Sharmila: ఉమ్మడి శత్రువు కోసం కలిసి పని చేసిన సీఎంలు... ఉమ్మడి వివాద పరిష్కారానికి కూర్చోలేరా?
తెలంగాణ గడ్డపై కొత్త పార్టీతో ముందుకు వచ్చిన వైయస్ షర్మిల.. సోదరుడు జగన్పై పరోక్ష విమర్శలు చేశారు. ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఇద్దరు సీఎంలు ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జలవివాదంపై వైయస్ షర్మిల ఘాటుగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు స్వీట్లు, విందులు పెట్టుకున్నారని.. మరోసారి కూర్చుని నీటి సమస్యపై ఎందుకు చర్చించరని ప్రశ్నించారు. రెండు నిమిషాలు కూర్చుని సమస్య పరిష్కరించుకోలేరా అని నిలదీశారు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆమె.. కేసీఆర్ పాలనను తీవ్రంగా విమర్శించారు.
సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం చూస్తూ కూర్చుందని ఆరోపించారు. సమస్య పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధి ఎవరిలోనూ లేదని ధ్వజమెత్తారు. న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిబొట్టునూ వదులుకోమని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతానికి చెందిన నీటిచుక్కను కూడా తీసుకోమని షర్మిల అన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే తమ సిద్ధాంతమని పేర్కొన్నారు.
ఆయన కల నెరవేర్చేందుకే: విజయమ్మ
పార్టీ ఆవిర్భావ సభలో షర్మిల తల్లి వైయస్ విజయమ్మ భావోద్వేగంగా మాట్లాడారు. శత్రువులైనా.. వైఎస్‌ఆర్‌ను అభిమానించారని వైఎస్ విజయమ్మ అన్నారు. నాయకుడంటే వైఎస్‌ఆర్‌లా ఉండాలన్నారు. నాయకుడంటే తన వాళ్ల కష్టాలు.. నష్టాలను భరించేవాడని, ప్రజల బతుకు కోరేవాడే నిజమైన నాయకుడని చెప్పారు. అలాంటి నాయకుడు వైఎస్‌ఆర్ ఒక్కరే అని అన్నారు. వైఎస్‌ఆర్ జనం కోసం జీవించారని తెలిపారు. ఆయన ఆత్మీయత, హావభావాలు జగన్, షర్మిల పుణికి పుచ్చుకున్నారని చెప్పారు.
తండ్రి ఆశయాల సాధనం కోసం మీముందుకు వస్తున్నారని, మీ కష్టాల్లో షర్మిల తోడుగా ఉంటుందన్నారు. షర్మిలను మీ కుటుంబసభ్యురాలిగా అక్కున చేర్చుకోవాలని కోరారు
అన్నపై వ్యంగ్యాస్త్రాలు..
ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవివాదంపై ట్వీట్ చేసిన షర్మిల తాజాగా ఈ విషయంపై సోదరుడు జగన్పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పేరు ప్రస్తావించకపోయినా పరోక్షంగా జగన్ను విమర్శించారు.
తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం..
— YS Sharmila (@realyssharmila) June 28, 2021
అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం..https://t.co/Kc6F1vkpLW