Wrinkles on Moon: చిక్కి పోతున్న చందమామ - అంతరిక్షంలో అంతుపట్టని అద్భుతం
Moon Size: చందమామ రావే.. జాబిల్లి రావే.. అంటూ ఆప్తుడిగా చూసుకునే.. పిలుచుకునే చందమామ చిక్కిపోతున్నాడట. నిండు చందమామ అని భావించే చల్లనిరాజు.. చిక్కబడుతున్నాడట. మరి కారణమేంటి?
NASA Study: అంతరిక్ష(Space) అద్భుతాల్లో మన కంటికి కనిపించనివి ఎన్నో ఉన్నాయి. అయితే.. మన కంటికి నేరుగా కనిపించేదీ.. ఎంత సేపు చూడాలనుకున్నా చూడగలిగేది.. మన మనసుకు ప్రశాంతతనిచ్చేది నిండు జాబిల్లి(Full Moon) మాత్రమే. కవుల నుంచి కళాకారుల వరకు.. పడుచు జంట(Couple) నుంచి మలివయసు దంపతుల వరకు.. వెన్నల రేడు అంద చందాలు.. ఆశ్వాదించకుండా ఉండని వారు ఉండరు. ``చంద్రమా మనసో జాతా!`` అంటూ వేదం కూడా మన మనసుకు, చందమామకు మధ్య బంధాన్ని వెల్లడిస్తుంది. మనసు కుదుట పడడమే కాదు.. దంపతుల మధ్య దీర్ఘ అనుబంధాన్ని అల్లేది కూడా చందమామే. అలాంటి చందమామ గురించి ఇప్పుడు ఒక సంచలన వార్త వెలుగు చూసింది. అదే.. మన చందమామ బక్కచిక్కిపోతోందట. నమ్మడానికి చిత్రంగా అనిపించినా.. NASA శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా చెప్పుకొచ్చారు.
ఏం జరిగింది?
చంద్రుడి(Moon)పై అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. మన ఇస్రో శాస్త్రవేత్తలు కూడా గత ఏడాది చంద్రయా న్(Chandrayan) పేరుతో కీలక ప్రయోగం చేపట్టారు. ఇలా.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చంద్రుడి ఉపరితలంపై అనేక ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న నీరు, గాలి, తేమ, మట్టి హీలియం సహా అనేక అంశాలపై పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఇలా.. తాజాగా అమెరికాకు చెందిన NASA ప్రయోగించిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ కెమెరా చేపట్టిన ప్రయోగంలో తాజాగా చంద్రుడి అంతర్భాగంలో శీతలీకరణ ప్రక్రియ ఫలితంగా జాబిల్లి కుంచించుకుపోతున్నట్లు తేలింది. ఈ కుంచించుకు పోయే క్రమంలో చంద్రుడి ఉపరితలంపై ముడతలు పడుతున్నాయట. సాంకేతిక పరిభాషలో ‘పీడన భ్రంశం’గా పిలిచే ఈ ముడతలు ప్రాథమికంగా చంద్రుడి భౌగోళిక స్వరూపాన్నే మార్చేస్తున్నాయని అంటున్నారు NASA శాస్త్రవేత్తలు.
150 అడుగులు కుంచించుకుపోయాడా?
నాసా తెలిపిన తాజా వివరాల మేరకు.. గత కొన్ని లక్షల సంవత్సరాల కాలంలో చందమామ దాదాపు 150 అడుగుల మేర చిక్కిపోయాడట. లోపలి పొరలు చల్లబడుతున్న కొద్దీ పెళుసుగా ఉన్న చంద్రుడి ఉపరితలంపై పగుళ్లు, గుట్టలు, లోయలు వంటివి ఏర్పడుతున్నాయి. కొన్ని పదుల మీటర్లు ఎత్తున ఉండే ఈ గుట్టలు చంద్రుడి మారుతున్న స్వరూపానికి నిదర్శనమని పేర్కొన్నారు. జాబిల్లి ఉపరితలం భౌగోళికంగా నిద్రాణ స్థితిలో ఉంటుందని ఇప్పటి వరకూ ఉన్న భావనలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉండటంతో పాటు భవిష్యత్తులో చంద్రుడిపై చేపట్టే అన్వేషణలకు సంబంధించి చర్చనీయాంశం అయింది.
ఉపరితలంపై స్పష్టత
చంద్రుడిపై తాజాగా గుర్తించిన పగుళ్లు, లేదా కుంచించుకుపోతున్న స్వభావం ద్వారా.. ఉపరితలం ఎలా ఉన్నదన్న విషయంపై స్పష్టత వచ్చింది. చంద్రుడి ఉపరితలం నేటికీ చురుకుగానే స్పందిస్తోందని చెప్పడానికి ఒక సూచనగా దీనిని పేర్కొన్నారు. వీటి కారణంగానే జాబిల్లి ఉపరితలంపై తరచూ ప్రకంపనాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ చంద్రకంపాలను ఎదుర్కోవాల్సి రావడం వ్యోమగాములకు అదనపు సవాలుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. చంద్రుడి క్రియాశీల స్వభావానికి విరుద్ధంగా దాని డైనమిక్ స్వభావాన్ని గుర్తించాల్సిన అవసరాన్ని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన థామస్ ఆర్. వాటర్స్ నొక్కిచెప్పారు.
ఈ కారణంగానే చంద్రుడి ఉపరితలంపై బలమైన ప్రకంపనలు వస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వివరించారు. భవిష్యత్తు లూనార్ మిషన్లతో పాటు చంద్రుడిపై కాలనీల ఏర్పాటు గురించి చర్చలు సాగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రకంపనాలపై మరింత లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని థామస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వివరాలను కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెల్లడించింది.