Where is Hoda Yodha: జగన్‌లో హోదా యోధుడు ఏమయ్యారు? డిలిమిటేషన్‌పై ఎందుకు పోరాటం చేయడం లేదు?
Jagan: 2014-19 మధ్య కాలంలో జగన్ ప్రత్యేకహోదా ఉద్యమాన్ని బలంగా చేశారు. హోదాయోధ అని వైసీపీ క్యాడర్ చెప్పుకున్నారు. కానీ ఇప్పుడెందుకు ఇలా?

Jagan special status Spirit Missing: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక హోదాపై పోరాటం అనేది ఒక మైలురాయి. ఆనాడు ఢిల్లీ నుంచి గల్లీ వీధుల వరకూ ఆయన చేసిన పోరాటం, ఎంపీల రాజీనామాలు వంటివి ఆయనను ఒక బలమైన జననేతగా, హోదా యోధుడు గా నిలబెట్టాయి. కానీ, కాలక్రమేణా ఆ దూకుడు తగ్గడం, ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయన అనుసరిస్తున్న వ్యూహం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నాటి హోదా యోధుడు ' నేడు ఎందుకు మౌనం వహిస్తున్నారు..అనేదే అందరి డౌట్.
పోరాట పటిమ నుంచి వ్యూహాత్మక మౌనం వరకు
2014-19 మధ్య కాలంలో జగన్ అధికారంలో లేనప్పుడు రెబల్ ఇమేజ్‌తో దూసుకుపోయారు. కేంద్రంలో బీజేపీ ఎంత బలంగా ఉన్నా, హోదా విషయంలో రాజీలేని పోరాటం చేశారు. దాని ఫలితంగానే 2019లో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే, అధికారంలోకి వచ్చాక కేంద్రంతో ఘర్షణ కంటే సయోధ్య మార్గాన్నే ఆయన ఎంచుకున్నారు. ప్రత్యేకహోదాను పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారం పోయాక కూడా ఆయన తన రెబల్ ఇమేజ్ ను వెనక్కితెచ్చుకోవడం లేదు. అన్నివిషయాల్లో కేంద్రానికి మద్దతుగా ఉంటున్నారు. తాజాగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ఆందోళన ఉన్న నియోజకవర్గాల పునర్విభజన అంశంలోనూ ఆయన మద్దతు ప్రకటించారు. ఇది ఆయనలోని పోరాట పటిమ తగ్గిందా? లేక రాజకీయ అనివార్యతలా? అన్న ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
కేసుల భయం.. రాజీ రాజకీయమా?
జగన్‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల ప్రభావం ఆయన రాజకీయ నిర్ణయాలపై స్పష్టంగా కనిపిస్తోందని భావిస్తున్నారు. పుష్కర కాలానికిపైగా సాగుతున్న ఈ కేసుల విషయంలో కేంద్రం ఎప్పుడూ పైచేయి సాధించే స్థితిలో ఉండటం, జగన్ డిఫెన్స్‌లో పడటానికి ప్రధాన కారణం కావచ్చు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి మేధావులు.. కేసులకు భయపడవద్దు, అవసరమైతే జైలుకు వెళ్లినా ప్రజల్లో సానుభూతి వస్తుంది, తిరగబడి పోరాడండి అని సలహా ఇస్తున్నా జగన్ ఆ సాహసం చేయడం లేదు. ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టే అవకాశం ఉన్నప్పటికీ, జగన్ కేంద్రంతో నేరుగా తలపడకుండా సేఫ్ గేమ్ ' ఆడుతున్నారు.
దక్షిణాది సెంటిమెంట్ - చేజారిన రాజకీయ మైలేజ్
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయంలో తమిళనాడు నుంచి కేరళ వరకు అన్ని రాష్ట్రాలు కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తుంటే, ఏపీ నుంచి జగన్ మద్దతు తెలపడం ఒక విచిత్రమైన పరిణామం. చంద్రబాబు ఎన్డీయేలో ఉన్నందున కేంద్రంపై ఒత్తిడి తేలేరని, ఆ లోటును తాను భర్తీ చేస్తూ ఏపీ ప్రయోజనాల పరిరక్షకుడి గా పేరు తెచ్చుకునే సువర్ణావకాశాన్ని జగన్ వదులుకున్నారు. ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చి మైలేజ్ పొందే అవకాశం ఉన్నా, కేంద్రంతో వివాదం వద్దు అనుకోవడమే ఆయన ప్రస్తుత బేల తనానికి నిదర్శనం.
అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం - మారిపోయిన సమీకరణాలు
నాడు హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు చేయించిన జగన్, ఇప్పుడు కనీసం విమర్శించడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు హుంకరించిన సింహంలా కనిపించిన నాయకుడు, ఇప్పుడు కేంద్రం అడిగిన దానికల్లా జీ హుజూర్ అనడం ఆయన రాజకీయ పతనానికి సంకేతమా? లేక లోతైన వ్యూహమా? అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ, ప్రస్తుతానికి మాత్రం నాటి హోదా యోధుడు జగన్ లో కనిపించడం లేదు. ప్రజలు ఎప్పుడూ పోరాడే నాయకుడినే ఆదరిస్తారు తప్ప, రాజీపడే నాయకుడిని కాదనేది చరిత్ర చెబుతున్న సత్యం. మరి జగన్ తనలోని పాత యోధుడిని మళ్లీ మేల్కొలుపుతారా? లేదా ఇలాగే సర్దుకుపోతారా? అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మిగిలిన అతిపెద్ద సస్పెన్స్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















