Imran Khan: ఇమ్రాన్ జైలు శిక్ష తీర్పు నిలిపేసినా ఇంకా జైలులోనే - కొద్దిగంటల్లోనే మరో కేసు తెరపైకి!
ఇవాళ (ఆగస్టు 29) ఉదయమే, ఇస్లామాబాద్ హైకోర్టు తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు గత ఆగస్టు 5న విధించిన మూడు సంవత్సరాల జైలు శిక్షను రద్దు చేసింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు జైలు శిక్షను నిలిపివేసిన ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. కొద్ది గంటలకే ఇమ్రాన్ ఖాన్ మరో సమస్యలో చిక్కుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, సైఫర్ కేసు వల్ల ఇమ్రాన్ ఖాన్ జైలు నిర్బంధం కొనసాగే అవకాశం ఉందని పాకిస్థాన్ వార్తా పత్రిక డాన్ వెల్లడించింది. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్‌ను ప్రయోగిస్తూ సైఫర్ కేసులోనూ ఇమ్రాన్ అరెస్టయ్యారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న సమయంలో రాజకీయ ఉద్దేశాల కోసం రహస్య దౌత్య వ్యవహారాలను (సైఫర్)ను ఉపయోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీని విచారణ కోసం ఏర్పాటైన ప్రత్యేక కోర్టులో ఆగస్టు 30న హాజరు పర్చనున్నారు.
ఇవాళ (ఆగస్టు 29) ఉదయమే, ఇస్లామాబాద్ హైకోర్టు తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు గత ఆగస్టు 5న విధించిన మూడు సంవత్సరాల జైలు శిక్షను రద్దు చేసింది. దీంతో ఆయన జైలు నుండి విడుదల కావాల్సి ఉంది.
జైలులో ఇమ్రాన్ ఖాన్ విలాసవంతమైన జీవితం
పాకిస్థాన్ వార్తా పత్రికల నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అట్టోక్ జైలులో ఉన్న సమయంలో నెయ్యితో వండిన దేశీ చికెన్, మటన్ వంటి సాంప్రదాయ వంటకాలను ఆస్వాదిస్తున్నట్లుగా సమాచారం. జైలు అడ్మినిస్ట్రేషన్ అటార్నీ జనరల్ కార్యాలయం సమర్పించిన రిపోర్టు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రధాని లైఫ్ స్టైల్ కు సంబంధించిన వివరాలను కోరుతూ హైకోర్టు చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా ఈ రిపోర్టును సమర్పించారు.
ఆయనకు కల్పించిన అందించిన సౌకర్యాలను హైలైట్ చేస్తూ, జైలు ఖైదీని 9×11 అడుగుల సెల్‌లో ఉంచినట్లు వివరాలను వెల్లడించారు. ఫ్లోర్ మొత్తం సిమెంటుతో ఉందని, సీలింగ్ ఫ్యాన్‌ను అమర్చడంతో పాటు ఈ సెల్‌కు వైట్‌వాష్ కూడా జరిగిందని కోర్టుకు నివేదించారు. ఈయన ఉపయోగించిన వాష్‌రూమ్ 7×4 అడుగులుగా ఉంది. అంతేకాక, ఇమ్రాన్ ఖాన్ కోసం భారీగా పోలీసు సిబ్బందిని మోహరించారు. కొత్త టాయిలెట్ సీటు, ముస్లిం షవర్, టిష్యూ స్టాండ్, స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాప్‌తో సహా అన్ని హంగులను చేర్చారు. స్నానం, ముఖం కడుక్కోవడం కోసం, ఒక పెద్ద అద్దంతో ఒక వాష్ బేసిన్ ఏర్పాటు చేశారు. ఆయన కోరిక మేరకు ఇమ్రాన్ వారానికి రెండుసార్లు దేశీ చికెన్ తీసుకుంటారు. ఇంకా నెయ్యితో తయారు చేసిన మటన్ కూడా ఆయన భోజనంలో ఉంటుంది.