CM Jagan : సీఎం జగన్‌లో చేసిన ఆ కామెంట్స్‌తో వైసీపీలో దడ- నేతల మైండ్‌లో చంద్రబాబు, కేసీఆర్
Jagan News: APలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా...తనకు ఎలాంటి విచారమూ లేదన్నారు.
Jagan Comments On Elections : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...ముఖ్యమంత్రి (Chief Minister) జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా...తనకు ఎలాంటి విచారమూ లేదన్నారు. తిరుపతి (Tirupati) లో జరిగిన ఓ సదస్సులో ఆయనీ వ్యాఖ్యలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు...సింపతీ కోసం ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా ? లేదంటే ఓటమి భయమా ? జగన్ లో నిర్వేదం మొదలైందా అన్నది హాట్ టాపిక్ గా మారింది.
కోట్ల మంది ప్రజలకు సహాయం అందించడం సంతృప్తినిచ్చిందంటూనే...ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాంటి విచారమూ లేదని చెప్పడం పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. మ్యానిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని, రెండోసారి అధికారంలో వస్తామంటున్న సీఎం జగన్..ఎందుకిలా మాట్లాడారంటూ వైసీపీలో కొత్త చర్చ మొదలైంది. పార్టీ అధినేతే ఇలా మాట్లాడితే...ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, కార్యకర్తల పరిస్థితి ఇంకెలా ఆలోచించాలని అంటున్నారు.
2019లో చంద్రబాబు, 2023లో కేసీఆర్ ప్రజల్లో సానుభూతి సంపాదించేందుకు ఇలా కామెంట్స్ చేసినా...ప్రజలు ఆదరించలేదు. ఇపుడు అదే పరిస్థితి జగన్ కూడా వస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీకి అస్త్రంగా మారుతున్నాయి. ఓటమి ఖాయమని ముఖ్యమంత్రి జగన్...ఎన్నికలకు ముందే అంగీకరించారంటూ ప్రచారం చేస్తున్నారు.
2019లో చంద్రబాబు నోట ఓటమి మాట
తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన నేతలు...ప్రస్తుతం ముఖ్యమంత్రులు చేస్తున్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఎన్నికల ప్రచారంలో పలు సందర్బాల్లో చెప్పారు. ప్రధాని మోడీకి కుటుంబ సభ్యులు కూడా లేరని విమర్శించారు. ప్రధాని పదవి పోయిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో కూడా మోడీకి తెలియదన్నారు చంద్రబాబు. అయితే తనకు అలాంటి ఇబ్బందేమీ లేదని, ఎన్నికల్లో ఓడిపోతే నాకు భార్య, కొడుకు,కోడలితోపాటు మనవడు కూడా ఉన్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నోట ఓటమి మాట రావడం, తాను ఓడిపోయినా ఇబ్బంది లేదని చెప్పడంతో టీడీపీ నాయకులే కంగుతిన్నారు. ఆ తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలో వచ్చింది. జగన్ ముఖ్యమంత్రయ్యారు.
2023లో ఓడిపోతే మాకు పోయేదేం లేదన్న కేసీఆర్, కేటీఆర్
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కూడా చంద్రబాబు నాయుడు లాగే మాట్లాడారు. ఓడిపోతే మాకు పోయేదేం లేదని...ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటాం..కానీ మీరే నష్టపోతారంటూ అచ్చంపేట సభలో ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు కేసీఆర్. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన వ్యాఖ్యల మర్మమేంటని ప్రజలతో పాటు అన్ని పార్టీల మధ్య జోరుగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ గెలవకుంటే ప్రజలే నష్టపోతారన్న మాటలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. కాంగ్రెస్ గెలిస్తే.. రైతు బంధు రాదు.. కరెంట్ రాదని ప్రచారం చేశారు. మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందని.. కాంగ్రెస్ గెలిస్తే పరిస్థితులు మళ్లీ మొదటికి వస్తాయన్నారు. పొరపాటున వేరే పార్టీని గెలిపిస్తే...కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లు అవుతుందంటూ వ్యాఖ్యానించారు. సీన్ కట్ చేస్తే...గులాబీ పార్టీ ఓటమి పాలయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కేసీఆర్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.