BRS: భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు - కేసీఆర్ కీలక ప్రకటన
Telangana News: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటివరకూ హైదరాబాద్ మినహా అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది.
KCR Announced Bhongir And Nalgonda Mp Candidates: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి, నల్గొండ ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని అభ్యర్థులుగా శనివారం ప్రకటించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను ఎంపిక చేసిన గులాబీ బాస్.. మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో ఒక్క హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం ఇచ్చిన కేసీఆర్.. ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి కూడా టికెట్ ఇచ్చారు. ఐదుగురు బీసీలకు అవకాశం కల్పించగా.. ఇద్దరు విశ్రాంత అధికారులకు సైతం టికెట్లు కేటాయించారు.
సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి
అటు, సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను కేసీఆర్ శనివారమే ప్రకటించారు.ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో శనివారం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆయన గతంలో డిప్యూటీ స్పీకర్, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. కాగా, సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ బరిలో నిలవగా.. బీజేపీ తరఫున కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే
☛ నాగర్ కర్నూల్ - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
☛ మహబూబ్ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి
☛ సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్
☛ భువనగిరి - క్యామ మల్లేశ్
☛ నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి
☛ మెదక్ - వెంకట్రామిరెడ్డి
☛ కరీంనగర్ - వినోద్ కుమార్
☛ పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్
☛ జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్
☛ ఖమ్మం - నామా నాగేశ్వరరావు
☛ చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్
☛ మహబూబాబాద్ - మాలోతు కవిత
☛ మల్కాజిగిరి - రాగిడి లక్ష్మారెడ్డి
☛ ఆదిలాబాద్ - ఆత్రం సక్కు
☛ నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్థన్
☛ వరంగల్ - కడియం కావ్య
కాగా.. హైదరాబాద్ నుంచి పోటీలో బీసీ అభ్యర్థినే కేసీఆర్ ఖరారు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ అదే జరిగితే.. రిజర్వుడ్ పోగా మిగిలిన 12 సీట్లల్లో 6 సీట్లు అంటే 50 శాతం బీసీలకే కేటాయించినట్లు అవుతుంది. కాగా.. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ పోగా మిగిలిన 12 స్థానాల్లో ఓసీలకు 6 సీట్లను కేటాయించారు. వాటిలో నాలుగు రెడ్లకు, ఒకటి కమ్మ, ఒకటి వెలమ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ కేటాయించింది. అభ్యర్థుల ఎంపికలో గులాబీ బాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: Addanki Dayakar : కాంగ్రెస్‌లో అద్దంకి దయాకర్‌కు పదేపదే నిరాశ - రేవంత్ మాట కూడా చెల్లడం లేదా ?