AP Voter List Revision SIR Process: కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
Kuppam Pulivendula Bogus Votes: ఏపీ రాజకీయాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ హాట్ టాపిక్‌గా మారింది. కుప్పం, పులివెందుల నియోజకవర్గాల్లో ఓట్లు కాపాడుకునేందుకు టీడీపీ, వైసీపీ భారీ సమరమే చేస్తున్నాయి.

TDP YSRCP Booth Level Strategy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, అధికార కూటమి , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెలల ముందు నుంచే ఈ ఓట్ల వడపోత ప్రక్రియపై తీవ్రంగా కసరత్తు చేశాయి. పోలింగ్ బూత్‌ల వారీగా తమ పార్టీ ఓట్లు ఎలా కాపాడుకోవాలి, ప్రత్యర్థుల అక్రమ ఓట్లను ఎలా తొలగించాలనే అంశాలపై ఇరు పార్టీలు ఇప్పటికే క్షేత్రస్థాయి కార్యకర్తలకు వర్క్‌షాపులు కూడా నిర్వహించాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రెండు పార్టీల శ్రేణులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాయి.
కుప్పుం, పులివెందులలో ఎన్ని ఓట్లు తగ్గుతాయి?
కుప్పం, పులివెందుల నియోజకవర్గాల ఓటర్ల జాబితాలపై ప్రతిసారీ తీవ్రమైన వివాదాలు, ఆరోపణలు వస్తూనే ఉంటాయి. కుప్పంలో దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ, పులివెందులలో భారీగా బోగస్ ఓట్లు చేర్చారని టీడీపీ దశాబ్దాలుగా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఈ రెండు స్థానాల్లో నిరంతరాయంగా నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ కుటుంబ సభ్యులు విజయం సాధిస్తూ వస్తుండటమే కాకుండా, వారి మెజార్టీలు కూడా భారీ స్థాయిలో ఉండటమే. ఈ సారి జరుగుతున్న ‘సర్’ ప్రక్రియలో ఈ రెండు ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఏ స్థాయిలో ఓట్ల మార్పులు జరుగుతాయనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
స్టాలిన్, మమత ఓటమి SIR వల్లేనని జగన్ భావన
ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఓట్ల తొలగింపుపై జాతీయ రాజకీయాల ఉదాహరణలను ప్రస్తావించడం ఈ చర్చను మరింత తీవ్రం చేసింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ తన సొంత కోట అయిన భవానీపూర్‌లో, అలాగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో కేవలం ఓట్ల తొలగింపు వ్యూహాల వల్లే తీవ్ర ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చిందని జగన్ వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వంటి ప్రక్రియల ద్వారా లక్షలాది ఓట్లను తొలగించడం అధికార పక్షాల విజయవకాశాలను ఎలా దెబ్బతీస్తుందో ఆయన ఉదహరించారు.
నిజానికి, ఎన్నికల సంఘం చేపట్టే ఈ ఓటర్ల జాబితా సవరణ అనేది బోగస్ ఓట్లను, చనిపోయిన వారి పేర్లను, ఊర్లలో లేని వారి ఓట్లను తొలగించి జాబితాను ప్రక్షాళన చేయడానికి ఉద్దేశించిన ప్రక్రియ. కానీ, రాజకీయ పార్టీలు మాత్రం దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా చూసుకోవడం, అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీకి పడే వలస ఓట్లు, డబుల్ ఓట్లను టార్గెట్ చేయడం సర్వసాధారణంగా మారింది. ఈసారి కుప్పం, పులివెందుల నియోజకవర్గాల్లో ఇరు పార్టీల యంత్రాంగం బూత్ లెవెల్ ఏజెంట్లను అప్రమత్తం చేసి, అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తమ పార్టీ సానుభూతిపరులైన ఓటర్లు ఎవరైనా ఊర్లలో లేకపోయినా, వారి ఓట్లు ఆబ్సెంటి కింద డిలీట్ కాకుండా ఉండేందుకు ఇరుపక్షాల లీడర్లు ప్రత్యేక నిఘా పెట్టారు. ఒకవేళ ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఫామ్-7 ద్వారా ఓట్లను తొలగించాలని చూస్తే, వెంటనే ఫామ్-6 ద్వారా రీ-అప్లై చేయించేందుకు డిజిటల్ టీమ్‌లను కూడా సిద్ధం చేసుకున్నారు.
ఓటర్ల జాబితానే కీలకం
ఈ ‘సర్’ ప్రక్రియ ఏపీలో రాబోయే ఎన్నికల ఫలితాలను శాసించే కీలక శక్తిగా మారబోతోంది. కుప్పంలో చంద్రబాబు మెజార్టీని తగ్గించాలని వైసీపీ, పులివెందులలో జగన్ పట్టును సడలించాలని కూటమి భావిస్తున్న తరుణంలో.. ఈ ఓట్ల వడపోత ఉత్కంఠ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. కేవలం జనాకర్షక పథకాలు, ప్రచారాలే కాకుండా.. తెరవెనుక జరిగే ఈ ఓట్ల రక్షణ యుద్ధం లో ఎవరు పైచేయి సాధిస్తే, వారికే భవిష్యత్తు రాజకీయాల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















