Special Buses for Sankranthi : సంక్రాంతి ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ -7,200 స్పెషల్ బస్సులు నడపనున్నట్టు ప్రకటన
Special buses for Sankranthi : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి పలు చోట్లకు 2,153 బస్సులు నడపనుంది.
Special buses for Sankranthi : సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏపీ సర్కారు ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ - ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా 7.200 బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి పలుచోట్లకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఇవి జనవరి 8 నుంచి 13వరకు నడుస్తాయని చెప్పింది. తిరుగు ప్రయాణం నిమిత్తం జనవరి 16 నుంచి 20వరకు 3,200 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. అయితే ఈ స్పెషల్ బస్సులో తాము ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని, ఎప్పటిలాగే ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు.
టిక్కెట్ ధరపై 10శాతం డిస్కౌంట్
పండుగను పురస్కరించుకుని ఒకేసారి రెండు వైపులా టిక్కెట్లు బుక్ చేసుకుంటే వారికి టిక్కెట్ దరపై 10శాతం రాయితీ ఇస్తామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ముందుగానే వారు తమ టిక్కెట్ ను బుక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల కోసం సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఆంధ్రాలో సంక్రాంతి పండుగ
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఆడంబరంగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ పండుగ చాలా పెద్ద పండుగ. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం వెళ్లినప్పటికీ ఈ పండక్కి మాత్రం ఎలాగైనా ఇంటికి చేరుకుంటారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కూడా సెలవులుంటాయి. కాబట్టి సొంతూళ్లకు పయనవుతారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పండుగకు అటు, ఇటు ప్రయాణిస్తూ ఉంటారు. దీని వల్ల సంక్రాంతి సీజన్ లో బస్సులు, రైళ్లు అన్నీ టిక్కెట్లు ఫిల్ అవుతాయి. స్టేషన్లలో భారీ రద్దీ ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు లాంటి తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా రాకపోకలు చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ ఈ సారి భారీగానే ఏర్పాట్లు చేస్తోంది. అనంతపురం నుంచి జనవరి 9 నుంచి 20వరకు ప్రత్యేక బస్సులు నడపనుంది. స్పెషల్ బస్సులు నడుపుతున్నప్పటికీ ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జీలు వసూలు చేయకపోతుండడంతో ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణానికి చాలా మంది ప్రయాణికులు మొగ్గు చూపనున్నారు. దీని వల్ల ఆదాయం పరంగానూ ఆర్టీసీకి మేలు జరగనుంది.
Also Read : Daaku Maharaaj Ticket Price Hike: ఏపీలో డాకు మహారాజ్ మూవీ టికెట్ల ధర పెంపు, లేటెస్ట్ రేట్లు ఇలా