జపాన్ ప్రధానిపై హత్యాయత్నం- తృటిలో తప్పించుకున్న ఫ్యూమియో కిషిడా
జపాన్ ప్రధానిపై హత్యాయత్నం జరిగింది. ప్రధాని ఫ్యూమియో కిషిడా సమావేశంలో భారీ పేలుడు సంభవించింది.
జపాన్ ప్రధానిపై హత్యాయత్నం జరిగింది. ప్రధాని ఫ్యూమియో కిషిడా సమావేశంలో భారీ పేలుడు సంభవించింది. అయితే కిషిడాను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు భద్రతా సిబ్బంది. జపాన్ మీడియా అందిస్తున్న కథనాల ప్రకారం... కిషిడా సమీపంలో పైపు లాంటి వస్తువును గుర్తు తెలియని వ్యక్తి విసిరాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వార్తా సంస్థ బీఎన్ఓన్యూస్ ట్విటర్లో షేర్ చేసింది. భారీ పేలుడు తర్వాత వాకాయామాలో గుమిగూడిన మీడియా సిబ్బంది, ఇతరులు పారిపోతున్నట్లు ఈ వీడియోలో ఉంది. 19 సెకన్ల నిడివి ఉన్న ఈ ఫుటేజీలో కిషిడా ఉన్న ప్రాంతం నుంచి మీడియా ప్రతినిధులు, ఇతరులు పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ప్రదేశంలో పేలుడు తర్వాత చుట్టుపక్కల పొగ వ్యాపించింది.
BREAKING: Japanese Prime Minister Kishida evacuated after loud bang; suspect in custody pic.twitter.com/iQDZeCOePh
— BNO News Live (@BNODesk) April 15, 2023
ప్రసంగం ప్రారంభానికి ముందు పేలుడు .
ఘటనా స్థలంలో పేలుడు లాంటి శబ్దం వినిపించిందని మీడియా తెలిపింది. వెంటనే ప్రధాని ఫ్యూమియో కిషిడాను ఘటనాస్థలం నుంచి సురక్షితంగా తరలించారు. ఘటనా స్థలం నుంచి ప్రజలు కూడా భయంతో పరుగులు తీశారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించడానికి నిరాకరించడంతో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రావడం లేదు. సంఘటనా స్థలంలో జనం మధ్య అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలను జాతీయ బ్రాడ్ కాస్టర్ ఎన్ హెచ్ కే చూపించింది.
అంతకుముందు 2022 జూలైలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాల్చి చంపారు. అప్పటి నుంచి జపాన్ భద్రతను పెంచింది.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే జూలై 2022లో ఎన్నికల ప్రచారంలో కాల్పులు జరపడంతో మరణించారు. పశ్చిమ జపాన్ నగరమైన నారాలో ప్రసంగిస్తున్న అబేను కాల్చి చంపారు.
షింజో అబే జపాన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి. ఆరోగ్య కారణాలతో 2020లో పదవికి రాజీనామా చేశారు. ఆయన మొదటిసారిగా 2006లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ అతి పిన్న వయస్కుడైన ప్రధాన మంత్రి అబే.