అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మిషెల్లే ఒబామా! బైడెన్ స్థానంలో పోటీ చేస్తారా?
US Presidential Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మిషెల్లే ఒబామా పోటీ చేయాలని డెమొక్రాట్‌లు ప్రతిపాదించారు.
US Presidential Elections: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లే ఒబామా ఈ సారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారా..? Democratic Party తరపున జో బైడెన్ స్థానంలో ఆమె పోటీ చేయనున్నారా..? ఇటీవల అమెరికాలో జరిగిన ఓ పోల్‌లో ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని చాలా మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. Rasmussen Reports పోల్ జరగ్గా డెమొక్రాట్స్‌లో దాదాపు సగం మంది మిషెల్లే ఒబామాకి ఓటు వేశారు. ఈ సారి జో బైడెన్‌ని పక్కన పెట్టి మిషెల్లేకి అవకాశమివ్వాలని సూచించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కి బదులుగా ఇంకెవరిని బరిలోకి దింపితే బాగుంటుందని పోల్ జరిగింది. ఇందులో 48% మంది డెమొక్రాట్‌లు మిషెల్లో ఒబామా పేరు ప్రతిపాదించారు. 38% మంది వ్యతిరేకించారు. కేవలం 33% మంది మాత్రమే ఇది ఎన్నికల ఫలితాల్లో అలజడి సృష్టిస్తుందని వెల్లడించారు. జో బైడెన్‌తో పోల్చి చూస్తే..మిషెల్లే ఒబామాకి 20% ఓట్లు పోల్ అయ్యాయి. ఈ అధ్యక్ష రేసులో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, మిషిగన్ గవర్నర్ గ్రెషెన్ విట్‌మర్ ఉన్నారు.
ఈ పోల్‌లో కమలా హారిస్‌కి 15% ఓట్లు వచ్చాయి. హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌కి 12% ఓట్లు పోల్ అయ్యాయి. కానీ...మిషెల్లే ఒబామా పేరు ఎక్కువగా వినిపించింది. ఇప్పటికే మిషెల్లే ఒబామా ఈ అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. అసలు ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ అధ్యక్ష ఎన్నికలు (2024 US Election) చాలా కీలకంగా మారనున్నాయి. డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య గట్టి పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు అన్ని అర్హతలూ ఉన్నాయని బైడెన్ ఇప్పటికే తేల్చి చెప్పారు. అటు ట్రంప్ కూడా గెలుపుపై చాలా ధీమాగా కనిపిస్తున్నారు.
అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్(Trump) దూసుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు ఎన్నికల్లో గెలిచిన ఆయన, వర్జిన్ ఐలాండ్స్, నెవాడ ప్రైమరీ ఎలక్షన్లోనూ ఘన విజయం సాధించారు. నాలుగు రోజుల కిందట వర్జిన్ ఐలాండ్స్‌లో జరిగిన ఎన్నికలో ట్రంప్ 73శాతం ఓట్లు సాధించి భారీ మెజారిటీతో గెలుపొందారు. నెవాడాలో ఏకగ్రీవంగా గెలిచారు. బరిలో ఉన్న నిక్కి హేలీ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఆయన ఏకగ్రీవంగా గెలిచారు. ఎన్నికల్లో నిబంధనలు పాటించకపోవడం వల్ల బహిష్కరించినట్లు హేలీ తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయంతో ట్రంప్‌నకు 26 డెలిగెట్స్ లభించాయి. అధికారికంగా పార్టీ తరఫున నామినేషన్ దక్కించుకునేందుకు ఆయనకు 1,215 డెలిగెట్స్ అవసరం అవుతాయి. అంతకుముందు అయోవా, న్యూ హ్యాంప్‌షైర్ రాష్ట్ర ప్రైమరీలో విజేతగా నిలిచారు, అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్ పోటీ పడుతుండటం వరుసగా ఇది మూడోసారి.