Submersible Missing: టైటానిక్ శిథిలాలను పరిశీలనకు వెళ్లి గల్లంతైన జలాంతర్గామి
Submersible Missing: అట్లాంటిక్ మహా సముద్రంలోని టైటానిక్ శిథిలాలను చూసేందుకు పర్యాటకులతో వెళ్లిన ఓ జలాంతర్గామి గల్లంతైంది.
Submersible Missing: దాదాపు వందేళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిన టైటానిక్ షిప్ శిథిలాల పరిశీలన కోసం వెళ్లిన ఓ సబ్ మెరైన్ గల్లంతైంది. టైటానిక్ ను చూసేందుకు వెళ్లే క్రమంలో ఈ సబ్ మెర్సిబుల్ క్రాఫ్ట్ (చిన్నపాటి జలాంతర్గామి) నుంచి కమ్యూనికేషన్ తెగిపోయిందని టూర్ నిర్వాహకులు తెలిపారు. మహాసముద్రంలో కనిపించకుండా పోయిన టూరిస్టులతో కూడిన సబ్ మెరైన్ కోసం టూర్ నిర్వహణ సంస్థ ఓషియన్ గేట్ కంపెనీతోపాటు ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది. మిస్సయిన సబ్ మెర్సిబుల్ క్రాఫ్ట్ లో నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ ఉందని టూర్ సంస్థ తెలిపింది. అందులో ఉన్న పర్యాటకులతోపాటు సిబ్బంది ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. వారిని క్షేమంగా తిరిగి తీసుకు వచ్చేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓషియన్ గేట్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రభుత్వ సంస్థల సాయం తీసుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
గల్లంతైన సబ్ మెరైన్ కోసం అమెరికా, కెనడా దేశాలకు చెందిన కోస్ట్ గార్డ్ లతో పాటు నేవీ సబ్ మెరైన్ లు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అయితే ఈ టూరిస్టులతో కూడిన సబ్ మెరైన్ ఎప్పుడు గల్లంతైంది అనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంత వరకు వెల్లడించలేదు.
చిన్నపాటి జలాంతర్గామితో టూర్లు
అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్ లను నిర్వహిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చిన్నపాటి జలాంతర్గామిని వాడుతోంది. దీనికి టైటాన్ అనే పేరు కూడా పెట్టింది. 1912 లో అట్లాంటిక్ మహాసముద్రంలో మంచు శిఖరానికి ఢీకొని మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గరి నుంచి చూపించేందుకు ఈ జలాంతర్గామిని ఉపయోగిస్తోంది ఓషియన్ గేట్ సంస్థ.
12వేల అడుగుల లోతులో టైటానిక్ శిథిలాలు
అట్లాంటిక్ ఉపరితలం నుంచి 12,500 అడుగుల లోతులో ఉన్న ఈ శిథిలాలను ఈ టూర్ లో భాగంగా వీక్షిస్తారు. ఈ చోటు కెనడాలోని న్యూఫౌండ్లాండ్ తీరానికి 370 మైళ్ల దూరంలో ఉంటుంది. 1985 లో మొదటి సారి టైటానిక్ శిథిలాలను అట్లాంటిక్ మహా సముద్రంలో కనిపెట్టారు. అప్పటి నుంచి ఎంతో మంది డైవర్లు, జలాంతర్గామి సిబ్బంది ఈ శిథిలాలను అధ్యయనం చేశారు. తాజాగా గల్లంతైన ఈ సబ్‌మెర్సిబుల్ లో ముగ్గురు గెస్టులతో పాటు ఓ పైలట్, మరో నిపుణుడు కూడా ఉంటారు. మొత్తంగా ఇందులో ఐదుగురు ప్రయాణించడానికి వీలు ఉంటుంది. ఐదుగురికి నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ ను ఈ జలాంతర్గామిలో నింపుతారు. రోజుకు 8 గంటల పాటు సముద్ర గర్భంలో పర్యటిస్తారు. టైటానిక్ శిథిలాలతో పాటు ఇతరత్రా సముద్రంలోని వింతలు చూపిస్తారు. ఈ టూర్ కోసం ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షల డాలర్లను కంపెనీ వసూలు చేస్తోంది. భారత కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.2.50 కోట్లు.
This missing submarine was clearly an engineering marvel #Titanic #Titan #oceangate pic.twitter.com/2NrKzGBvJE
— Gabe (@gabeschnitzel) June 19, 2023
Join Us on Telegram: https://t.me/abpdesamofficial