Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Congress: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాేధించడానికి కుల జనగణన మాత్రమే అస్త్రంగా కనిపిస్తోంది. దేశాన్ని విభజిస్తున్నారన్న విమర్శలు వస్తున్నా రాహుల్ అందుకే వెనక్కి తగ్గడం లేదు.
Caste census to be the only weapon for the Congress party: దేశ రాజకీయాలు కుల, మతం మధ్య నలిగిపోతున్నాయి. బీజేపీ చేస్తున్న హిందూత్వ రాజకీయాలకు కులం ద్వారానే కౌంటర్ ఇస్తేనే వర్కవుట్ అవుతుందన్న నిర్ణయానికి వచ్చిన రాహుల్ గాంధీ తమ పార్టీ సింగిల్ ఎజెండాగా కులగణనను తీసుకుని దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణనను ప్రతిష్టాత్మకంగా చేయిస్తున్నారు. తెలంగాణలో కులగణన ప్రారంభించే ముందు వచ్చి ఆయన ఇచ్చిన సందేశం ఈ విషయాన్ని క్లియర్ చేస్తోంది. కులగణన చేసి రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తామని ఆయన చెప్పడం ఈ వ్యూహంలో భాగం అనుకోవచ్చు.
రాజకీయాల్లో కులసమీకరణాలే కీలకం !
స్వతంత్ర భారతావనిలో జరిగిన ఏ ఎన్నికలను చూసుకున్నా రాజకీయ పార్టీల రాజకీయం, ఎన్నికల వ్యూహాలు మొత్తం కులం ప్రకారమే ఉంటాయి. స్వాతంత్రం వచ్చిన మొదట్లో కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు ఉండేది.రాను రాను కాంగ్రెస్ కేవలం ముస్లింలు, దళితల మద్దతునే నిలబెట్టుకోగలిగింది. నిజానికి చాలా రాష్ట్రాల్లో ఈ వర్గాలు కూడా వేరే పార్టీల వైపు వెళ్లిపోయాయి. యూపీ వంటి రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ కనీసం వంద లోక్ సభ సీట్లు గెల్చుకోవడమే ఓ పెద్ద సవాల్ గా మారింది.
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులాలను ఆకట్టుకుంటేనే మనుగడ !
కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా తమ పార్టీని వదిలేసిన కులాలను ఆకట్టుకోవడానికి ఇప్పుడుకొత్తగా ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి అస్త్రమే కులగణన. దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి ఉంది. అందుకే చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించి చేతులు దులిపేసుకుంటున్నాయి. ఇదే అంశాన్ని పట్టుకున్న రాహుల్ గాంధీ ..తాము అధికారంలోకి వస్తే పార్లమెంట్ చట్టం ద్వారా రిజర్వేషన్ల పరిమితి ఎత్తేసి కులగణన చేపట్టి అందిరకీ అవకాశాలు కల్పిస్తామని అంటోంది. రాహుల్ గాంధీ ఈ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
కులాల పరంగా అవకాశాలు కల్పించడం సాధ్యమేనా?
కులాల పరంగా అందరికీ అవకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. బీసీ వర్గాలను ప్రధానంగా ఆయన టార్గెట్ చేసుకున్నారు. ప్రతి వర్గం తమ జనాభాఎక్కువ ఉందని తమకు ఇంకా ఎక్కువ అవకాశాలు రావాల్సి ఉందని అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా రాహుల్ అదే పాయింట్ ను పట్టుకున్నారు. తెలంగాణ కులగణనలో వచ్చే ఫలితాలతో అధికారికంగా రిజర్వేషన్లు కల్పించలేకపోవచ్చు కానీ అనధికారికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించి తాము చిత్తశుద్ధితో ఉన్నామని నిరూపించి.. దేశవ్యాప్తంగా ఈ మోడల్ చూపించాలని అనుకుంటున్నారు. మొత్తంగా కులంతో బలపడాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు ఎంత వరకూ నమ్ముతారో మరి !