JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Anantapur News: మహిళలతో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాననే కక్షతో తన బస్‌లను ఆర్‌ఎస్‌ఎస్ నేతలు తగలబెట్టారని ఆరోపించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. దీనిపై కేసు నమోదు చేయడం పోలీసులకు చేతకాలేదని ధ్వజమెత్తారు.
JC Prabhakar Reddy Comments On RSS And BJP: గురువారం తెల్లవారుజామున అనంతపురంలోని ఆర్టీసీ డిపో దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం రాజకీయ కాక రేపుతోంది. ఏకంగా కూటమి పార్టీలోనే సంథింగ్ సంథింగ్ జరుగుతోందన్న ప్రచారానికి ఊతమిస్తోంది. అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో జెసి దివాకర్ రెడ్డి బస్సులు దగ్ధమయ్యాయి. ఇదే విషయంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.
తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ అయి బస్సు దగ్ధం అయినట్లు అంతా అనుకున్నారు కానీ ఇందులో కుట్ర కోణం దాగి ఉందని జేసీ ప్రభాకర్‌రెడ్డి కామెంట్ చేశారు. పథకం ప్రకారమే తన బస్సుకు నిప్పంటించారని అన్నారు. దీన్ని చేసింది ఆర్ఎస్ఎస్ నాయకులేనని ఆరోపించారు. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ హాట్‌గా మారిపోయింది.
ఆర్ఎస్ఎస్ నాయకులకు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏంటి సంబంధం ?
జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన ఏది చేసిన ఒక స్టైల్ ఉంటుంది. ఏ పండగొచ్చిన తాడపత్రి పట్టణంలో తనదైన శైలిలో ఆ పండుగలకు వైవిధ్యాన్ని జోడిస్తూ.. ప్రజలు ఆనందంగా ఉండాలని ఆలోచిస్తుంటారు. అందులో భాగంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. డిసెంబర్ 31వ తేదీ తాడిపత్రి పట్టణంలో ఓ కార్యక్రమాన్ని జెసి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన చేపట్టారు. జెసి పార్క్ సమీపంలో పట్టణంలోని మహిళలతో కలిసి జేసి ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమయ్యారు.
ఈ వేడుకలను ఆర్ఎస్ఎస్ నేతలు వ్యతిరేకించారు. ఒకప్పటి సినీ నటి మాధవి లత, మరో ఇద్దరు నాయకులు ఈ వేడుకలపై విమర్శలు చేశారు. ఈవెంట్‌లో మహిళలు పాల్గొనడం ఏంటి అని మన సంస్కృతి సాంప్రదాయాలు పట్టించుకోరా అంటు ప్రశ్నించారు. 31వ తేదీ అర్ధరాత్రి వేళ ఆ ప్రదేశం కూడా సరైనది కాదు అంటూ సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేపట్టారు. అయినప్పటికీ అవేమీ పట్టించుకోని జెసి ప్రభాకర్ రెడ్డి 31వ తేదీ పట్టణంలో కేవలం మహిళలకు మాత్రమే ఎంట్రీ అని న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకతోనే ఆర్ఎస్ఎస్ వర్సెస్ జేసి ప్రభాకర్ రెడ్డి కథ ఆ టాపిక్ గా మారింది.
జేసి ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు :
ఇలా కార్యక్రమం విజయవంతం అవ్వడంతో తనపై కక్షను ఇలా బస్‌పై తీర్చుకున్నారని ఆరోపించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. పథకం ప్రకారమే బస్సుకు నిప్పు పెట్టారని అన్నారు. ఎగిసిన ఆ మంటలు పైనున్న విద్యుత్ వైర్లను తాకి తెగిపోయాయని వెల్లడించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులు థర్డ్ జెండర్ కంటే తక్కువ అంటూ వ్యాఖ్యనించారు. వైసిపి ప్రభుత్వంలో బస్సుల కారణంగా 450 కోట్లు పోగొట్టుకున్నానని ఇప్పుడు ఈ ఒక్క బస్సు పోతే ఒరిగేదేమీ లేదంటూ మాట్లాడారు. పోలీసులకు చేతనైతే సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులకు కేసు నమోదు చేసుకోవడం చేతకాకపోవడంతోనే షార్ట్ సర్క్యూట్ అంటూ రాసుకొని వెళ్లారని మండిపడ్డారు.
ఇప్పుడు జేసీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. టీడీపీ లీడర్‌గా ఉన్న జేసీ మిత్ర పక్షం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు చేయడంతో చర్చ మొదలైంది.