Punganoor Politics : పుంగనూరుకు ఎవరూ వెళ్లకూడదా ? ఏపీలో అదే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమా ?
పుంగనూరు నియోజకవర్గం అత్యంత సమస్యాత్మకమా ?విపక్ష నేతలపై అదే పనిగా మూక దాడులురాజకీయ కార్యకాలాపాల్లో పాల్గొంటే ఇళ్ల విధ్వంసంస్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడిన జనంపుంగనూరులో ఏం జరుగుతోంది ?
Punganoor Politics : పుంగనూరు నియోజకవర్గం. ఈ పేరు ఇటీవలి కాలంలో చాలా సార్లు ప్రచారంలోకి వచ్చింది. అయితే అది అభివృద్ధి పనుల విషయంలో టామోటా పంటలను బాగా పండించిన విషయంలోనే కాదు.. రాజకీయ దాడుల విషయంలో. వైఎస్ఆర్‌సీపీ నేతలు కాకుండా మరే పార్టీ నేత అయినా సరే అక్కడ భయంతో బతకాల్సిందేనన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన నేతల్ని మాత్రమే కాదు ఇటీవల కొత్తగా పార్టీ పెట్టుకున్న రామచంద్ర యాదవ్ అనే నేతనూ పుంగనూరులో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు వదల్దేదు. మాట్లాడితే ఇళ్లపై దాడులు చేస్తారు. ఆస్తులు ధ్వంసం చేస్తారు. ఊళ్లలోకి అడుగులు పెట్టనీయరు. ఇప్పుడు చంద్రబాబు పర్యటన విషయంలోనూ అదే జరిగింది. పుంగనూరులోకి చంద్రబాబును అడుగుపెట్టనీయలేదు. తవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఇంకా పరిస్థితి ముదరకుండా ఆయన వెళ్లిపోయారు. చంద్రబాబు పుంగనూరులోకి రానివ్వకుండా చేయడానకే ఇదంతా జరిగిందన్న ఆరోపణలు టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి.
టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబుపై జరిగిన దాడులకు లెక్కే లేదు !
పుంగనూరులో అత్యధికంగా దాడులకు గురయ్యే నేత ఎవరు అంటే.. టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబు. ఆయన ఏ గ్రామానికి వెళ్లే ప్రయత్నం జరిగినా ఏదో చోట దాడులు జరుగుతాయి. ఆయన పర్యటనలకు వెళ్లాలంటే కనీసం యాభై మంది కార్యకర్తలను తీసుకుని వెళ్తారు. లేకపోతే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని అనుకుంటారు. చల్లా బాబుకు కంటే ముందు టీడీపీ ఇంచార్జ్ గా అనూషా రెడ్డి ఉండేవారు. పేరున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఈ దాడుల రాజకీయాలను తట్టుకోలేక కన్నీరు పెట్టుకుని రాజకీయాల నుంచి విరమించుకున్నారు. చల్లా బాబు మొండిగా రాజకీయం చేస్తున్నారు. నియోజకవర్గంలో గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఉంటారు.
రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి !
గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన రామచంద్ర యాదవ్.. ఆ పార్టీలో లేరు. కానీ ఆయన పుంగనూరు నియోజకవర్గంలో సొంతంగా రాజకీయం చేయడం ప్రారంభించారు. ఇటవల కొత్త పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకోక ముందు ఆయన .. నియోజకవర్గంలో రైతుల సమస్యలపై పోరాడేందుకు తిరిగేవారు. ఆయన విస్తృతంగా పర్యటిస్తూండటంతో.. ఓ రోజు రెండు వందల మందితో కూడిన అల్లరి మూక ఇంటిపై విరుచుకుపడింది. విధ్వంసం సృష్టించింది. చివరికి ప్రాణాలు కాపాడుకున్న రామచంద్ర యాదవ్ .. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వై సెక్యూరిటీని ఏర్పాటు చేయించుకున్నారు. ఇటీవల సొంత పార్టీ పెట్టుకుని చిత్తూరు ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా పుంగనూరు వెళ్లడానికి ప్రయత్నిస్తే ఆయనను పోలీసులు ముప్పుతిప్పలు పెట్టారు.
స్థానిక ఎన్నికల్లో ఇతర పార్టీల వాళ్లు నామినేషన్లు వేయడమే గొప్ప !
పుంగనూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో ఇతర పార్టీల వాళ్లు నామినేషన్లు వేయడమే గొప్పగా అన్నట్లుగా సాగిపోయింది. పంచాయతీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలే అత్యధికం. నామినేషన్ల ఉపసంహరణలోనూ ఆరోపణలు వచ్చాయి. ఇలా నామినేషన్ వేయడానికి వెళ్లిన అంజిరెడ్డి అనే పెద్దాయనపై దాడి చేయడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తే..ఆయన ఎదురు తిరిగి తొడకొట్టిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. మొత్తంగా పుంగనూరు నియోజకవర్గంలో ఏపీలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఒకటిగా మారుతోంది. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు.