National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
FIR on Rahul Gandhi and Sonia Gandhi | నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీసులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా పేరు కూడా ఉంది.

ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త FIR నమోదు అయింది. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఈ FIRలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు మరో ఆరుగురి పేర్లు ఉన్నాయి. ED ప్రధాన కార్యాలయం నుంచి EOWలో ఫిర్యాదు అనంతరం FIR నమోదు చేశారు.
ఆర్థిక నేరాల విభాగం FIRలో కుట్ర ద్వారా కాంగ్రెస్‌కు చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)ని మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నారని అభియోగాలున్నాయి. ED తన దర్యాప్తు నివేదికను ఢిల్లీ పోలీసులకు ఇచ్చింది. ఇందులో PMLA సెక్షన్ 66 (2) కింద షెడ్యూల్ చేసిన నేరాన్ని నమోదు చేయాలని సిఫార్సు చేసింది. యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా AJLకి చెందిన దాదాపు రూ. 2,000 కోట్ల ఆస్తులపై అధికారం పొందారని ఆరోపణలున్నాయి.
FIRలో సామ్ పిట్రోడా పేరు
ఈ FIRలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా, మరో ముగ్గురు వ్యక్తులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, 3 కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. Dotex అనేది కోల్‌కతాకు చెందిన షెల్ కంపెనీ. ఇది యంగ్ ఇండియన్‌కు రూ. 1 కోటి ఇచ్చింది. ఈ లావాదేవీతో యంగ్ ఇండియన్ కాంగ్రెస్‌కు కేవలం 50 లక్షల రూపాయలు ఇచ్చి AJLని స్వాధీనం చేసుకుంది. అయితే, వీటి ఆస్తుల విలువ 2,000 కోట్లకు పైగా ఉంది.
డిసెంబర్ 16న విచారణ
రౌజ్ అవెన్యూ కోర్టు శనివారం (నవంబర్ 29)న నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ED ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడాన్ని వాయిదా వేసింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఇప్పుడు ఈ ఉత్తర్వును డిసెంబర్ 16న వినిపిస్తారు. నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కి సంబంధించిన ఆర్థిక అవకతవకలు జరిగాయని ఏజెన్సీ ఆరోపించింది.
కొత్త క్రిమినల్ లా BNSS సెక్షన్ 223ని ఉటంకిస్తూ, ఈ దశలోనూ నిందితుడి తరఫు వాదన వినడం సరైన విచారణకు అవసరమని రౌజ్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ నిబంధన PMLAతో విభేదించదని, పారదర్శకతను పెంచుతుందని విచారణలో భాగంగా కోర్టు స్పష్టం చేసింది. ED ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనేది కోర్టు డిసెంబర్ 16న నిర్ణయాన్ని వెల్లడించనుంది.






















