BJP Vs AP Govt : "వాళ్లకి మాత్రమే" డ్రోన్ పైలట్ ట్రైనింగ్ నిజం - అబద్దం కూడా ! ప్రభుత్వంలో ఎందుకింత గందరగోళం ?
మైనార్టీలకు మాత్రమే డ్రోన్ పైలట్ శిక్షణ నిజమని ఏపీ మైనార్టీ శాఖ చెబుతోంది. అయితే డ్రోన్ కార్పొరేషన్ మాత్రం ఖండిస్తోంది. ప్రభుత్వం ఒక్క తప్పు కప్పి పుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తోందని బీజేపీ నేతలు మండి పడుతున్నారు.
BJP Vs AP Govt : ఆంధ్రప్రభుత్వం డ్రోన్ పైలట్ శిక్షణను కేవలం ముస్లింలు, క్రిస్టియన్లకు మాత్రమే ఇస్తోందని .. ఇతర వర్గాల వారికి ఎందుకు ఆ అవకాశం కల్పించడం లేదని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయింది. దీంతో ప్రభుత్వం ఒక్క సారిగా ఉలిక్కి పడింది. కానీ నేరుగ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి మాత్రం ఈ వార్తాలన్నీ అవాస్తవాలని చెబుతూ.. ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అసలు నిజం ఏమిటో ఆయన చెప్పలేదు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది కాబట్టి అది నెగెటివ్ అవుతుందేమోనన్న ఉద్దేశంతో విషయం తెలియకుండా ఆయన ఖండన ప్రకటన చేసినట్లుగా ఉంది. ఎందుకంటే డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇప్పటికే ప్రారంభమయిందని ఈ నెల 23వ తేదీన మైనార్టీస్ వేల్ఫేర్ డిపార్టుమెంట్ యండి మస్తాన్ వలీ స్వయంగా సంతకం చేసిన ప్రకటన ఒకటి మీడియాకు విడుదల చేశారు. అందులో స్పష్టంగా మైనార్టీలకు మాత్రమే పరిమితం చేయబడిందని.. ఇతర శాఖలు ఇతర వర్గాలకు ఇలాంటి కార్యక్రమాలు రూపొందిస్తాయని ఆ ప్రకటనలో స్పష్టంగా ఉంది.
నిజానికి ఇలా చేయడం మొదటి సారి కాదని ఇప్పటికే పలువురు మైనార్టీ యువతకు ట్రైనింగ్ ఇచ్చారని వారికి 70 శాతం ఉద్యోగాలొచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. గతంలో ప్రభుత్వం స్కిల్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన ప్రకటనలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
శిక్షణ మాత్రమే ఇస్తారు . సర్టిఫికెట్ ఇవ్వరు.. మైనార్టీ యువతకూ భారమే.!.
నిజానికి రాష్ట్ర మైనార్టీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ వారికి కూడా భారంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో వందేసి మందికి చొప్పున 45 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఈ ట్రైనింగ్ కోసం ప్రభుత్వం కొంతమంది నిపుణులను రప్పించి వారితో ఫీజులు చెల్లించి వారితో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తుంది. ఈ 45 రోజులూ విద్యార్థులు బస, భోజనం వంటివి సొంతంగానే ఏర్పాటుచేసుకోవాలి. మైనారిటీ వర్గాలు అంటేనే వారి ఆర్థిక స్థోమత అంతంతమాత్రం. వారిలో ఎక్కువ మంది నిరుపేదలే ఉంటారు. మరి వాళ్ళు వేరే జిల్లాల్లో 45 రోజులు నివాసం ఉంటూ శిక్షణ పొందడం అంటే వారికి తలకు మించిన భారమే అవుతుంది. అంతే కాదు ట్రైనింగ్‌కు సంబంధించిన సర్టిఫికెట్స్ ఇప్పించే విషయంలో తమకు బాధ్యత లేదు అంటోంది.
డీజీసీఏ అనుమతి ఉండాల్సిందే !
వాస్తవానికి డ్రోన్ శిక్షణ పొందినంత మాత్రాన అందరూ డ్రోన్లు ఎగరేయలేరు. డీజీసీఏ వారి నుంచి సర్టిఫికెట్ పొందిన వారు మాత్రమే ఈ డ్రోన్లు వినియోగించవచ్చు ఆపరేట్ చేయవచ్చు. ఈ సర్టిఫికెట్ కోసం దాదాపు రూ.65 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ము సమగ్రమైన శిక్షణ ఇస్తామని, వాటితో అభ్యర్థులు డ్రోన్స్ ఆపరేట్ చేసుకోవచ్చని, అయితే సర్టిఫికెట్ కావాలంటే డీజీసీఏ వారి పరీక్షకు హాజరై, ఉత్తీర్ణత సాధించాలని దీనికి ఫీజు దాదాపు రూ.65 వేలు అవుతుందని అధికారులు నేరుాగనే చెబుతున్నారు.
ఒక తప్పు కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తోందని బీజేపీ విమర్శలు
ప్రభుత్వం మైనార్టీ యువతకు ట్రైనింగ్ ఇస్తున్నది నిజం. ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఎందుకో డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్ అవాస్తవం అని అబద్దాలు చెప్పేందుకు వెనుకాడలేదు. ఓ తప్పు కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వం ఇంకో తప్పు చేస్తోందన్న భావన ప్రస్తుత ప్రభుత్వ తీరు వల్ల వస్తోంది.