Vivek Ramaswamy: వివేక్ రామస్వామితో డిన్నర్, ఒక్కొక్కరూ 50 వేల డాలర్లకుపైనే చెల్లించాలి
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ ఆశావహుడు అయిన వివేక్ రామస్వామితో డిన్నర్ చేయాలంటే ఒక్కొక్కరు 50 వేల డాలర్లకుపైనే చెల్లించాలట.
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో భారత సంతతి వ్యక్తి అయిన వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు వివేక్ రామస్వామి. తాజాగా నిర్వహించిన జీవోపీ పోల్స్ లో వివేక్ ట్రంప్ తర్వాత రెండో స్థానంలో ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. రోన్ డిశాంటిస్, నిక్కీ హేలీలను వెనక్కి నెట్టి మరింత ముందుకు దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే వివేక్ రామస్వామి తన ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణకు సిద్ధమయ్యారు. నిధుల సేకరణ కోసం పలువురు సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్తలు ఓ ప్రత్యేక కార్యక్రమంతో ముందుకు వచ్చారు. ఈ నెల 29న ఓ విందుకు ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్ కార్యక్రమంలో రిపబ్లికన్ నేత ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. అయితే వివేక్ రామస్వామిలో పాల్గొనబోయే ఈ విందు కార్యక్రమంలో హాజరు కావాలనుకునేవారు 50 వేల డాలర్లకు పైనే చెల్లించాల్సి ఉంటుందట. అంటే మన భారత కరెన్సీలో రూ. 41 లక్షలు.
అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో లోని సోషల్ క్యాపిటల్ సంస్థ సీఈవో చామాత్ పలిహపిటియా నివాసంలో ఈ విందు నిర్వహించనున్నారు. పలువురు వ్యాపారవేత్తలూ ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం అవుతున్నారు. దీనికి సంబంధించిన ఓ ఆహ్వాన పత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిన్నర్ క్రమంలో వివేక్ రామస్వామితో చర్చలకూ అవకాశం కల్పించనున్నారు. 10 లక్షల డాలర్ల సేకరణే లక్ష్యంగా ఈ విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
The Silicon Valley fundraising sweepstakes ends on Friday, September 29 when @VivekGRamaswamy comes to town.
— Teddy Schleifer (@teddyschleifer) September 22, 2023
That's when a bunch of heavy hitters from Silicon Valley will toast Vivek — you can attend if you make a $50,000 contribution to Vivek's super PAC.
Here are the hosts. pic.twitter.com/t3iBO0QTYq
ట్రంప్ తర్వాత వివేక్ రామస్వామే
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్ రామస్వామి వేగంగా పుంజుకుంటున్నారు. ట్రంప్ తర్వాత వివేక్ రామస్వామి రెండో స్థానానికి చేరుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ హాంప్‌షైర్ నిర్వహించిన పోల్ లో.. డొనాల్డ్ ట్రంప్ మొదటి స్థానంలో నిలవగా.. వివేక్ రామస్వామి రెండో స్థానానికి ఎగబాకారు. మూడో స్థానంలో భారత సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ కొనసాగుతున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుగా ఉన్నారని భావిస్తున్న ఫ్లోరిడా గవర్నర్ రోన్ డిశాంటిస్ ను భారత సంతతి అభ్యర్థులు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీలు వెనక్కి నెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న వారి మధ్య జరిగిన డిబేట్లలో సత్తా చాటిన వివేక్ రామస్వామి ముందుకు దూసుకుపోయారు. డొనాల్డ్ ట్రంప్ 39 శాతం జీవోపీ ప్రాథమిక ఓట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. అభ్యర్థిత్వ రేసులో రెండో స్థానంలో ఉన్న రోన్ డిశాంటిస్ ఒక్కసారిగా ఐదో స్థానానికి పడిపోయారు. డొనాల్డ్ ట్రంప్ కు రిపబ్లికన్ పోలింగ్ లో ఆధిక్యత లభించినప్పటికీ.. జాతీయ స్థాయిలో మాత్రం ట్రంప్ పనితీరు కాస్త వెనబడిందని నివేదికలు చెబుతున్నాయి.