అన్వేషించండి
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలన్నీ చలో ఉత్తరాంధ్ర- ఇంతకీ అక్కడేముందంటే?
ఇటీవలే ఉత్తరాంధ్రలో పర్యటించారు చంద్రబాబు. ఆ బాటలోనే వైసీపీ లీడర్లు ఉన్నారు. బీజేపీ నేతలు కూడా అక్కడే ఫోకస్ పెట్టారు.
ఏపీలో ఎన్నికల హడావుడికి ఉత్తరాంధ్ర కేంద్రంగా మారింది. అన్ని రాజకీయ పార్టీలూ వైజాగ్‌నే ఎన్నికల కేంద్రంగా మార్చుకుంటున్నాయి. ఇక్కడి నుంచే తమ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. కేవలం అధికారికంగా చెప్పడం లేదంతే. అధికార వైసీపీ కావొచ్చు, ప్రతిపక్ష టీడీపీ కావొచ్చు జాతీయ పార్టీ బీజేపీ కావొచ్చు ప్రస్తుతం ఉత్తరాంధ్రపై పట్టు కోసం పరితపిస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో పర్యటనతో పార్టీలో జోష్ తెచ్చిన చంద్రబాబు :
చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన టీడీపీ అనుకున్న దానికన్నా ఎక్కువ సక్సెస్ అయింది. ప్రభుత్వ విధానాలపై ఆయన చేపట్టిన బాదుడే బాదుడే కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. ఆ ఉత్సాహంతో చంద్రబాబు అప్పుడే పొత్తులపై సంకేతాలు ఇచ్చేవరకూ వెళ్లిపోయారు. గత మూడేళ్ళుగా స్తబ్దంగా ఉన్న పార్టీలో కొత్త జోష్ తెచ్చింది ఈ పర్యటన. ఆ జోష్ చంద్రబాబులో సైతం కనపడుతుంది. అందుకే ధైర్యంగా వైజాగ్ వాసులను మీకు అభివృద్ధి కావాలా రాజధాని కావాలా అని అడిగేవరకూ వెళ్లిపోయారు. ఇన్నాళ్లూ పార్టీ కేవలం అమరావతికి పరిమితం చేసేశారన్న విమర్శలకు చెక్ పెట్టేలా వైజాగ్‌ను తన ఎన్నికల కార్యస్థానంగా మార్చేశారు చంద్రబాబు. పైగా ప్రస్తుత వైజాగ్‌లో ప్రధాన అసెంబ్లీ సీట్లన్నీ టీడీపీవే. దానితో 2019 ఎన్నికల్లో వైసీప హవాలోనూ తమకు పడిన ఓట్లను.. గెలిచిన సీట్లనూ 2024లో పెంచాలని ఆయన భావిస్తున్నారు. త్వరలో నారా లోకేష్ చేపట్టే పాదయాత్రలోనూ ఉత్తరాంధ్రలోని ఎక్కువ ప్రాంతం కవర్ అయ్యేలా వ్యూహాలు రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
రంగంలోకి దిగిన వైసిపీ :
ఎప్పుడైతే చంద్రబాబు టూర్‌కి జనం గట్టిగా వచ్చారో.. అధికార వైసీపీ కూడా వెంటనే యాక్టివ్ అయింది. చంద్రబాబు అటు వెళ్ళగానే వైసిపీ కీలక నేతలు అంతా వైజాగ్ బాట పట్టారు. పార్టీ మూడు జిల్లాల కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, సీదిరి అప్పలరాజు, ఉషశ్రీ, ధర్మాన ప్రసాద్ వైజాగ్‌లోనే మకాం వేశారు. పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలతో చర్చలు జరుపుతూ పార్టీని బలోపేతం చేసేపనిలో పడ్డారు. స్థానికంగా ముదిరిన పార్టీ అంతర్గత సమస్యలపై ఫోకస్ చేసిన వైసీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ వైజాగ్‌నూ, ఉత్తరాంధ్రనూ పోనియ్యకూడదని పట్టుదలతో ఉన్నారు. ఇక మూడేళ్ళుగా వైజాగ్ పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న విజయసాయిరెడ్డి కూడా జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించారు. ఆయనకు వ్యక్తిగతంగానూ పార్టీ పరంగానూ వైజాగ్ చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. 2024 ఎన్నిక ల్లో ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు గెలిపించి తన పట్టు పెంచాలని చూస్తున్నారు.
ముందు నుంచి ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టిన జనసేన:
మొదటి నుంచీ జనసేన అధినేత పవన్ కళ్యాన్ దృష్టి ఉత్తరాంధ్రపై ఉంది పార్టీ అధినాయకుడు హోదాలో పవన్ కళ్యాణ్ స్వయంగా గాజువాక నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఫ్యాన్స్ పరంగానూ.. విద్యాధికుల పరంగానూ విశాఖలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఉత్తరాంధ్రపై పవన్ కళ్యాణ్‌కు ఇంకా మమకారం పోలేదు. 2024 నాటికి ఇక్కడ పార్టీని బలోపేతం చేసేలా జనసేన హైకమాండ్ వ్యూహాలు రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది.
బీజేపీ ఆశ విశాఖ పైనే :
బీజేపీకి ఏపీలో ఈ మధ్య కాలంలో ఎంపీ లేదా ఎమ్మెల్యే సీట్లు దక్కాయంటే అది కేవలం విశాఖలోనే. అందుకే విశాఖపై బీజేపీ అధినాయకత్వం దృష్టి సారించింది. పార్టీ నేతలూ, కేంద్ర మంత్రులూ పదేపదే విశాఖకు వస్తున్నారు. చిన్న తరహా ప్రాజెక్టులను వైసిపీ పక్కన పెడుతోందని విమర్శలు కూడా చేసింది బీజేపీ. ఎక్కువమంది నార్త్ ఇండియన్స్ విశాఖ ప్రాంతంలో ఉండడం తమకు లాభిస్తుంది అనేది ఆ పార్టీ ఆలోచన. ఒకవేళ ఏపీలో విపక్షాల మధ్య పొత్తులు ఏర్పడితే తమకు ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు పొందాలని బీజేపీ ఆలోచనగా కనబడుతుంది.
ఎందుకు ఉత్తరాంధ్రనే అందరికీ కీలకం :
వైజాగ్, దాని చుట్టుపక్కల ప్రాంతాలను మినీ ఇండియాగా పిలవచ్చు. ఇక్కడ అన్నిరకాల ప్రాంతాలకు చెందిన ప్రజలూ స్థిరపడ్డారు. అలాగే పార్టీల ఎజెండాల కంటే అభివృద్ధికే ఇక్కడి జనం ఓటేస్తుంటారు. అలాగే ఈ ప్రాంతంలో పట్టు సాధించిన పార్టీ మిగిలిన ప్రాంతాల మీద పట్టుసాధించవచ్చు. ఏపీకి ఆర్ధిక రాజధాని వైజాగ్ కావడమే దీనికి కారణం. అన్నిరకాల వనరులూ, రవాణా సౌకర్యాలూ ఉన్న ప్రాంతంగా డెవలప్ అయి ఉన్న విశాఖ తీరం నుంచి వచ్చే రెవెన్యూ కూడా చాలా ప్రధానం. ప్రస్తుతం ఏపీలో ఈ స్థాయి రెవెన్యూ ఇచ్చే మరో ప్రాంతం లేదు. దీనితో అన్ని పార్టీలూ విశాఖ, దాని చుట్టుప్రక్కల ప్రాంతాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
అమరావతి
హైదరాబాద్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement