Brics Summit 2023: బ్రిక్స్ సదస్సులో కలిసి నడుస్తూ, ముచ్చటించిన మోదీ, జీ జిన్‌పింగ్
Brics Summit 2023: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో మోదీ, జీ జిన్‌పింగ్ కలిసి నడుస్తూ ముచ్చటించారు.
Brics Summit 2023: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పక్కపక్కనే నడుస్తూ కాసేపు ముచ్చటించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ ఇద్దరు శక్తివంతమైన నాయకులు ఒకరితో ఒకరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం నాడు జరిగిన ఈ సదస్సు సందర్భంగా ఇది జరిగింది. 5 దేశాలు ఉన్న ఈ బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలను కొత్త సభ్యులుగా ఆహ్వానించిన తర్వాత కొద్దిసేపటికే.. పీఎం మోదీ, అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య ఈ అనధికారిక చాట్ కెమెరాకు చిక్కింది. చైనా నేతృత్వంలో జోహెన్నస్ బర్గ్ వేదికగా మూడ్రోజుల పాటు ఈ శిఖరాగ్ర సమావేశం జరిగింది.
చర్చలు, మార్గదర్శకాలు, సూత్రాల సర్దుబాటు తర్వాత బ్రిక్స్ కూటమిలోకి అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలను బ్రిక్స్ లోకి ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కూటమిలోని ఐదు సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ మేరకు ఈ ఆరు దేశాలు వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచి పూర్తి స్థాయి సభ్య దేశాలుగా బ్రిక్స్ కూటమిలో కొనసాగనున్నాయి. ఈ సమావేశం తర్వాత చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా సమావేశం జరుగుతుందా లేదా అనే దానిపై సమాచారం అయితే లేదు. గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగినప్పటి నుంచి దాదాపు నాలుగేళ్లుగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగలేదు.
బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సులో గురువారం చివరి రోజు. ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐదు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇరాన్, ఇథియోపియా, మొజాంబిక్ దేశాల నేతలతో మోదీ సమావేశం అవుతారు. అయితే, ఈ రోజు ఆయన అధికారికంగా భేటీ అవనున్న మరో రెండు దేశాల పేర్లను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
BRICS 2023: PM Modi pictured having brief conversation with Chinese President Xi Jinping
— ANI Digital (@ani_digital) August 24, 2023
Read @ANI Story | https://t.co/QjzTV0tqSV#PMModi #XiJinping #India #China #BRICS pic.twitter.com/VKHsMpVUGL
Also Read: Brics Summit 2023: బ్రిక్స్‌లో 6 దేశాలకు కొత్తగా సభ్యత్వం, కూటమి బలోపేతం అవుతుందన్న మోదీ
కూటమిలోకి కొత్త సభ్యులను చేర్చుకోవడం వల్ల బలోపేతం అవుతుందని భారత్ ఎప్పుడూ విశ్వసిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. 15వ బ్రిక్స్ సమ్మిట్ లో మాట్లాడిన ప్రధాని మోదీ.. బ్రిక్స్ విస్తరణకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. 'బ్రిక్స్ విస్తరణకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుంది. కూటమిలోకి కొత్త సభ్యులను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ సంస్థగా బలోపేతం అవుతుందని బారత్ ఎప్పుడూ విశ్వసిస్తుంది' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడ్రోజుల పాటు జరిగిన సదస్సులో ఎన్నో సానుకూల ఫలితాలు వచ్చాయని మోదీ ప్రశంసించారు. 'ఈ 3 రోజుల పాటు జరిగిన సమావేశంలో చాలా సానుకూల ఫలితాలు వెలువడినందుకు నేను సంతోషిస్తున్నా' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలను పూర్తి సభ్యులుగా ఆహ్వానిస్తూ దక్షిణాఫ్రికా జోహెన్నెస్‌బర్గ్ డిక్లరేషన్ 2ను గ్రూప్ ఆమోదం తెలిపినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, బ్రిక్స్ ఛైర్ సిరిల్ రమఫోసా ప్రకటించారు. ఈ కొత్త దేశాలు జనవరి 1వ తేదీ 2024 నుంచి బ్రిక్స్ కూటమిలో పూర్తి స్థాయి సభ్య దేశాలుగా మారతాయి.