Elon Musk On Trump: ట్రంప్‌పై ట్విటర్‌లో శాశ్వత నిషేధం ఎత్తేస్తాం - ఎలన్ మస్క్ సంచలన ప్రకటన
Elon Musk: మస్క్ మంగళవారం (మే 10) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఫైనాన్షియల్ టైమ్స్ ఫ్యూచర్ ఆఫ్ ది కార్ కాన్ఫరెన్స్’లో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు.
Elon Musk Says Lifts Ban On Donald Trump in Twitter: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ అకౌంట్‌పై శాశ్వత నిషేధాన్ని ఉపసంహరించుకుంటామని టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎలన్ మస్క్ Elon Musk సంచలన ప్రకటన చేశారు. ట్విటర్ కొనుగోలు ప్రణాళికను అమలు చేస్తున్న మస్క్ మంగళవారం (మే 10) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఫైనాన్షియల్ టైమ్స్ ఫ్యూచర్ ఆఫ్ ది కార్ కాన్ఫరెన్స్’లో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. ట్విటర్‌లో మరింతగా భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చే లక్ష్యంతో మస్క్ దాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
‘‘ప్రజాస్వామ్యానికి వాక్ స్వాతంత్య్రం మూలస్తంభం. మానవాళి భవిష్యత్తుకు ముఖ్యమైన విషయాలు చర్చించే డిజిటల్ టౌన్ స్క్వేర్ ట్విట్టర్. నేను కొత్త ఫీచర్లతో అల్గారిథమ్‌లను తయారు చేయిస్తున్నాను. నేను ట్విటర్‌ని గతంలో కంటే మెరుగ్గా చేయాలనుకుంటున్నాను.’’ అని ఎలన్ మస్క్ మాట్లాడారు. అయితే, మస్క్ వ్యాఖ్యలపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. అటు ట్రంప్ నుంచి కూడా ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.
గతంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ Donald Trump పదవీకాలం ముగియకముందే ఆయన ఖాతాను ట్విటర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటికి ఆయనకు 88 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. శక్తివంతమైన గ్లోబల్ లీడర్‌ల ఖాతాలను సోషల్ మీడియా కంపెనీలు ఎలా మోడరేట్ చేయాలనే దానిపై అనేక సంవత్సరాల చర్చ జరిగిన తర్వాత ఈ చర్య తీసుకున్నామని అప్పట్లో ట్విటర్ తెలిపింది.
జనవరి 6న యుఎస్ క్యాపిటల్ (పార్లమెంట్ హౌస్)లో జరిగిన అల్లర్ల తర్వాత ట్రంప్ ట్విటర్ నుండి శాశ్వతంగా సస్పెండ్ అయ్యారు. ట్విటర్ తన నిర్ణయంలో ‘‘హింసను మరింత ప్రేరేపించే ప్రమాదం’’ అని పేర్కొంది. ట్విటర్ ద్వారా ఖాతాలపై శాశ్వత నిషేధం అరుదైన సందర్భాల్లో మాత్రమే ఉంటుందని, హానికరమైన లేదా ‘ఆటోమేటెడ్ బాట్‌లు’ ఖాతాలపై ఇటువంటి చర్యలు తీసుకోవాలని మస్క్ అన్నారు.
మస్క్ ట్విటర్ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేసి, తన ఖాతాను పునరుద్ధరిస్తానని చెప్పినప్పటికీ, తాను ట్విటర్‌లోకి తిరిగి రానని ట్రంప్ ఇప్పటికే తేల్చి చెప్పారు. ‘‘మస్క్ మంచి వ్యక్తి, కానీ అతను ట్విటర్‌లోకి రాడు. మన సొంత సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో కనెక్ట్ అవ్వండి. ‘ట్రూత్ సోషల్’ అనే వేదిక ద్వారా..’’ అని ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో ట్రంప్ ప్రకటించారు. యాపిల్ యాప్ స్టోర్‌లో కూడా ‘ట్రూత్ సోషల్’ ప్రారంభించారు.