(Source: ECI/ABP News/ABP Majha)
Addanki Dayakar : కాంగ్రెస్‌లో అద్దంకి దయాకర్‌కు పదేపదే నిరాశ - రేవంత్ మాట కూడా చెల్లడం లేదా ?
Telangana News : అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్‌లో అవకాశాలు లభించడం లేదు. గట్టి వాయిస్ ఉన్న దళిత నేత, రేవంత్ సన్నిహితుడు అయినా ప్రయోజనం ఉండటం లేదు.
Adnaki Dayakar is not getting chances in Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దురదృష్ట వంతుడు ఎవరు అంటే.. అద్దంకి దయాకర్ పేరు చెప్పారు. ఆయన కాంగ్రెస్‌కు గడ్డు కాలం ఉన్న రెండు సార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయనుకున్నప్పుడు ఆయనకు టిక్కెట్ దొరకలేదు. అయినా పార్టీ కోసం కష్టపడ్డారు. ఇదిగో ఎమ్మెల్సీ అన్నారు. అదీ రాలేదు. చివరి క్షణంలో పేరు మారిపోయింది. తర్వాత వరంగల్ ఎంపీ టిక్కెట్ అన్నారు. ఆ పేరూ మారిపోయింది. కంటోన్మెంట్ ఉపఎన్నికలో అయినా సీటు వస్తుందనుకుంటే.. బీజేపీ నేతను చేర్చుకున్నారు. దీంతో అద్దంకి దయాకర్‌కు నిరాశే ఎదురవుతోంది.
కాంగ్రెస్‌నే అంటి పెట్టుకుని ఉన్న అద్దంకి దయాకర్
అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైంది. 2014 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొదటిసారి 1,847 ఓట్లతో, రెండవసారి 2,379 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మూడవసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే అసలు టిక్కెట్టే దక్కలేదు. అద్దంకి దయాకర్ కు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది. అయినా ఆయనకు అవకాశాలు రావడం లేదు.
కోమటిరెడ్డి బ్రదర్స్ తో వైరమే పెద్ద మైనస్సా ?
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఉపఎన్నిక వచ్చిన సమయంలో రేవంత్ రెడ్డి మునుగోడులో సభ ఏర్పాటు చేశారు. ఆ సభకి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఆ సభలో ప్రసంగించిన అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఉంటే ఉండు వెళ్తే వెళ్ళు అని దూషించారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. అద్దంకి బేషరతుగా కోమటిరెడ్డి వెంకట రెడ్డికి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ అద్దంకికి టికెట్ రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకున్నారని, ప్రస్తుత తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ని బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇప్పించడంలో చక్రం తిప్పారని చెప్పుకుంటారు.
నల్లగొండ నేతలకు పదవులివ్వాలంటే కోమటిరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి !
టికెట్ ఇప్పించలేనందుకు అద్దంకి దయాకర్ కి క్షమాపణలు చెప్పినట్టు స్వయంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీగా గెలిపించుకుంటామని రేవంత్ బహిరంగంగానే ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆఖరి వరకూ అద్దంకి దయాకర్ పేరు వినబడింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో నామినేషన్ పత్రాలు రెడీ చేసుకోవాలని పార్టీ పెద్దలు ఫోన్ చేశారని, అనుచరులు సంబరాలు కూడా జరుపుకున్నారు. చివరి నిమిషంలో జాబితాలో అద్దంకి దయాకర్ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి వెళ్లిన లిస్ట్ లో పేరు లేని మహేష్ గౌడ్ కి పదవి దక్కడం గమనార్హం. రాజ్యసభ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ కి అవకాశం దక్కుతుందేమో అనుకున్నారు కానీ, రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ల పేర్లు ఫైనల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని అద్దంకి దయాకర్ అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి వరంగల్ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లోకి రావడంతో ఆయనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది.