YSRCP IPac : వైఎస్ఆర్‌సీపీలో అన్ని సమస్యలకూ ఐ ప్యాకే కారణమా ? అత్యంత సన్నిహితులూ సీఎం జగన్‌కు ఎందుకు దూరమవుతున్నారు?
వైఎస్ఆర్‌సీపీలో సమస్యలకూ ఐ ప్యాక్ కారణమా ?జగన్‌కు, పార్టీ నేతలకు మధ్య అంతరం ఎందుకు పెరుగుతోంది ?పార్టీ ని ఐ ప్యాక్ రిషి రాజ్ హైజాక్ చేస్తున్నారా?వైసీపీ నేతల్లో అసంతృప్తి ఎందుకు పెరుగుతోంది ?
YSRCP IPac : ఆంద్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులైన వారు, వైసీపీ అంటే ఎనలేని అభిమానం చూపేవారు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. అదే సమయంలో పార్టీ క్యాడర్‌తో హైకమాండ్‌కు దూరం పెరిగిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో పార్టీ వ్యవహారాలు ఓ కుదుపు కుదిపేయగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అలాంటి పరిస్థితి వచ్చింది. పార్టీ నేతల్లో బయటపడని అసంతృప్తి కనిపిస్తోందని గుసగుసలు ఎక్కవగానే వినిపిస్తున్నాయి. దీనికి కారణం సీఎం జగన్ ఎక్కువగా ఆధారపడుతున్న ఐ ప్యాక్ అన్న మాట మాత్రం ఐ పార్టీలో ఏకగ్రీవనంగా వినిపిస్తోంది. మొత్తం ఐ ప్యాక్ డామినేషన్ వల్లే సమస్య వస్తోందని ఆ పార్టీ నేతలు అసహనానికి గురవుతున్నారు.
వైసీపీ రోజు వారీ వ్యవహారాలన్నీ ఐ ప్యాక్ ఆలోచనలే !
గడప గడపకూ మన ప్రభుత్వం అనే ఆలోచన ఐ ప్యాక్‌ది. ఆ తర్వాత జగనన్నే మా నమ్మకం.. మా భవిష్యత్ వంటి స్టిక్కర్ల ఉద్యమం కూడా ఐ ప్యాక్ ఆలోచన. ఐ ప్యాక్ వైసీపీ పార్టీ వ్యవహారాల్లో ఎంతగా చొచ్చుకుపోయిందంటే.. గడపగడపలో అంటించిన స్టిక్కర్లన్నీ ఐ ప్యాక్ అనుబంధ కంపెనీ పేరు మీదనే ప్రింట్ చేయించారు. అంటే పార్టీ మెటీరియల్ కూడా ఐ ప్యాకే సప్లయ్ చేసింది. ఇక పార్టీ రోజు వారీ వ్యవహారాల్లో కూడా ఐ ప్యాక్ కీలక పాత్ర పోషిస్తోంది. కొన్నాళ్ల కిందట సీఎం జగన్ నియోజకవర్గ సమావేశాలు పెట్టాలనుకున్నారు. కుప్పంతో ప్రారంభించారు. కొన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు చేశారు. ఆ సమీక్షలకు ఎవరు రావాలి..అన్నది కూడా ఐ ప్యాకే ఎంపిక చేసింది. ఇటీవల ప్రతి నియోజకవ్రగానికి ఓ సలహాదారుడ్ని నియమించారు. ఇది కూడా ఐ ప్యాక్ చాయిసే. దీంతో అసలు పార్టీ నేతల ప్రమేయం అనేది లేకుండా పోయింది.
నెల్లూరులో చిచ్చుకు ఐ ప్యాక్ తీరే కారణమని ఆరోపణలు!
ఐ ప్యాక్ తరపున రిషిరాజ్ అనే స్ట్రాటజిస్ట్ వ్యవహారాలన్నీ చక్క బెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో నలుగురు ఐదుగురుతో ఉండే ఓ టీంను నియమించుకున్నారు. వారే నియోజకవర్గ వ్యవహారాలను చక్క బెడుతున్నారు. చివరికి ఎమ్మెల్యేలు ఏ ఊరికెళ్లాలి.. ఎవరితో మాట్లాడాలి.. ఎవరితో మాట్లాడకూడదన్నది కూడా వారే డిసైడ్ చేస్తున్నారన్న అసంతృప్తి ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన ఆనం రామనారాయణరెడ్డిని కూడా ఐ ప్యాక్ ఇలా నియంత్రించాలనుకోవడంతో ఓ సారి సభలోనే ఐ ప్యాక్ ప్రతినిధిపై మండిపడ్డారు. ఆయన బయయపడ్డారు. చాలా మంది బయటపడలేదని చెప్పుకుంటున్నారు. పార్టీలో ఎవరిని చేర్చుకోవాలన్నా.. ఎవరినైనా బయటకు పంపాలన్నా.. ఐ ప్యాక్ ప్రతినిధులే డిసైడ్ చేస్తున్నారని అంటున్నారు. చివరికి సీఎం జగన్ దగ్గర బందువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా ముందుగా ఐ ప్యాక్ ప్రతినిధే మాట్లాడారని అంటున్నారు.
సీఎం జగన్‌కు దూరమవుతున్న అత్యంత సన్నిహితులు !
వైసీపీకి ఇటీవలి కాలంలో చాలా మంది రాజీనామా చేస్తున్నారు. జగన్ కు అత్యంత విధేయుడైన విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఆయన లేకుండా ఏ పని జరిగేది కాదు. గత ఎన్నికలకు ముందు ఐ ప్యాక్ టీం ఆయన కనుసన్నల్లోనే పని చేసేది. కానీ ఇప్పుడు ఆయన జాడలేదు. దీనికి ఐ ప్యాక్ కారణం అంటున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం జరగడానికి నెల్లూరులో పార్టీ చిందరవందర కావడానికి కూడా కారణం ఐ ప్యాకేనంటున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. ఓ సలహాదారుడ్ని నియమించి తనను లెక్కలోకి లేకుండా చేశారన్న కారణంతోనే పార్టీకి దూరమయ్యారు. చివరికి బాలినేని విషయంలోనూ అన్ని వేళ్లూ ఐ ప్యాక్ వైపు చూపిస్తున్నాయి. రిషిరాజ్ ఐ ప్యాక్ సిబ్బందిని విస్తృతంగా నియమించుకున్నారు. అలాగే ఇంటలిజెన్స్ వ్యవస్థను పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. ఇక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని జగన్ దాకా వెళ్లడం నేతలు ఫీలవుతున్నారు.
పార్టీ క్యాడర్, హైకమండ్‌కు మధ్య గ్యాప్
వైసీపీ పార్టీ క్యాడర్, హైకమాండ్ మధ్య గ్యాప్ పెరిగిపోయిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలతో కూడా నేరుగా సీఎం జగన్ ఈ నాలుగేళ్లలో సమావేశం అయిన సందర్భం లేదు. ఏదైనా సమీక్ష పెడితే ప్రసంగించి పంపేస్తున్నారు. ముఖాముఖి మాట్లాడటం లేదు. ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఇతర నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. అంతా ఐ ప్యాక్ చూస్తుందన్న కారణంగా జగన్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. ఫలితంగా పార్టీలో అవాంఛనీయమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు.