వైఎస్‌ఆర్‌సీపీ మూడో జాబితాలో ఎంపీ సీట్లపై ఫోకస్- కేశినేని ఫ్యామిలీకి రెండు సీట్లు!
వైసీపీ మూడో జాబితాలో లోక్ సభ అభ్యర్ధులపై సీఎం జగన్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మెజారిటీ లోక్ సభ సభ్యులను మార్చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎంపీ గోరంట్ల మాధవ్ కు టికెట్ లేదని చెప్పేశారు.
CM Jagan Focus On YSRCP MP Seats : రెండు జాబితాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి (CM)జగన్మోహన్‌రెడ్డి (Jaganmohan Reddy)...ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలు ( Mlas), ఒక ఎంపీ (Mp)ని పక్కన పెట్టేశారు సీఎం జగన్. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గెలిచే వారికే టికెట్ అని తేల్చి పడేస్తున్నారు. నియోజకవర్గంలో అంతో ఇంతో పట్టున్న నేతలను బుజ్జగిస్తున్నారు. అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా...టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో అభ్యర్థుల సామాజికవర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయి. ప్రత్యర్థి టీడీపీ-జనసేన కూటమి టికెట్ ఎవరికి ఇస్తోందన్న అంశాలను తెలుసుకుంటోంది. ప్రత్యర్థులు ఎత్తులు చిత్తయ్యేలా...కూటమికి ఝలక్ ఇచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా...మంత్రులయినా...మాజీ మంత్రులైనా...ఎంపీలయినా సరే...దుకాణం సర్దుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఎన్నికల బరిలోకి దించితే గెలుస్తున్నారా లేదా అన్న దానికే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈసారి లోక్ సభ అభ్యర్థులపై ఫోకస్
వైసీపీ మూడో జాబితాలో లోక్ సభ అభ్యర్ధులపై సీఎం జగన్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మెజారిటీ లోక్ సభ సభ్యులను మార్చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు టికెట్ లేదని చెప్పేశారు సీఎం జగన్. పలువురు ఎంపీల టికెట్లు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయి. గోరంట్ల మాధవ్ స్థానంలో హిందూపురం పార్లమెంట్ నుంచి...కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరి శాంతను బరిలోకి దించుతున్నారు. విశాఖ పార్లమెంట్ నుంచి మాజీ ఎంపీ, బొత్స సత్యనారాయణ సతీమణి... బొత్స ఝాన్సీని బరిలోకి దించేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. దీనికి బొత్స కుటుంబం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయనగరం పార్లమెంట్ నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేరును పార్టీ హైకమాండ్ పరిశీలిస్తోంది. నర్సరావుపేట నుంచి పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను బరిలో పెట్టాలని భావిస్తోంది. పల్నాడు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్నీ ఉన్నత వర్గాలే ఉన్నాయి. అందుకే నర్సరావుపేట లోక్ సభ నుంచి బీసీ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని వైసీపీ వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
విజయవాడ నుంచి శ్వేత!
విజయవాడ ఎంపీ స్థానంపై ఇంకా కసరత్తు జరుగుతోంది. తాజాగా టీడీపీకి గుడ్ బై చెప్పిన కేశినేని నాని లేదా ఆయన కుమార్తె కేశినేని శ్వేతను పార్టీలో చేర్చుకుని...పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఒక వేళ ఆయనకు ఎంపీ స్థానం నుంచి పోటీకి దింపితే ఆమెకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారని టాక్ నడుస్తోంది. గుంటూరు పార్లమెంట్ లేదంటే నంద్యాల లోక్ సభ స్థానానికి సినీ నటుడు ఆలీ పేరును పరిశీలిస్తున్నారు సీఎం జగన్.
శ్రీకాకుళం పార్లమెంట్‌కు మాజీ ఎమ్మెల్యే పిరియా సాయి రాజ్ పేరు వినిపిస్తోంది. కాకినాడ ఎంపీగా బలిజ అశోక్ పేరు వైసీపీ హైకమాండ్ పరిశీలిస్తోంది. రైల్వే ఇంజనీర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు అశోక్. అనకాపల్లి, అమలాపురం, ఏలూరు, నర్సాపూర్, రాజమండ్రి, తిరుపతి లోక్ సభ నియోజకవర్గాల కసరత్తు కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాల చెబుతున్నాయి. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి లైన్ క్లియర్ అయింది.
ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తేనే... తాను ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్ కు తేల్చి చెప్పారు. పునరాలోచనలో పడ్డ జగన్...ఒంగోలు పార్లమెంట్ టికెట్ ఆశించిన వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. యధావిధిగా మాగుంటకు సిట్టింగ్ స్థానాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.