Pawan Kalyan: పిఠాపురం నుంచే జనసేనాని ఎన్నికల శంఖారావం - ముహూర్తం ఫిక్స్, ఎప్పటి నుంచంటే?
Andhrapradesh News: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 30 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆయన బరిలో నిలిచే పిఠాపురం నుంచే క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు.
Pawan Kalyan Election Campaign: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తాను పోటీ చేయబోయే కాకినాడ జిల్లా పిఠాపురం (Pithapuram) నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 30 నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని.. అందుకు అనుగుణంగానే తన పర్యటన షెడ్యూల్ రూపొందించాలని సోమవారం నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేనాని ప్రచారం మూడు విడతలుగా ఉండనుండగా.. ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్రణాళిక రూపొందించనున్నారు.
షెడ్యూల్ ఇదే
ఈ నెల 30న పిఠాపురం నుంచి పవన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుండగా.. 3 రోజులు ఆయన ఆ నియోజకవర్గంలోనే పర్యటించనున్నారు. తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. ఆ రోజు పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయని పవన్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ తెలిపారు. అదే రోజు శ్రీపాద వల్లభుని దర్శించుకోనున్నారు. అలాగే, 31న ఉప్పాడ సెంటర్ లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఏప్రిల్ 1న పార్టీలో చేరికలు, నియోజకవర్గంలోనే మేథావులతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగానే టీడీపీ, బీజేపీ నేతలతోనూ భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి నుంచే ఇతర నియోజకవర్గాలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో సహా సర్వమత ప్రార్థనల్లో పవన్ పాల్గొంటారు. ఉగాది వేడుకలు సైతం జనసేనాని పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు.
30వ తేదీ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ప్రారంభం
— JanaSena Party (@JanaSenaParty) March 25, 2024
పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం
పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు pic.twitter.com/RgvkK2lfEC
ఈ నెల 27 నుంచి చంద్రబాబు
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27 నుంచి 'ప్రజాగళం' (Prajagalam) పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 31 వరకూ వివిధ సభలు, రోడ్ షోలు, నియోజకవర్గాల పర్యటనల్లో ఆయన పాల్గొననున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు, పర్యటన సాగేలా షెడ్యూల్ రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేయనున్నారు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటన ఉండనుంది. అటు, నారా లోకేశ్ సైతం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గం సహా ఇతర ప్రాంతాల్లో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామంటూ హామీ ఇస్తున్నారు.
Also Read: Chandrababu: 'అధికారంలోకి వస్తే ఇంటికే రూ.4 వేల పింఛన్' - మా 3 పార్టీల అజెండా ఒక్కటేనన్న చంద్రబాబు