ఇజ్రాయేల్‌కి పెరుగుతున్న మద్దతు, అమెరికాతో పాటు బ్రిటన్ నుంచీ భరోసా
Israel Hamas War: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయేల్ పర్యటనకు వెళ్లారు.
Israel Hamas War:
టెల్ అవీవ్‌లో రిషి సునాక్..
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయేల్ రాజధాని టెల్ అవీవ్ పర్యటనకు వెళ్లారు. ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇజ్రాయేల్‌కి మద్దతునిచ్చేందుకు అక్కడ పర్యటించనున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడికి చేరుకున్నారు. ఆ తరవాత సునాక్ వెళ్లారు. ఇజ్రాయేల్ నేతలతో భేటీ అయిన సునాక్..ఆ తరవాత ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో సమావేశమవనున్నారు. ఈ భేటీపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు సునాక్.
"ఇలాంటి సమయంలో ఇజ్రాయేల్‌కి అండగా నిలబడాలని అనుకుంటున్నాం. ఉగ్రవాద భూతాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహుతో పాటు అమెరికా అధ్యక్షుడి జో బైడెన్‌తో సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సమావేశాలు ఫలంవంతంగా సాగుతాయని విశ్వసిస్తున్నాను"
- రిషి సునాక్, బ్రిటన్ ప్రధాని
I am in Israel, a nation in grief.
— Rishi Sunak (@RishiSunak) October 19, 2023
I grieve with you and stand with you against the evil that is terrorism.
Today, and always.
סוֹלִידָרִיוּת pic.twitter.com/DTcvkkLqdT
ఇజ్రాయేల్ అధ్యక్షుడితో భేటీ..
ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయేల్‌కి మద్దతునిస్తున్నారు రిషి సునాక్. పాలస్తీనా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే హక్కు ఇజ్రాయేల్‌కి ఉందని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఇజ్రాయేల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జాగ్ తో( Isaac Herzog) భేటీ అయ్యారు రిషి. ఈ ఉగ్రదాడుల్లో చిక్కుకున్న బ్రిటీష్ పౌరులను సురక్షితంగా ఉంచడమే కాకుండా వాళ్లకు కావాల్సిన సాయం అందించినందుకు సునాక్ థాంక్స్ చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో మానవతా సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తించామని వెల్లడించారు. హమాస్ ఉగ్రవాదుల చేతుల్లో చాలా మంది బందీలయ్యారు. బాధితుల కుటుంబ సభ్యుల్నీ పరామర్శించారు. ఉగ్రవాదులు చిన్నారులనూ ఎత్తుకెళ్లారని, తల్లిదండ్రులకు ఇంతకన్నా నరకం మరోటి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు రిషి సునాక్.
బ్రిటన్‌లోని జూదులను రక్షించే బాధ్యత తమదే అని ఇప్పటికే స్పష్టం చేశారు సునాక్. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూడొద్దని హెచ్చరించారు. యూకేలో వాళ్ల పప్పులు ఉడకవని తేల్చిచెప్పారు. జూదులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బ్రిటన్‌లో పలు చోట్ల జూదులపై దాడులు జరిగాయి. ఇప్పటి వరకూ 105 ఘటనలు నమోదయ్యాయని లండన్ పోలీసులు వెల్లడించారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 మధ్యలోనే దాదాపు 75 ఘటనలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. గతేడాది కూడా అక్కడక్కడా జూదులపై దాడులు జరిగాయి. అయితే..ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ అలజడి ఇంకాస్త పెరిగింది. దాదాపు వారం రోజులుగా తరచూ ఏదో ఓ చోట ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. పరిస్థితులు అదుపు తప్పక ముందే పోలీసులు అన్ని చోట్లా నిఘా పెట్టారు. హింసాత్మక ఘటనల్ని ఏ మాత్రం సహించమని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది.
Also Read: పాలస్తీనా పౌరుల ఆకాంక్షలకి హమాస్ చర్యలకు పొంతనే లేదు - కమలా హారిస్