3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !
మూడేళ్ల జగన్ పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఏంటంటే..?
3 Years of YSR Congress Party Rule : వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై శాతం ఓట్లతో అధికారం చేపట్టి మూడేళ్లవుతోంది. యువ ముఖ్యమంత్రి... దూకుడుగా నిర్ణయాలు తీసుకుని పరిపాలన సాగిస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్లస్‌లు ఉన్నాయి.. మైనస్‌లు ఉన్నాయి. అయితే అన్నీ ప్లస్‌లేనని ప్రభుత్వం నమ్ముతూ ఉంటుంది. అది వేరే విషయం. ఈ మూడేళ్లలో ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న పది ప్రత్యేక నిర్ణయాల గురించి తెలుసుకుందాం !
వాలంటీర్లు !
జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను అర్హత కలిగిన లబ్దిదారులు అందరికీ ఇంటి వద్దకే చేరవేయడం వీటి పని. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలు అందరూ సులభంగానే ప్రభుత్వ సర్వీసులు పొందడం వీలవుతుంది. సంక్షేమ పథకాల ప్రయోజాలు పొందొచ్చునని ప్రభుత్వం చెబుతోంది. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమించింది. వారికి సంబంధించిన సమాచారం వారి వద్ద ఉంటుంది. పథకాల కోసం ప్రజలు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. వాలంటీర్ దగ్గరకు వెళ్తే చాలు!
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ !
వాలంటీర్లతో పాటు ప్రభుత్వం కొత్తగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ఉంటాడు. అలాగే ప్రతి రెండు వేల మంది జనాభాకు ఓ వార్డు, గ్రామ సచివాలయం ఉంటుంది. పరిపాలన ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులో ఉంటాయి. పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ.. ఆరోగ్యం కానీ.. రెవిన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. డెయిరీ కానీ, పౌల్టీరు రంగాల సేవలు కానీ.. ఇలాంటివెన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటలోనే సమస్యను పరిష్కరిస్తారని ప్రభుత్వం ప్రకటించింది.
30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ !
రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మా ణం ప్రారంభమైనట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆస్తి ఇచ్చినట్లేనని ప్రభుత్వం చెబుతోంది. దీని కోసం 71,811 ఎకరాల భూమిని వివిధ రూపాలుగా సేకరించారు. తాము ఇళ్లు కాదని.. ఊళ్లు కడుతున్నామని సీఎం జగన్ చెబుతూ ఉంటారు. మొత్తంగా 17,005 కాలనీలు వస్తున్నా యని.. రాష్ట్రంలో దాదాపు 13 వేల పంచాయతీలు ఉంటే..కొత్తగా 17 వేల కాలనీలు ఏర్పాటవుతున్నాయ ప్రభుత్వం ప్రకటించింది.
స్కూళ్లలో నాడు - నేడు !
సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత స్కూళ్ల రూపురేఖలు మార్చాలని నిర్ణయించారు. నాడు–నేడు కింద రూ.16,450.69 కోట్లతో 61,661 స్కూళ్ల రూపు రేఖల మార్పునకు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో 15,713 స్కూళ్లను రూ.3,697.86 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు సమకూర్చారు. రన్నింగ్ వాటర్ కలిగిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, మేజర్.. మైనర్ రిపేర్లు, పెయింటింగ్.. ఫినిషింగ్, స్కూలు విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల ఏర్పాటు, విద్యార్థులు, టీచర్లతో సహా పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు.. తదితర వసతులను కల్పించారు.
కొత్త జిల్లాల ఏర్పాటు !
జగన్ పాలనలో జిల్లాలు పెరిగాయి. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా.. 13 జిల్లాలను 26గా మార్పు చేశారు. ఏపీలో 26 జిల్లాలు, 7౩ రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. ‘కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం.. వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని.. రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు జరిగిందని ప్రభుత్వం ప్రకటిచింది. ఇప్పుడు కొత్త జిల్లాల వారీగానే పాలన సాగుతోంది.
మూడు రాజధానులు !
సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి అవసరం కాబట్టి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారు. 2020లో ఈ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. విశాఖపట్నాన్ని పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా చేయాలని బిల్లులో పేర్కొన్నారు. అయితే తర్వాత హైకోర్టులో కేసుల వల్ల ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంది. దీంతో ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు అమలులో లేదు. సంచలన నిర్ణయం తీసుకున్నా.. ఇంత వరకూ మూడు రాజధానుల వైపు అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు.
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ మద్యం బ్రాండ్లు !
ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... తామే సొంతంగా మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. అంటే.. ఇక దుకాణాల్లో ఏ బ్రాండ్లు అమ్మాలనేది కూడా ప్రభుత్వం ఇష్టమే. అందుకే పాపులర్ బ్రాండ్స్ ఏవీ అమ్మడం లేదు. రేట్లు మాత్రం పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రెట్టింపు ఉంటాయి.కానీ బ్రాండ్లు మాత్రం ఫర్ ఏపీ సేల్ ఓన్లీ బ్రాండ్స్ మాత్రమే అమ్ముతున్నారు. ఎంత రేటు అయినా మద్యానికి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో మందుబాబులు వాటికే అలవాటు పడుతున్నారు.
ఏపీ అప్పులు !
మూడేళ్ల కాలంలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం చేసిన అప్పులు 4లక్షల కోట్లు దాటాయి. బహిరంగ మార్కెట్లో చేసినవి అదనం. వీటికితోడు వివిధ కార్పొరేషన్లపేరిట వేలకోట్లు రుణాలు తీసుకుంది. ఇలా రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్లను అన్నింటిని వాడేసింది. దీంతో కొత్తగా అప్పులు పుట్టడం ఇప్పుడు రాష్ట్రప్రభుత్వానికి గగనంగా మారింది. ప్రతి నెల ఐదు వేల కోట్లు.. ఇది ఆదాయం కాదు.. అప్పు.. ప్రతినెలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అప్పులపైనే ఆశలు పెట్టుకుని సర్కారును నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది జీతాలు ప్రతీ నెలా ఆలస్యం అవుతున్నాయి.
కక్ష సాధింపులు !
రాజకీయ కక్ష సాధింపులు యేపీలో మూడేళ్ల నుంచి హాట్ టాపిక్‌గానే ఉన్నాయి. అచ్చెన్నాయుడు. ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా , నారాయణ ఇలా టీడీపీ నేతలందరో అరెస్టయ్యారు. రఘురామరాజు లాంటి ఎంపీలు కూడా అరెస్టయ్యారు. ఎవరికీ నోటీసులు ఇవ్వరు. రాత్రికి రాత్రి వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.
కోర్టులతో ఘర్షణ !
న్యాయవ్యవస్థతో ఓ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తలపడుతోంది. నిర్ణయాలన్నీ కోర్టుల్లో తేలిపోతూండటంతో సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరులు బెదిరింపులకు దిగారు. కోర్టు కన్నెర్ర చేయడంతో సోషల్ మీడియాలో ఆ తరహా పోస్టులు ఆగిపోయాయి. కానీ ఇటీవల మూడు రాజధానుల బిల్లులపై ఇచ్చిన తీర్పుతో మరోసారి అసెంబ్లీలోనే చర్చించారు. న్యాయవ్యవస్థ తీరును ఖండించారు.