BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?
జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?మూడో ప్రత్యామ్నాయానికి చోటు లేకపోతే బీఆర్ఎస్ ఎందుకు పెట్టారు ?బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలతో భేటీకి వెనుకాడటం ఎందుకు ?
BRS Politics : " దేశంలో మూడో.. నాలుగో ఫ్రంట్‌కు ఉనికి లేదు " అని భారత రాష్ట్ర సమితి తేల్చేసింది. బీజేపీకి ప్రత్యామ్నాయం ఉండాల్సిందేనని ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించి.. నేరుగా జాతీయ పార్టీపెట్టిన కేసీఆర్ మూడో కూటమికి చాన్స్ లేదని ప్రకటించడం ఆశ్చర్యకరమే. జూన్12 వ తేదీన పట్నాలో విపక్షాల సమావేశం జరుగుతోంది. గతంలో కేసీఆర్ కలిసిన..కేసీఆర్‌ను కలిసిన వాళ్లంతా హాజరవుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం వెళ్లడం లేదు. వచ్చే ఎన్నికలకు ముందు ఇది అత్యంత కీలకమైన సమావేశంగా .. విపక్ష కూటమి ఐక్యతను తెలిపే సమావేశం గా చెబుతున్నా.. కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణంగా మూడో కూటమికి ఉనికి లేదనే కారణం చెబుతున్నారు.
బీఆర్ఎస్ కూడా బీజేపీకి ప్రత్యామ్నాయం కాదా ?
వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ పీఠం ఎక్కబోతున్నామని కేసీఆర్ చాలా సార్లు ధీమాగా చెప్పారు. భారతీయ జనతా పార్టీని ముఖ్యంగా నరేంద్రమోదీని మరోసారి ప్రధాని కాకుండా అడ్డుకోవాలన్న లక్ష్యంతో పట్నాలో పన్నెండో తేదీన సమావేశం అవుతున్నాయి. విపక్షాల ఐక్యను దేశ ప్రజల ముందు ఉంచడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉంటామనుకున్న ప్రతి పార్టీ ఈ సమావేశానికి వెళ్తోంది. కానీ బీజేపీపై భీకర యుద్ధం ప్రకటించిన బీఆర్ఎస్ మాత్రం వెళ్లడం లేదు. దేశంలో మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉందని.. ఫెడరల్ ఫ్రంట్ పెడతానని దేశవ్యాప్తంగా తిరిగిన నేత కేసీఆర్. వర్కవుట్ కాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీకు ప్రత్యామ్నాయంగా మరో వేదిక ఉండాలని తన పార్టీ పేరుతో భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. కానీ ఇప్పుడు కేటీఆర్ అనూహ్యంగా మూడో ప్రత్యామ్నాయం లేదన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు.
జాతీయ రాజకీయాలను ప్రస్తుతానికి ఆపేశారా ?
బీజేపీని గద్దె దించాలన్సిందేనన్న లక్ష్యంతో కేసీఆర్ తన పార్టీని బీార్ఎస్ గా మార్చారు. తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ ట్విస్ట్ ఇవ్వడానికి చేయాల్సినదంతా చేశారు. బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి సునాయసంగా గెలుస్తారని తెలిసినా మద్దతు ఇవ్వలేదు. విపక్ష కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అప్పట్నుంచి నెల రోజుల కిందటి వరకూ కేసీఆర్ యుద్ధం చేసినట్లుగానే కనిపించారు. ఇతర పార్టీల నాయకులకూ అదే భావన కల్పించారు. తాను జాతీయ పార్టీ పెట్టేశానని ఇక విస్తృతంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తిరిగి పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. కానీ ఏపీలో పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికీ వెళ్లలేదు. ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ప్రారంభించిన విషయం కూడా ఎవరికీ తెలియదు.
బీజేపీపై పోరాటానికి వెనక్కి తగ్గుతున్నారా ?
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో ఏ మాత్రం లడాయి పెట్టుకోవాలన్న ఆలోచన కేసీఆర్ కు లేదని అంటున్నారు. ఇటీవల కేజ్రీవాల్ తెలంగాణకు వచ్చినప్పుడు బీజేపీ విమర్శించారు.. కానీ అందులోనూ ఎన్నో పరిమితులు పెట్టుకున్నారు. బీజేపీ వైపు నుంచి ఏమైనా రాజీ సంకేతాలు వచ్చాయా లేకపోతే అసలు బీజేపీని రెచ్చగొట్టడం ఎందుకన్న ఉద్దేశంతో ఆయన సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉంది. ఫామ్ హౌస్ కేసులో సీబీఐ విచారణ అంటూ జరిగితే.. సాక్ష్యాలు బయట పెట్టిన కేసీఆర్ ను విచారణ జరపాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఆర్థికపరమన ఎన్నో అవకతవకల విషయంలో కేసీఆర్ కంగారు పడుతున్నారని.. ఇలాంటి సమయంలో బీజేపీతో పెట్టుకోవడం కన్నా సొంత రాష్ట్రంలో కుర్చీ కాపాడుకోవడం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారని అంటున్నారు.
కారణం ఏదైనా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిన లక్ష్యానికి చాలా దూరంగా వెళ్తున్నారు. తమ పార్టీని బీఆర్ఎస్ గా మార్చామనే సంగతిని కూడా క్యాడర్ మర్చిపోతున్నారు. తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా ఆయనను ఇతర పార్టీలు నమ్మే అవకాశాలు తక్కువ.