(Source: ECI/ABP News/ABP Majha)
Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, తొలిరోజు 137 మంది మృతిచెందారని జెలెన్‌స్కీ వెల్లడి
Ukraine Russia Conflict: రష్యా ఉద్దేశపూర్వకంగానే తమ దేశంలో దాడులకు తెగబడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం దాడుల్లో 137 మంది చనిపోయారని ప్రకటించారు.
Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా చేపట్టిన దాడుల్లో గురువారం ఒక్కరోజే 137 మంది చనిపోయారు. వీరంతా వార్ హీరోలు అని జెలెన్‌స్కీ (Ukraine President Volodymyr Zelensky) వ్యాఖ్యానించారు. పౌరులు, సైనికులు దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. వందలాది సైనికులు, వేలాది పౌరులు గాయపడ్డారని, వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
రష్యా ఉద్దేశపూర్వకంగానే తమ దేశంలో దాడులకు తెగబడిందని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా జీవిస్తున్న తమ పౌరులు, సైనికుల ప్రాణాల్ని రష్యా బలిగొనడం (Russia Ukraine Conflict) దారుణమని, ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. మరోవైపు ఉక్రెయిన్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది. గురువారం నాడు ఉక్రెయిన్‌లోని 70 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ బార్డర్ గార్డ్ సర్వీస్ సెంటర్‌ను హస్తగతం చేసుకుంది.
ఉక్రెయిన్ నుంచి ఏబీపీ లైవ్ రిపోర్టింగ్..
రాజధానిలోనే ఉంటాను.. అధ్యక్షుడు జెలెన్‌స్కీ
తాను శుక్రవారం సైతం రాజధాని కీవ్ లోనే ఉంటానని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. తన ఫ్యామిలీ కూడా దేశంలోనే ఉందని పేర్కొన్నారు. ఎడెసాలోని తీర ప్రాంతం జిమిన్యి ఐలాండ్‌లో భద్రతా బలగాలు యుద్ధంలో అమరులయ్యారు. ప్రస్తుతం రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు దాడులు ముమ్మరం చేసింది. శత్రువులు తనను తొలి టార్గెట్ చేసుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ వీడియోలో తెలిపారు. తన కుటుంబానికి సైతం రష్యా నుంచి ముప్పు పొంచి ఉందని, ఉక్రెయిన్‌ను రాజకీయంగానూ పూర్తిగా నాశనం చేయాలన్నదే వారి లక్ష్యమని కీలక వ్యాఖ్యలు చేశారని రాయ్‌టర్స్ రిపోర్ట్ చేసింది.
137 dead after first day of fighting, reports AFP quoting Ukraine's President Volodymyr Zelenskyy
— ANI (@ANI) February 25, 2022
ఇళ్లనుంచి బయటకు రావొద్దు..
తమ దేశంలో రష్యా యుద్ధానికి దిగిందని, పలు చోట్ల బాంబుల వర్షం కురిపిస్తోందని జెలెన్‌స్కీ తన ప్రజలను అప్రమత్తం చేశారు. పౌరులు ఇళ్లనుంచి బయటకు రావొద్దని సూచించారు. దేశ భవిష్యత్తు కోసం పౌరులు సైతం యుద్ధంలో పాల్గొనాల్సి ఉందని, మీకు ఆయుధాలు సమకూర్చుతామని సైతం జెలెన్‌స్కీ చెప్పారు. రష్యాతో దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకున్నామని, ఇక యుద్ధంలో ముందడుగు వేసి ఎదురుదాడులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Also Read: Russia Ukraine Crisis: రష్యాను వెనకేసుకొచ్చిన చైనా, అవి దాడులు కావట !
Also Read: Ukraine Russia Conflict: ఉక్రెయిన్‌లో 30 రోజుల పాటు ఎమర్జెన్సీ- రష్యాతో ఉద్రిక్తతల వేళ కీలక నిర్ణయం