Neanderthal DNA: మన గుండె జబ్బులు, క్యాన్సర్‌కు పూర్వీకుల డీఎన్‌ఏ కారణమట!
Telugu News: నియాండర్తల్స్ జీన్స్ ని వారసత్వంగా పొందినవారికి కొన్ని లాభాలతో పాటూ, తీవ్రమైన వ్యాధులు వచ్చే రిస్క్ కూడా ఉందని సైంటిస్టులు చెప్తున్నారు.
Do Indians have more Neanderthal DNA: హోమో సేపియన్స్ నియాండర్తలెన్సిస్ అనే పురాతన మానవజాతి సుమారు 40,000 సంవత్సరాల క్రితం వరకూ అతి ఎక్కువ కాలం భూమ్మీద నివసించిన జాతి. జర్మనీలోని నియాండర్ వ్యాలీలో ఈ జాతికి సంబంధించిన మొదటి అస్థిపంజరం బయటపడటంతో వీరిని నియాండర్తల్స్ గా పేరు పెట్టారు. అయితే, ఈ జాతి వేల మైళ్లు ప్రయాణించి, ఖండాంతరాల వరకూ విస్తరించింది. అంతే కాకుండా నియాండర్తల్స్ జాతి అతి ఎక్కువకాలం కొనసాగి, వీరు మొదటి హోమో సేపియన్లతో కూడా కలిసి బతికారు.
పెద్ద తలలతో, పొట్టి శరీరంతో కనిపించే ఈ జాతి, ఎంతోకాలం హోమో సేపియన్లతో కలిసి జీవించి, సంతానోత్పత్తి కూడా చేయటం వల్ల, మానవుల కంటే ఇప్పుడు ఆధునిక మనుషుల్లోపల నియాండర్తల్స్ DNA నే ఎక్కువ మందిలో ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
నియాండర్తల్ జన్యువులు నేటి ఆధునిక మానవుల్లో బిలియన్ల మందిలో ఉన్నాయి. ఇవి రూపంతో మొదలుకొని, రకరకాల వ్యాధుల వరకూ మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాయి అని అధ్యయనాలు చెప్తున్నాయి. నియాండర్తల్స్ నుంచి ఆధునిక మానవులు వారసత్వం మొత్తం క్రోమోజోములను పొందారు. అయితే, మగవారిలోని Y క్రోమోజోముల్లో నియాండర్తల్స్ జన్యువులు పూర్తిగా లోపించాయి. ఇవి మానవ జన్యువులకు విరుద్ధంగా ఉండటం వల్ల కావొచ్చు లేదా జన్యు చలనం వల్ల యాధృచ్చికంగా తొలగిపోయి ఉండవచ్చు. నియాండర్తల్స్ DNA వారసత్వంగా పొందిన వారిలో X క్రోమోజోముల్లో వారి జన్యువులు అతి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కానీ, కొందరు ఆధునిక మానవుల్లో నియాండర్తల్స్ క్రోమోజోములు పునరుత్పత్తికి ఇంకా సహాయపడుతున్నాయనే చెప్పొచ్చు.
నియాండర్తల్స్ DNA ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది?
నియాండర్తల్స్ జీన్స్ నుంచి ఎక్కువగా వారసత్వంగా పొందినది వారి స్కిన్ కలర్, రూపానికి సంబంధించిన జెనెటిక్స్. 70% యూరోపియన్లు నియాండర్తల్స్ చర్మం రంగును కలిగి ఉన్నారట. వీరు సన్ బర్న్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, కొన్ని నియాండర్తల్స్ జీన్స్ లో విటమిన్-డి ని ఉత్పత్తి చేసి ఆరోగ్యంగా ఉంచే కారకాలు కనిపెట్టారు. నియాండర్తల్స్ ఎక్కువ డైరెక్ట్ సన్ లైట్ లో కాకుండా విటమిన్-డి పొందే సూర్యరశ్మిలో వేల సంవత్సరాలు గడపటమే ఇందుకు కారణం అంటున్నారు.
శరీర ఉష్ణోగ్రత, జీర్ణక్రియ, నిద్ర వంటి విషయాలను ప్రభావితం చేసే వ్యవస్థను సర్కాడియన్ క్లాక్ అంటారు. పొద్దున్నే నిద్రలేచేవారికి ఈ నియాండర్తల్స్ జీన్స్ ఉపయోగకరంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
హోమో సేపియన్లు యూరోప్ చేరుకునే సమయానికి నియాండర్తల్స్ అనేక అంటువ్యాధులతో జీవిస్తున్నారు. వారి మధ్య మేటింగ్ జరగటం ద్వారా ఆధునిక మానవులు ఇన్ఫెక్షన్ తో పోరాడే జెనెటిక్స్ ని పొందగలిగారు. దీని వల్ల RNA వంటి వైరస్ లను ఎదుర్కొనటానికి కావల్సిన రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నారు.
ఇంతే కాకుండా, కొన్ని నియాండర్తల్స్ జీన్స్ లో డిప్రెషన్, మూడ్ డిజార్డర్స్ కు సంబంధించిన కారకాలు ఉండటంతో, ఈ జీన్స్ పొందినవారు నికోటిన్ కి అడిక్ట్ అయినట్టు కనుగొన్నారు. చాలామందిలో గుండెజబ్బులు, క్యాన్సర్లకు కూడా నియాండర్తల్స్ జీన్సే కారణమంటున్నారు శాస్త్రవేత్తలు.