వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ- ఏం చెప్పబోతున్నారు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో జరిగే సమావేశంలో సీఎం ఏమి చెప్తారు? ఏమని దిశానిర్దేశం చేస్తారు? గృహ సారథుల ఎంపిక జరగక పోవడంపై సీఎం జగన్ అసంతృప్తితో ఉన్నారా?
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ ఇంఛార్జ్‌ల ముఖ్యనేతలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమవుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతోపాటు కీలక అంశాలు చర్చిస్తారని టాక్ నడుస్తోంది. గృహ సారథుల ఎంపిక నెలాఖరులోగా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. కానీ ఇంత వరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తోంది. మరో వారంలోపు దీన్ని పూర్తి చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని సీఎం జగన్‌ను నేతలు రిక్వస్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనికి సీఎం అంగీకరిస్తారా లేకుంటే నేతలకు క్లాస్ తీసుకుంటారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. అత్యంత కీలకమైన నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఒకవైవు కోటంరెడ్డి, మరోవైపు ఆనం. దీంతో ఇలాంటి ఇబ్బందులు ఉన్న జిల్లాలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు సీఎం జగన్. అదే జాబితాలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా ఉందని నేతలు చెబుతున్నారు. మచిలీపట్టణం పార్లమెంట్ పరిధిలో ఎంపీ బాలశౌరితో అవనిగడ్డ శాసన సభ్యుడు సింహాద్రి రమేష్, మచిలీపట్టణం శాసన సభ్యుడు మాజీ మంత్రి పేర్ని నాని మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎంపీకి వ్యతిరేకంగా రెండు నియోజకవర్గాలకు చెందిన శాసన సభ్యులు, వారి అనుచురులు బాహాటంగా గొడవలకు దిగారు. ఈ పంచాయితీ కూడ జగన్ టేబుల్‌పై ఉంది.
మైలవరం, పెడన నియోజకవర్గాలకు చెందిన శాసన సభ్యుల వ్యవహరం కూడ జగన్ లిస్ట్‌లో ఉందని చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన మంత్రి కావటంతో జోగి రమేష్‌కు అత్యంత వెయిట్ ఇస్తున్నారు సీఎం జగన్. దీంతో పార్టీలోనే ఇతర పెద్దలు కూడా జగన్‌నే ఫాలో అవుతున్నారు. దీంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. నియోజకవర్గంలో తనను పని చేసుకోనివ్వకుండా మంత్రి జోగి రమేష్ రెచ్చిపోయి వ్యవహరించటంపై వసంత తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇలాంటి వివాదాలు ఇంకా పలు నియోజకవర్గాల్లో కూడ ఉన్నాయి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్‌లో మరింత ఇబ్బందిగా మరే అవకాశం కూడా ఉంది. దీనిపై చర్చ జరగనుంది.
లోకేష్ పాదయాత్ర....
ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. త్వరలో పవన్ కూడా రెడీ అవుతారు. పొత్తులపై కూడా దాదాపు క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది. దీంతో రెండు మూడు నెలల్లో ఇంచుమించు అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యే నాటికి పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు జగన్. దీంతో గడప గడపకు మన ప్రభుత్వంపై కూడా త్వరలో పూర్తి అవుతుంది. ఈ అంశాలపై కూడా పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, ఎన్నికల వాతావరణం పూర్తిగా ఏర్పడినందు వల్ల పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, వాటి అమలుకు ఎలాంటి వ్యూహం ఉండాలనే అంశాలను జగన్ పార్టీ నేతలకు సూచిస్తారని అంటున్నారు.
ఎవరెవరికి వార్నింగ్
ఎమ్మెల్యేల పరిస్థితి ఎవరికి సీట్ డౌట్ అనే అంశంపై కూడా క్లారిటీ వచ్చేస్తుందని నేతలు అంటున్నారు. ఈ అంశంపై జగన్ ముఖ్య నేతలకు చెప్పే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. పని తీరు అంతంత మాత్రంగా ఉన్న నేతలతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడటంతో పాటుగా, రాబోయే రెండు నెలలకు టాస్క్ ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. మొత్తానికి పార్టీ ముఖ్యనేతలతో జగన్ జరిపే సమావేశం కీలకం కానుంది.