Zohran Mamdani Victory Secrete : అమెరికాలో ఎన్నికల గేమ్ చేంజర్‌గా ఉచిత బస్సుల పథకం- మన పథకాల స్ఫూర్తితో న్యూయార్క్ మేయర్ విజయం!
Zohran Mamdani Victory Secrete : మన దేశంలోనే ఉచిత పథకాలకు ఓట్ల వర్షం పడుతుందంటే అది తప్పే అని, అమెరికన్లు సైతం ఉచిత వరాలకే పట్టం కడతారని న్యూయార్క్ నగర మేయర్ ఎన్నిక తేల్చి చెప్పింది.

Zohran Mamdani Victory Secrete : మన దేశంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం ఇప్పుడు ఏకంగా అమెరికాలోని న్యూయార్క్ సిటీ వాసులను ఆకర్షించింది. ఈ పథకం న్యూయార్క్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కర్ణాటక, తెలంగాణ, ఏపీలలో మహిళలకు మాత్రమే ఉచిత బస్సు పథకం అమలు అవుతుంటే, న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఈ పథకం అందరికీ వర్తించేలా హామీ ఇచ్చిన అభ్యర్థి గెలుపుకు కారణం అయింది. ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం డెమొక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థి జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani)ని నగర ప్రథమ పౌరుడి స్థానంలో కూర్చోబెట్టింది.
ఎలక్షన్ గేమ్ చేంజర్‌గా ఉచిత బస్సు ప్రయాణ పథకం
మన దేశంలోనే ఉచిత పథకాలకు ఓట్ల వర్షం పడుతుందంటే అది తప్పే అని, అమెరికన్లు సైతం ఉచిత వరాలకే పట్టం కడతారని న్యూయార్క్ నగర మేయర్ ఎన్నిక తేల్చి చెప్పింది. కర్ణాటకలో శక్తి పథకంగా, తెలంగాణలో మహాలక్ష్మి పథకం పేరుతో, ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకం కింద లక్షల మంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆయా ప్రభుత్వాలు కల్పించాయి. ఆ ప్రభుత్వాల గెలుపుకు ఈ పథకం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే, ఇదే పథకాన్ని న్యూయార్క్ నగర ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడిన జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani) ప్రజలకు వాగ్దానం చేశారు. రోజువారీ ప్రయాణ ఖర్చులు భారంగా ఉన్న న్యూయార్క్‌లోని మధ్యతరగతి ప్రజలకు, వర్కింగ్ క్లాస్ వారికి, వలసదారులకు, యువ ఓటర్లకు ఈ ఉచిత బస్ ప్రయాణ పథకం బాగా ఆకర్షించింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి మామ్దానీ ఇచ్చిన 'ఫాస్ట్ అండ్ ఫ్రీ బస్సులు' హామీ న్యూయార్క్ నగరవాసులకు బాగా నచ్చింది. ఉచిత పథకాలకు అమెరికాలోనూ ఓట్లు పడతాయని నిరూపించింది. ఈ వాగ్దానం మామ్దానీ గెలుపులో కీలక పాత్ర పోషించింది.
పైలట్ ప్రోగ్రామ్‌గా ముందే ఈ పథకాన్ని అమలు చేసిన మామ్దానీ
న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో ఆకట్టుకున్న ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం అయిన ఫాస్ట్ అండ్ ఫ్రీ బస్ను 2023-24 పైలట్ ప్రోగ్రామ్ కింద అమలు చేయడం జరిగింది. దీనికి ఆద్యులు అప్పటి అసెంబ్లీ సభ్యుడు జోహ్రాన్ మామ్దానీ, న్యూయార్క్ సిటీ సెనేటర్ మైఖేల్ గియానారిస్. వీరు ఫేర్-ఫ్రీ బస్ పథకాన్ని పైలట్ ప్రోగ్రామ్‌గా అమలు చేశారు. దీన్ని ఐదు బరో (జిల్లా)ల నుంచి ఒక్కో మార్గం ఎంచుకున్నారు. ఇలా ఐదు జిల్లాల నుంచి ఒక్కోటి చొప్పున ఐదు మార్గాల్లో (Bx18A/B (ది బ్రోంక్స్), B60 (బ్రూక్లిన్), M116 (మాన్‌హాటన్), Q4 (క్వీన్స్), S46/S96 (స్టేటెన్ ఐలాండ్)) ఈ ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం నగరవాసులందరికీ కల్పించారు. ఈ పైలట్ ప్రోగ్రామ్ అమలు వల్ల రైడర్ షిప్ 30 శాతం పెరిగినట్లు ఫలితాలు తేల్చాయి. దీంతో ఈ పథకాన్ని న్యూయార్క్ నగరం అంతటా అమలు చేసే దిశగా మామ్దానీని ప్రేరేపించాయి. దీనితో న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో ఈ ఉచిత బస్ పథకాన్ని డెమొక్రటిక్ పార్టీ ప్రకటించింది.
న్యూయార్క్ నగర వాసుల ఉచిత బస్ పథకానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?
ఉచిత బస్సు పథకం కోసం కర్ణాటక రాష్ట్రం ఏటా దాదాపు ఆరు వేల కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం దాదాపు 7 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ఏడాదే ఈ పథకాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల కోట్లు ఖర్చు అని అంచనా వేసింది. అయితే, ఇది పెరిగే అవకాశం ఉన్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, న్యూయార్క్ నగరం మొత్తం ఉచితంగా బస్సు నడపాలంటే మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ ప్రతీ సంవత్సరం టికెట్ ద్వారా వచ్చే $800 మిలియన్ డాలర్లు కోల్పోయే అవకాశం ఉంది. అంటే దాదాపు ఆరు వేల కోట్ల నుంచి పది వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఖర్చును సంపన్నుల నుంచి, పెద్ద కార్పొరేషన్లలో పన్నులు పెంచడం ద్వారా భర్తీ చేస్తానని మామ్దానీ తన వాగ్దానంలో చెప్పడం జరిగింది.
మేయర్ ఎన్నికల్లో ఓట్లు కురిపించిన ఉచిత బస్ పథకం
న్యూయార్క్ ఓటర్లను ఉచిత బస్ ప్రయాణ పథకం ఆకట్టుకుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రయాణ ఖర్చులు పెరిగి మధ్యతరగతి ప్రజలు, కార్మిక వర్గం, వలసదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనం ప్రస్తుతం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ ఉచిత బస్ ప్రయాణం అనేది వారిని బాగా ఆకర్షించింది. ఇది తమకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగించే చర్యగా న్యూయార్క్ వాసులు భావించారు. పేద ఓటర్లు అయితే ఇది తమకు కలిగే ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనంగా భావించారు. దీనితో న్యూయార్క్ 50 ఏళ్ల చరిత్రలోనే పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెరగడం, ఏ డెమొక్రాటిక్ అభ్యర్థికి ఇంత మెజారిటీతో గెలవడం జరగలేదని అమెరికన్ పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. అయితే, ఇందుకు కారణాలు అనేకం ఉన్నా, ఈ ఉచిత బస్సు పథకం కీలకమైందని విశ్లేషిస్తున్నారు. మన దేశంలో ప్రజాదరణ పొందిన ఈ పథకం ఇప్పుడు అమెరికా ఎన్నికల్లోనూ దిక్సూచిగా మారిందని చెప్పవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మామ్దానీకి భారతీయ మూలాలు ఉండటం విశేషం. అందుకే ఆయన భారత రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉంటారని అనుకోలేం. మన పథకాలే ఆయనకు స్ఫూర్తినిచ్చాయని చెప్పకుండా ఉండలేం.





















