బీజేపీపై కేసీఆర్ దండయాత్ర-రెండోసారి హస్తినబాట
2024 లోకసభ ఎన్నికల నాటికి బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈమధ్యే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హైదరాబాద్ లో కేసీఆర్ ను కలిశారు.
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశ రాజకీయాలపై ఫోకస్ పెంచుతున్నారు. డిసెంబర్ 14న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించిన ఆయన వారం రోజులు అక్కడే మకాం వేశారు. ఈ నెలలో మరోసారి హస్తినకు పయనమవుతున్నారు గులాబీబాస్.
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జాతీయ రాజకీయాలపై జోరు పెంచిన ఆయన..ఈనెలలో రెండోసారి హస్తిన బాటపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ తర్వాత న్యూఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడానికి డిసెంబర్ 26 నుండి జనవరి 1 వరకు వారం రోజుల పాటు అక్కడే క్యాంప్ చేయనున్నారు. సరిగ్గా ఇదే సమయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన దక్షిణాది పర్యటనలో భాగంగా డిసెంబర్ 26 నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణకు రానున్నారు. కానీ అదే సమయంలో కేసీఆర్ రాష్ట్రంలో ఉండట్లేరు.
వాస్తవానికి డిసెంబర్లో ఒక వారం పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని నవంబర్ 24న సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణపై కేంద్రం పగబట్టిందని, ఆంక్షలతో ఇబ్బందులు పెట్టిందని, బీజేపీ తీరుతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించాలని అనుకున్నారు. అయితే ఈ వారం క్రిస్మస్ వేడుకలు, మరియు న్యూఢిల్లీలో వారం రోజుల పర్యటన కారణంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఇప్పట్లో కష్టమేనని తెలుస్తోంది. జనవరిలో సంక్రాంతికి ముందే సీఎం సభను షెడ్యూల్ చేసే అవకాశం ఉందని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి.
అంతకుముందు డిసెంబర్ 12 నుంచి 16 వరకు ఐదు రోజుల పాటు దేశ రాజధానిలో క్యాంపు చేసిన సీఎం.. డిసెంబర్ 14న బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, జనతాదళ్తో నాయకుడు H.D. కుమారస్వామితో పాటు రైతు సంఘాల నాయకులతోనూ సమావేశమయ్యారు.
2024 లోకసభ ఎన్నికల నాటికి బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈమధ్యే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హైదరాబాద్ లో కేసీఆర్ ను కలిశారు. ఈసారి ఢిల్లీ టూర్ లో భాగంగా మరికొంతమంది జాతీయ నేతలతో కూడకట్టేందుకు బీఆర్ఎస్ అధినేత ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.