(Source: ECI/ABP News/ABP Majha)
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Road Accident in Anantapur District | అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతిచెందారు. మృతులు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం చంద్రబాబు ప్రకటించారు.
Road Accident in Anantapur District | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు వ్యవసాయ కూలీలు మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గార్లదిన్నె మండలం తలగాసి పల్లి క్రాస్ వద్ద శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు ఒక్కొక్కరి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
అసలేం జరిగిందంటే..
కుట్లూరు మండలం నెల్లుట్లకి చెందిన వ్యవసాయ కూలీలు పని కోసం ఆటోలో గార్లదిన్నెకు వెళ్లారు. మొత్తం 12 మంది కూలీలు గార్లదిన్నెకు వెళ్లారు. పని ముగించుకుని వ్యవసాయ కూలీలు ఆటోలో తిరిగి వెళ్తుండగా ఆర్టీసీ రూపంలో మృత్యువు వీరిని వెంటాడింది. ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, వీరు ప్రయాణిస్తున్న ఆటోను గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద ఢీకొట్టడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొదట బాల గద్దయ్య, రాంజమనమ్మ అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడ్డ మిగతా కూలీలను ఆస్పత్రికి తరలిస్తుంటే నాగమ్మ, పెద నాగన్న చనిపోయారు. చికిత్స పొందుతూ జయరాముడు, కొండమ్మ, చిన నాగమ్మలు సైతం ప్రాణాలు విడిచారు. మిగతా కూలీలు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్పీ జగదీశ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు తలగాసుపల్లె వద్దకు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వ్యవసాయకూలీల మృతి శోచనీయం : హోంమంత్రి అనిత
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొని వ్యవసాయ కూలీలు ఏడుగురు చనిపోవడం శోచనీయమన్నారు. ప్రమాదంలో గాయపడిన ఆరుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అదించాలని అధికారులను ఆమె ఆదేశించారు.