Hyderabad- Vijayawada National Highway: హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
Vijayawada Hyderabad National Highway: హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం చర్యలు చేపట్టింది.

న్యూఢిల్లీ: హైదరాబాద్, విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారిలో ప్రయాణించేవారికి శుభవార్త. త్వరలోనే వీరికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్-విజయవాడల మధ్య ఉన్న 65వ జాతీయ రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జాతీయ రహదారిలో 40వ కిలోమీటరు నుంచి 269వ కిలోమీటరు వరకు మొత్తం 229 కిలోమీటర్ల పొడవున రహదారిని 4 లేన్ల నుంచి 6 లేన్లకు విస్తరించనున్నారు. ఈ నేషనల్ హైవే విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణ కోసం కేంద్ర రహదారి, రవాణాశాఖ మంగళవారం (నవంబర్ 4న) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ భూసేకరణ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పలు జిల్లాల్లో భూసేకరణ బాధ్యతలను పలువురు అధికారులకు అప్పగించారు. తెలంగాణ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో 9 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. నల్గొండ జిల్లాలోని చిట్యాలలో 5 గ్రామాలు, నార్కెట్‌పల్లిలో 5 గ్రామాలు, కట్టంగూర్‌లో 4, నకిరేకల్‌లో 2 గ్రామాలు, కేతేపల్లిలో 4 గ్రామాల్లో భూసేకరణ బాధ్యతలను అక్కడి ఆర్డీఓలకు అప్పగించారు. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలంలో 4 గ్రామాలు, చివ్వెంలలో 6 గ్రామాలు, కోదాడ మండలంలో 4 గ్రామాలు, మునగాల మండలంలోని 5 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ పరిధిలో భూసేకరణ పనులను జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలంలో 4 గ్రామాలు, ఇబ్రహీంపట్నంలో 12 గ్రామాలు, జగ్గయ్యపేటలో 7 గ్రామాలు, కంచికచర్లలో 4 గ్రామాలు, పెనుగంచిప్రోలులో 3 గ్రామాలు, విజయవాడ రూరల్‌లో 1 గ్రామం, విజయవాడ వెస్ట్‌లో 2 గ్రామాలు, విజయవాడ నార్త్ పరిధిలోని 1 గ్రామంలో భూసేకరణ చేపట్టే బాధ్యతలను అక్కడి జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. నేషనల్ హైవే 65 రహదారి విస్తరణతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుంది.
నేషనల్ హైవే 65 మీద జిల్లాలవారీగా దూరం కి.మీ.లలో
యాదాద్రి జిల్లాలో 39.54 కి.మీ నుంచి 62.2 కి.మీ వరకు
నల్గొండ జిల్లాలో 6.2 కి.మీ నుంచి 126.8 కి.మీ వరకు
సూర్యాపేట జిల్లాలో 126.8 నుంచి 191.2 కి.మీ వరకు
ఎన్టీఆర్ జిల్లా 191.2 కి.మీ నుంచి 270.86 కి.మీ వరకు






















