CMs Meeting Decisions: ప్రజా భవన్‌లో ముగిసిన సీఎంల భేటీ - సమస్యల పరిష్కారానికి చంద్రబాబు, రేవంత్ కీలక నిర్ణయం
Revanth Chandrababu Meeting | విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అనంతరం తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Chandrababu and Revanth Meeting| హైదరాబాద్: జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో శనివారం నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల కీలక భేటీ ముగిసింది. దాదాపు గంటా నలబై ఐదు నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. పది ఏళ్లుగా పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలపై పరిష్కారానికి ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు. మంత్రులతో ఓ కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉండే అవకాశం ఉంది.
షెడ్యూల్ 9, 10లోని అంశాలపై చర్చించారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా పరిష్కారం చూడాలని భావిస్తున్నారు. మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. భేటీ ముగిసిన తరువాత రెండు రాష్ట్రాల సీఎంలు, వారి బృందం డిన్నర్ చేస్తున్నట్లు సమాచారం. డిన్నర్ అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో భేటీకి సంబంధించిన నిర్ణయాలు వెల్లడించారు.
సీఎంల భేటీ ప్రారంభానికి ముందు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ రచించిన "నా గొడవ" పుస్తకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చారు. చంద్రబాబుకు రేవంత్ ఇచ్చిన నా గొడవ పుస్తకం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో పాటు సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ నుంచి చంద్రబాబు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, రాష్ట్ర సీఎస్ నీరభ్ కుమార్ పాల్గొన్నారు. గత పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని తాజా భేటీలో చర్చించి కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.