KCR Nehru : తెలంగాణకు అన్యాయం చేసింది నెహ్రూనేనా ? హఠాత్తుగా కేసీఆర్ వాదనలో మార్పెందుకు ?
తెలంగాణకు అన్యాయం చేసింది నెహ్రూనేనా ?కేసీఆర్ కొత్త వాదన ఎందుకోసం ? తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఇమేజ్కాంగ్రెస్‌కు ప్లస్ కాకుండానే కొత్త వాదనకాంగ్రెస్ కౌంటర్ ఇవ్వగలదా ?
KCR Nehru : తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రసంగంలో ఎవరూ ఊహించని.. ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పనిది.. తెలంగాణకు నెహ్రూ చేసిన అన్యాయం. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం గురించే. నిజానికి దేశంలో జరిగే అనర్థాలకు నెహ్రూను బీజేపీ నిందిస్తుంది. కానీ తెలంగాణకు కూడా నెహ్రూ అన్యాయం చేశారని కేసీఆర్ చెప్పడంతో చాలా మందికి కొత్త సందేహాలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చెప్పని విషయాలు ఇప్పుడు కేసీఆర్ ఎందుకు చెబుతున్నారు అనే సందేహం ఎక్కువ మందికి వస్తోంది. దీని వెనుక ఉన్న కేసీఆర్ వ్యూహం ఏమిటి ?
నెహ్రూ వల్లే తెలంగాణకు కష్టాలు
ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు ? దీనికి ఎవరు బాధ్యులు ? అంటే జవహర్‌లాల్ నెహ్రూ అని కేసీఆర్ తేల్చి చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు తెలంగాణ విద్యార్థులు, మేధావులు, ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారని కేసీఆర్ చెప్పారు. ఆనాడు ఉన్న కొండా వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వ్యతిరేకించినా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారన్నారు. ఇది చరిత్రలో రికార్డయ్యిందని.. . ఇక్కడి నుంచి విమానంలో వెళ్లే సమయంలో రామకృష్ణారావు తెలంగాణ తప్ప మరోమాట లేదని చెప్పారన్నారు. ఢిల్లీలో బలవంతంగా ఒప్పించిన తర్వాత.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో నెహ్రూ సాబ్ చెప్పిన తర్వాత ఏం మాట్లాడుతాం అన్నారని కేసీఆర్ చెప్పారు. ఇది కూడా చరిత్రలో ఉన్నది. ఇది కల్పిత కథ కాదని కూడా వివరించారు. ఆ విధంగా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ అని తేల్చేశారు. తెలంగాణ విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ కొనసాగించిందని కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణ ప్రజల్ని ఎంత రాచి రంపాన పెట్టారో.. ఎంత మందిని కాల్చి చంపారో.. ఆ ఘనత చరిత్ర అంతా కాంగ్రెస్‌కే చెందుతుందన్నారు .
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు క్రెడిట్ దక్కకూడదనేనా ?
తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన లాస్ట్ స్పీచ్.. ఎన్నికల ఎజెండాను ఖరారు చేసేదే. అందలో నెహ్రూ ప్రస్తావన ఉంది. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యయం గురించి ఉంది. అంటే.. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ కు ప్రజల్లో ఉన్న సానుకూలతను పూర్తిగా తగ్గించే వ్యూహంలోనే కేసీఆర్ ఈ ప్రకటనలు చేశారని భావిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్ల రాజకీయంగా తీవ్రంగా నష్టపోతామని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి తాము బలి అయ్యామని అంటున్నారు. దీనికి ప్రతిగా తమకు తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఒక్క ఓటు ఇవ్వాలని అడుగుతున్నారు. ఇలాంటి సెంటిమెంట్ వర్కవుట్ అయితే బీఆర్ఎస్‌కు ఇబ్బందికరమే. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను త్యాగం చేసి.. జాతీయ వాదంతో పార్టీ పెట్టారు.
ముందు ముందు కాంగ్రెస్‌పై కేసీఆర్ మరింత దాడి ఖాయం !
ముందు ముందు తెలంగాణకు అన్యాయం చేసిన కోణంలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ మరంత ఎక్కువగా విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెహ్రూ అంశాన్ని.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో వద్దన్నా కూడా తెలంగాణను ఏర్పాటు చేయడం సహా మిగతా అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తెలంగాణ ఇచ్చిన పార్టీ అనే సెంటిమెంట్ పెరగకుండా చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో కేసీఆర్ వ్యూహాన్ని పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ కౌంటర్ రాజకీయాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ కేంద్రం కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.