Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?
బండి సంజయ్ రీ ఓపెన్ చేయిస్తామంటున్న బెంగళూరు డ్రగ్స్ కేసేమిటి ? అందులో నిందితులు ఎవరు ?
![Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ? Bandi Sanjay wants to re-open what is Bengaluru drugs? Who are the accused? Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/f9ba82424e2141170102a0e9279fc38d1670428761725228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bandi sanjay Drugs Case: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దాదాపుగా ప్రతీ రోజు బెంగళూరు డ్రగ్స్ కేసు గురించి చెబుతున్నారు. ఆ కేసును రీ ఓపెన్ చేయిస్తామని హెచ్చరిస్తున్నారు. ఆ కేసులో సాక్ష్యాలతో సహా కొంత మంది పట్టుబడిన అక్కడి పోలీసులు, రాజకీయ నేతలకు డబ్బులు కట్టి బయట పడ్డారని ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కావడంతో .. ఆ కేసును రీఓపెన్ చేయించడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతో అసలు ఆ డ్రగ్స్ కేసేమిటి అన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. అందులో ఎవరెవరు ఉన్నారన్న చర్చ ప్రారంభమయింది.
గత ఫిబ్రవరిలో డ్రగ్స్ రాకెట్‌ను ప్టటుకున్న బెంగళూరు పోలీసులు !
గత ఏడాది ఫిబ్రవరి 26న బెంగళూరు తూర్పు డివిజన్ పోలీసులు సినీ ప్రముఖులకు మత్తు మందులు సరఫరా చేసేందుకు వచ్చిన నైజీరియాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద లభించిన సమాచారంతో డ్రగ్స్ ఖాతాదారుల్లో శంకరగౌడ, తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారులు, శాసనసభ్యుల పేర్లు వెలుగులోకి చ్చాయి. హైదరాబాద్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి సందీప్‌రెడ్డితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ చోటా హీరోను బెంగళూరు పోలీసులు పిలిపించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కలహర్‌రెడ్డి, రతన్‌రెడ్డి అనే వ్యాపారస్తుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరు తెలంగాణ ఎమ్మెల్యేలను పార్టీల కోసం బెంగళూరు తీసుకొచ్చేవారని గుర్తించారు. వీరిని అక్కడి పోలీసులు నోటీసులు జారీ చేసి ప్రశ్నించారు. కలహర్‌రెడ్డి పలువురు శాసనసభ్యుల పేర్లు చెప్పినట్లుగా అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది.
డ్రగ్స్ పార్టీలు ఇచ్చే సినీ నిర్మాత శంకరగౌడ !
ఆ డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి, కన్నడ సినీ నిర్మాత శంకరగౌడ బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఏర్పాటు చేసే పార్టీలకు ప్రతిసారి తెలంగాణ నుంచి అనేకమంది హాజరయ్యేవారు.కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన శంకరగౌడ డాలర్స్ కాలనీతోపాటు ఓ ప్రముఖ హోటల్‌లో తాను నిర్వహించే పార్టీలకు ప్రముఖులను ఆహ్వానించేవాడు. ఇందుకోసం కలహర్‌రెడ్డి, రతన్‌రెడ్డి వంటివారిని మధ్యవర్తులుగా వాడుకునేవాడని బెంగళూరు పోలీసులు గుర్తించారు. కన్నడ సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో శంకరగౌడ పరిచయం కోసం హైదరాబాద్‌కు చెందిన రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఉత్సాహం కనబరిచేవారు. వీరికి శంకరగౌడ బెంగళూరులో పార్టీలకు పిలిచేవాడు.
ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారని గతంలో విస్తృత ప్రచారం !
ఈ డ్రగ్స్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. ముగ్గురు శాసనసభ్యుల పేర్లు బెంగళూరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కగాయని కూడా చెప్పుకున్నారు. డ్రగ్స్ పార్టీలు జరిగిన సమయంలో ఆ ఎమ్మెల్యేలు బెంగళూరులో ఉన్నట్లు కొన్ని సాంకేతిక ఆధారాలు కూడా సేకరించారని అక్కడి మీడియా వెల్లడించింది. ఈ ఎమ్మెల్యేల్లో ఒకరు.. ఇటీవల ఫామ్ హౌస్ కేసులో కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. అందుకే బండి సంజయ్ ఆ కేసును మళ్లీ ఓపెన్ చేయిస్తామని.. డ్రగ్స్ నిందితుల్ని జైలుకు పంపిస్తామని అంటున్నారు.
కర్ణాటకలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగా ఇలాంటి కేసుల్ని రీ ఓపెన్ చేయించి రాజకీయంగా ఇబ్బందిపడే ఆలోచనలు చేయకపోవచ్చని అక్కడి రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే బండి సంజయ్ మాత్రం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అందుకే ఏమైనా జరగవచ్చని అంచనా వేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)