేపీని ఎంచుకోవడం చూస్తే తన వ్యూహం ద్వారా కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనం చేసి మరోమారు విజయం సాధించాలనే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రాజకీయంగా చైతన్యవంతులైన తెలంగాణ సమాజం ఎలా తీర్పు ఇస్తుందో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.