YS Jagan ON MLAs : 8 నెలల పాటు గడప గడపకు - 175 సీట్లు కష్టమేం కాదన్న సీఎం జగన్ !
ఎనిమిది నెలల పాటు గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రతీ నెలా వర్క్ షాప్ ఉంటుందని ప్రకటించారు.
YS Jagan On MLAs : గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం దాదాపు 8 నెలలపాటు ఈకార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన వర్క్ షాప్‌లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. 175 సీట్లు గెలవడం పెద్ద కష్టమేం కాదని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో ప్రారంభమైన వర్క్ షాప్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలి. ఇది మన లక్ష్యం, ఇది కష్టం కాదు. ఎందుకంటే.. ప్రతి ఇంటికీ మీరు వెళ్తున్నారు, ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరిస్తున్నారు. ఏయే పథకాలు ఆ కుటుంబానికి అందాయో చెప్తున్నారు.
కుప్పం మున్సిపాలిటీ గెలుస్తామని అనుకున్నామా ?
కుప్పం మున్సిపాలిటీని గెలుస్తామని అనుకున్నామా ? ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్ స్వీప్ చేస్తామని అనుకున్నామా ? కానీ గెలిచామన్నారు. ఎందుకు జరిగింది? అలాగే 175కి 175 సాధించగలుగుతాం. ఇది జరగాలి అంటే.. మనం కష్టపడాలని ప్రతి సచివాలయంలోనూ కచ్చితంగా 2 రోజులు గడపగడపకూ నిర్వహించాలన్నారు. ప్రతి నెలలో 10 సచివాలయాలు నిర్వహించేలా ప్రణాళిక వేసుకోవాలని సూచించారు.
నెలకోసారి వర్క్ షాప్
గడపగడపకూ కార్యక్రమాన్ని ఏ రకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అన్నదాన్నికూడా మనం నిరంతరంగా చర్చించుకోవాలనే వర్క్ షాప్ ఏర్పాటు చేశామని .. నెలకో సారి ఈ వర్క్ షాప్ జరుగుతుందన్నారు. ఆ నెలరోజుల్లో చేపట్టిన గడపగడపకూ కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా మనకు వచ్చిన ఫీడ్ బ్యాక్‌పై ఈ వర్క్‌షాపులో చర్చిస్తామని.. ఇంకా మెరుగ్గా, సమర్థవంతంగా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్నదానిపై ఈ వర్క్‌షాపుల్లో దృష్టిసారిస్తామని తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్యం !
ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశాం సంతృప్తిస్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నాం. కాలర్ ఎగరేసుకుని తిరగగలుగుతున్నామని.. మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతును మనం తీసుకోవడమేనని జగన్ స్పష్టం చేశారు. గడపగడపకూ కార్యక్రమాన్ని ఏరకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అన్నదాన్నికూడా మనం నిరంతరంగా చర్చించుకోవాలని అందుకే వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలనుంచి వచ్చిన విజ్ఞాపనలు, ఆ విజ్ఞాపనల పరిష్కారం కూడా అత్యంత ముఖ్యమైనదని వీటిపై దష్టి పెట్టారన్నారు. రాష్ట్రంలోని 87శాతం కుటుంబాలకు పథకాలు చేరాయన్నారు.