Telangana Politics 2023 : తెలంగాణకు ఎన్నికల ఏడాది 2023 - ఎవరు గెలిచినా తెలంగాణ చరిత్రలో కీలక మలుపులే !
తెలంగాణకు 2023 ఎన్నికల ఏడాది. హైవోల్టేజ్ రాజకీయానికి ఈ ఏడాది వేదిక కానుంది.
Telangana Politics 2023 : 2022 కాలగర్భంలో కలిసిపోయింది. ఇక జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. ఖాళీ సమయంలో వాటిని గుర్తు చేసుకోవచ్చు కానీ.. ఇక 2023లో ఏం జరుగుతుంది..? ఏం చేయాలి ? అన్నది ఓ సారి అవలోకనం చేసుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో 2023 చరిత్రలో నిలిచిపోయే ఏడాది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చిన .. అతి క్లిష్టమైన ఏడాదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాదే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఇది ఎన్నికల ఏడాది. పైగా గతంలోలా రాజకీయాలు లేవు. బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు గెలుపు మాదేనని కుండలు బద్దలు కొడుతున్నాయి కానీ.. మనసులో మాత్రం గాభరా పడుతూనే ఉన్నాయి. అందుకే ఎలాంటి ఫలితం వచ్చినా తెలంగాణ గమనాన్ని మరో దిక్కుకు మార్చే ఏడాదే 2023 అని అనుకోవచ్చు.
2023లో ఎప్పుడైనా ఎన్నికలు !
తెలంగాణలో ఇది ఎన్నికల ఏడాది. షెడ్యూల్ ప్రకారం జరిగితే నవంబర్ , డిసెంబర్ నెలలో పోలింగ్ జరుగుతుంది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు 2024 మార్చిలో జరగాల్సి ఉంది. కానీ మొదటి టర్మ్ అధికారాన్ని ఐదు నెలల పాటు కుదించుకున్న కేసీఆర్ 2018 చివరిలో ఎన్నికలకు వెళ్లిపోయారు. ఫలితంగా ఇప్పుడు కూడా ముందే స్తున్నాయి. లెక్క ప్రకారం చూస్తే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే.. ఐదేళ్లకే ఎన్నికలు వస్తున్నట్లు. కానీ ఈ సారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్రయత్నాలు చేస్తున్నారన్న నమ్మకం రాజకీయవర్గాల్లో ఎక్కువగా ఉంది. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే.. ఆరు నెలలు ముందు జరిగే ఎన్నికలు ముందస్తు కావు. అందుకే ఈ సారి కూడా ఓ ఐదారు నెలలు ముందస్తు ఎన్నికలు పెట్టవచ్చని చెబుతున్నారు. అందుకే.. ఈ ఏడాదిలో ఎప్పుడైనా ఎన్నికల ప్రకటన రావొచ్చు. అది మార్చిలో బడ్జెట్ పెట్టిన తర్వాతనా లేకపోతే.. సెప్టెంబర్ అక్టోబర్‌లోనా అన్నది తేలాల్సి ఉంది.కానీ ఈ ఏడాది ఎన్నికలు మాత్రం ఖాయం.
హైవోల్టేజ్ ఎలక్షన్ సీజన్ ఖాయం !
రాజకీయాల్లో ఎన్నికలు ఎప్పుడూ హైవోల్టేజ్ సృష్టించేవే. అయితే ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఎవరూ ఊహించనంత కరెంట్ రాజకీయాల్లో పుట్టిస్తుంది. ఎందుకంటే.. రెండు అధికార కేంద్రాల మధ్య భీకర యుద్ధం జరగబోతోంది. అదే సమయంలో తామున్నామంటూ.. ఏ మాత్రం ప్రయత్నలోపం లేకుండా పోరాడే పార్టీలు చాలా ఉన్నాయి. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అని నిరూపించాలనుకుంటున్న బీఆర్ఎస్.. మూడో సారి గెలవడానికి శక్తినంతా ప్రయోగిస్తుంది. అందులో సందేహంలేదు. దేశమంతా విస్తరిస్తున్న బీజేపీ... దక్షిణాదిలో రెండో రాష్ట్రంలో అడుగు పెట్టాలని చేయని ప్రయత్నంమంటూ లేదు. ఎన్నికల్లోపు చేయాల్సినదంతా చేస్తుంది. ఎన్నికల్లోనూ చేస్తుంది. ఈ రెండూ అధికార పార్టీలు. వీటి పోరాటం పుట్టించే రాజకీయ మంటలను అంచనా వేయడం సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా తాము బలమైన పోటీ దారులమని చెబుతోంది. క్యాడర్ బలంతోరంగంలో నిలుస్తోంది. ఇక తెలంగాణలో ఇతర పార్టీలు తామున్నామంటూ రంగంలోకి వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలు పోరాడుతున్నాయి. వీటిన్నింటి సమరం 2023లో తెలంగాణలో ఓ యుద్ధాన్నే తలపించనుంది.
ఎలాంటి ఫలితం వచ్చినా తెలంగాణ దిశ మార్చేదే !
అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చినా తెలంగాణ దిశ మారిపోతుందనడంలో సందేహం లేదు. మూడో సారి బీఆర్ఎస్ అధికారం దక్కించుకుంటే... ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ పేరు మారుమోగిపోతుంది. జాతీయ రాజకీయాలకు తెలంగాణ నుంచే ఓ దిక్సూచీ వచ్చినట్లు అవుతుంది. కేసీఆర్ కోరుకునేది అదే. అదే జరిగితే.. ఆయన సాధించినట్లే. అదే బీజేపీ అధికారం దక్కించుకుంటే.. మిషన్ దక్షిణాదిలో రెండో అడుగు వేసినట్లే. ఇక ఆపార్టీని దక్షిణాదిలో ఆపడం కష్టమే అవ్వొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. దేశ రాజకీయాల్లో సంచలన మార్పులు వస్తాయి. ఆ పార్టీ అనూహ్యంగా బలపడటం ఖాయం. ఇలా రాజకీయ పలితాలను అంచనా వేస్తే.. 2023 తెలంగాణలో ఎవరూ ఊహించని మార్పులను తెలుస్తుందని సులువుగా ఆహ్వానించవచ్చు.
రాజకీయాలు అంటే.. ప్రజల బతుకుల్ని మార్చేవి. రాజకీయ నేతలు తీసుకునే నిర్ణయాలే ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచుతాయా.. తగ్గిస్తాయా అన్నది నిర్ణయిస్తాయి. మనం ఓటు వేసి గెలిపించిన వాళ్లే ఈ నిర్ణయాలు తీసుకుంటారు. అంటే మన చేతుల్లోనే అంతా ఉంది. అందుకే ఈ ఏడాది మన చేతుల్లోకి వచ్చిన ఆయుధాన్ని పకడ్బందీగా ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేద్దాం... మంచిపాలకులను ఎన్నుకుందాం. 2023లో రాజకీయంగా మనం మనకు ఇచ్చుకునే గిఫ్ట్ ఇదే. హ్యాపీ న్యూ ఇయర్