Telangana Congress: బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
Telangana: తెలంగాణలో కీలక బీఆర్ఎస్ నేతల అరెస్టులకు రంగం సిద్ధం అయిందన్న ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కూడా అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Key BRS Leaders arrests in Telangana: తెలంగాణలో పొలిటికల్ బాంబులు ఈ దీపావళి ముగిసిన వెంటనే గట్టిగా పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలు ప్రారంభమేనని రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో వేధింపులు ఉంటాయని పోరాటానికి అందరూ సిద్దంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఖచ్చితమైన సమాచారం ఏదో లేకపోతే ఆయన అలా ట్వీట్ చేసి ఉండరని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. దీపావళి తర్వాత పెద్ద బాంబులు పేలుతాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఆషామాషీగా ఆ ప్రకటన చేయలేదని .. తెర వెనుక ఏదో జరుగుతోందని కేటీఆర్ ట్వీట్‌తో స్పష్టమయిందని అంచనాకు వస్తున్నారు.
ఏం పీక్కుంటారో పీక్కోమన్న కేటీఆర్
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్నప్పుడు ప్రత్యేకంగా ఏబీపీ దేశంతో మాట్లాడిన కేటీఆర్ పొంగులేటి చేసిన హెచ్చరికలపై భిన్నంగా స్పందించారు. ఏం పీక్కుంటారో పీక్కోవాలని అన్నారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేసి చాలా రోజులు అయిందని కనీసం అధికారికంగా ఒక్క ప్రకటన కూడా ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తమను ఇబ్బంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెడితే తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అది జరిగిన రెండు రోజులకే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరికొన్ని పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఫామ్‌హౌస్ కేసులో రాజకీయం ఎక్కువ -మ్యాటర్ తక్కువ ! మానసిక దాడి చేయడమే వ్యూహమా ?
అరెస్టులకు గవర్నర్ పర్మిషన్ అవసరం - తీసుకున్నారా ?
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ముఖ్య నేతలు, ప్రస్తుత ప్రజాప్రతినిధులపై అరెస్ట్ వంటి కీలక చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు. అందుకే ఈ అంశం రాజకీయంగా దుమారం రేగింది. సీబీఐ కోర్టు ఈ ప్రోటోకాల్ పాటించనందున చార్జిషీట్లును పరిగణనలోకి తీసుకోకుండా పెండింగ్ లో పెట్టింది. ఇప్పుడు అవినీతి కేసుల్లో గత తెలంగాణ ప్రభుత్వ పెద్దల్ని అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహత్మకంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే అనుమతుల ప్రక్రియ పూర్తయిందన్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. ఏ కేసులో అరెస్టు చేస్తారు.. ఎవరిని అరెస్టు చేస్తారన్నది సస్పెన్స్‌గానే ఉంది.
ఏసీబీ దగ్గరకు వెళ్లిన ఫార్ములా ఈ రేసు స్కాం !
ఫార్ములా ఈ రేసు కోసం రూ. 55 కోట్లను నిర్వహణ సంస్థకు చెల్లించారు. ఇలా చెల్లించడానికి కనీస అనుమతులు లేవు. అంటే అనధికారికంగా చెల్లించారు. ఇది తీవ్రమైన నేరం. కేటీఆర్ మౌఖిక ఆదేశాల ద్వారానే చెల్లించామని బాధ్యుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ అంతర్గత విచారణ అధికారులకు వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఈ కేసును ఏసీబీకి ఇచ్చారు. ఈ కేసు మాత్రమే ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఈ కేసును పరిగణనలోకి తీసుకుంటే.. కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే లీగల్ ప్రాసెస్ ప్రకారం ముందుగా నోటీసులు ఇవ్వడం .. విచారణకు పిలవడం వంటివి చేస్తారని అనుకుంటున్నారు. ఈ రూ. 55 కోట్లు పూర్తిగా అనధికారికంగా తరలించినవి కావడం.. సమర్థించుకోవడానికి లేని పరిస్థితి బీఆర్ఎస్‌కు ఉంటుందని అంచనా వేస్తున్నారు.