India-Canada Relations:భారత్ చేసిన తప్పులు కారణంగానే ఉద్రిక్తతలు- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు
India-Canada Relations: భారత్, కెనడా మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాల నుంచి దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్నారు. దీనికి భారత్‌ను దోషిగా కెనడా ప్రధాని చూపిస్తున్నారు.
India-Canada Relations: భారతదేశం, కెనడా మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. సోమవారం ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. ఇది కాకుండా, కెనడా నుంచి హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత దౌత్యవేత్తలకు సంబంధం ఉందన్న కెనడా ఆరోపణలను తీవ్రంగా తప్పుపట్టింది. అందుకే ఈ చర్య తీసుకుంది.
భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. కెనడా ప్రధానమంత్రిగా తన దేశ పౌరుల భద్రత తనకు అత్యంత ముఖ్యమని అన్నారు. తన పౌరుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడను స్పష్టం చేశారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ..."భారత్‌తో మాకు ఎలాంటి విభేదాలు అక్కర్లేదు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. బలమైన చారిత్రక వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. రాజకీయాల్లో మీ చుట్టూ అస్థిరత ఉంటే, ప్రజాస్వామ్య దేశాలతో కలిసి ఉండాలి. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చని నిఘా సంస్థలు చెప్పడంతోనే అనుమనం మొదలైంది.
ఆయన ఇంకా మాట్లాడుతూ, "గత వేసవిలో కెనడియన్ గడ్డపై ఒక కెనడియన్ హత్యకు గురయ్యాడు. దీని తర్వాత భారతదేశం నుంచి సహాయం ఆశించాం. దీనిని పరిష్కరించడానికి మాతో కలిసి పని చేస్తారని అనుకున్నాం. భారతదేశంతో ఎలాంటి ఘర్షణపూరిత వాతావరణం కోరుకోవడం లేదు. కానీ ఒక కెనడియన్ హత్య జరిగింది. కెనడియన్ నేల ఒక దేశంగా మనం దాన్ని ఎలా విస్మరించగలం.
'భారత ఏజెంట్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారు'
భారత్‌పై విమర్శలు చేస్తూ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారని అన్నారు. కెనడా ప్రజల భద్రతకు భారతీయ ఏజెంట్లు ముప్పుగా పరిణమిస్తున్నారని దర్యాప్తు సంస్థల వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి. 6 మంది భారతీయ ఏజెంట్లు నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కెనడా అధికారులు ఆధారాలు అందించారు. కెనడియన్ గడ్డపై కెనడియన్ పౌరులను చంపడం లేదా బెదిరించడంలో విదేశీ శక్తుల జోక్యాన్ని మేము అంగీకరించబోం.
ఆయన ఇంకా మాట్లాడుతూ... "ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇండో-కెనడియన్లు, సిక్కు సమాజ ప్రజలను కలచి వేసింది. భారత ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది." అని అన్నారు.
'చర్యలు తీసుకోవడం నా బాధ్యత'
భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేశారు. "మీలో చాలా మందికి కోపం ఉంది. మరికొంత మంది భయపడుతున్నారు. నేను అర్థం చేసుకోగలను. ఇలాంటి జరగకూడదు. కెనడా-భారత్ ప్రజల మధ్య వాణిజ్యం, వ్యాపార సంబంధాలు చాలా బలగా ఉన్నాయి. భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కెనడా పూర్తిగా గౌరవిస్తుంది. భారత్ నుంచి కెనడా కూడా అది ఆశిస్తుంది. అయితే భద్రత ప్రమాదంలో పడిందని భావించే వారికి భరోసా ఇవ్వడం ప్రధానమంత్రిగా నా బాధ్యత."
కెనడా నుంచి భారత ప్రభుత్వం తన దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్న కొన్ని గంటల తర్వాత కెనడా గడ్డపై తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వ ఏజెంట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి పనిచేస్తున్నారని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) ఆరోపించింది.
31 ఏళ్ల బిష్ణోయ్ పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నాడు. మహారాష్ట్ర నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబా సిద్ధిఖీని శనివారం రాత్రి హత్య చేయడం వెనుక అతడి హస్తం ఉన్నట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: కెనడా ఇక ఖలిస్థాన్ సపోర్టర్లకు మాత్రమేనా ? ఇతర భారతీయులు వెనక్కి రావాల్సిందేనా ?