Sleepy Man Swallows Toothbrush: పళ్లు తోముతూ.. టూత్‌బ్రష్ మింగేశాడు, అరే ఏంట్రా ఇదీ!
నిద్రమత్తులో బ్రష్‌చేస్తున్నారా? అయితే.. జాగ్రత్త, ఇతడికి ఎదురైన చేదు అనుభవం గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.
నిద్రమత్తులో ఉన్నప్పుడు ఒక్కోసారి బయట ప్రపంచాన్ని మరిచిపోతాం. పక్కవాళ్లు చెప్పేది కూడా వినిపించదు. ఒక వేళ వినిపించినా.. కలే కాబోలు అనుకుని లైట్ తీసుకుంటారు. మరి, ఇతగాడు నిద్రమత్తులో ఉండి ఏమనుకున్నాడో ఏమో.. పళ్లు తోముతూ ఏకంగా బ్రష్‌నే మింగేశాడు. దీంతో దెబ్బకు మత్తు వదిలి డాక్టర్ వద్దకు పరుగులు పెట్టాడు.
చైనాలోని జియాంగ్సు ప్రావీన్స్‌లోని తైజౌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (పేరు వెల్లడించలేదు) ఉదయాన్నే డాక్టర్ వద్దకు పరుగులు పెట్టాడు. కడుపులో చాలా ఇబ్బందిగా ఉందంటూ మొరపెట్టుకున్నాడు. అసలు విషయం తెలిసిన తర్వాత డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఎక్స్‌రే తీసిన డాక్టర్లు అతడి గొంతులో టూత్ బ్రష్‌ను కనుగొన్నారు. సర్జరీ చేసి.. వెంటనే దాన్ని తీయాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. అయినా.. బ్రష్‌ను ఎలా మింగేశావని ప్రశ్నించిన డాక్టర్.. అతడి సమాధానం విని షాకయ్యాడు.
ఉదయం నిద్రమత్తులో బ్రష్ చేస్తూ.. వెనుక పళ్లను కూడా తోమేందుకు బ్రష్‌ను లోపలికి పెట్టుకున్నానని, ఒక్కసారి అది గొంతులోకి జారడంతో బయటకు లాగేందుకు ప్రయత్నించానని తెలిపాడు. కానీ, బ్రష్ ప్లాస్టిక్ బాడీకి గ్రిప్ లేకపోవడం వల్ల చేతి నుంచి జారిపోయిందన్నాడు. బ్రష్ గొంతులోకి వెళ్లిన తర్వాత చాలా అసౌకర్యంగా అనిపించడంతో హాస్పిటల్‌కు వచ్చానని చెప్పాడు. టైజౌ ఫోర్త్ పీపుల్స్ హాస్పిటల్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ వాంగ్ జియాన్రాంగ్ బాధితుడికి చికిత్స అందించారు.
డాక్టర్ వాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడు వెంటనే హాస్పిటల్‌కు వచ్చి మంచి పనిచేశాడు. లేకపోతే దానివల్ల అన్నవాహికకు గాయాలయ్యేవి. దాన్ని మింగిన తర్వాత అతడు ఆహారం తీసుకుని ఉంటే బ్రష్ కడుపులోకి జారి మరింత క్లిష్టమయ్యేది. ఎక్స్‌రేలో 15 సెంటీమీటర్ల పొడవు బ్రష్ కనిపించిందని, వెంటనే గ్యాస్ట్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా బ్రష్‌ను తొలగించాం. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు’’ అని తెలిపారు. సోషల్ మీడియాలో చర్చనీయమైన ఈ ఘటన గురించి తెలిసి నెటిజనులు.. ‘‘అరె ఏంట్రా ఇదీ’’ అని ఆశ్చర్యపోతున్నారు.
చైనావాళ్లు బ్రష్‌లు మింగేయడం ఇదే తొలిసారి కాదు. 2019లో షెంజెన్ ప్రాంతానికి చెందిన లీ అనే మాజీ ఖైదీ వ్యక్తి 20 ఏళ్ల కిందట జైల్లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. టూత్‌బ్రష్ మింగేసి చనిపోదాం అనుకున్నాడు. కానీ, లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ఈ విషయాన్ని అతడు జైలు అధికారులకు చెప్పలేదు. ఇటీవల కడుపులో తీవ్రమైన నొప్పి కలగడంతో అతడికి సిటీస్కాన్ చేశారు. అతడి కడుపులో బ్రష్‌ను చూసి ఆశ్చర్యపోయారు. 20 ఏళ్లుగా ఆ బ్రష్ కడుపులోనే ఉండటం వల్ల నల్లగా మారిపోయింది. వైద్యులు ఎట్టకేలకు సర్జరీ చేసి దాన్ని బయటకు తీయడంతో లీ కోలుకున్నాడు. లేకపోతే ఇన్ఫెక్షన్‌తో చనిపోయేవాడని వైద్యులు తెలిపారు.