Nuvve Kavali: 'నువ్వే కావాలి' @ 25 ఇయర్స్ - బ్లాక్ బస్టర్ కాదు ట్రెండ్ సెట్టర్... హీరో ఫస్ట్ చాయిస్ ఎవరో తెలుసా?
Nuvve Kavali Movie: క్యూట్ లవ్ స్టోరీ 'నువ్వే కావాలి' మూవీకి 25 ఏళ్లు పూర్తయ్యాయి. 2000 ఏడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది.

Nuvve Kavali Movie Completed 25 Years: రెండు ఫ్యామిలీస్... ఆ కుటుంబాల నుంచి వచ్చిన యువతీ యువకుడు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. తనకు తెలియకుండానే యువతిని లవ్ చేస్తాడు యువకుడు. ఈ విషయం ఆమెకు చెప్పేలోపే ఆమెకు వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. దీంతో నాకు 'నువ్వే కావాలి' అంటూ చెప్పలేక ఆ యువకుడు మథనపడుతుంటాడు. 2000, అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్.
25 వసంతాలు పూర్తి
లవర్ బాయ్ తరుణ్, రిచా జంటగా నటించిన 'నువ్వే కావాలి' మూవీ సరిగ్గా సోమవారంతో 25 వసంతాలు పూర్తి చేసుకుంది. లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా అన్నింటినీ కలిపి ఓ అద్భుతమైన కథను అందించారు దర్శకుడు కె.విజయభాస్కర్. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీ రావు నిర్మించగా... స్రవంతి రవికిశోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అప్పట్లో రూ.1.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ రూ.24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 20 సెంటర్స్‌కు పైగా 200 రోజులు రన్ కాగా... 6 సెంటర్లలో ఏడాది పాటు ప్రదర్శించారు.
ఫస్ట్ చాయిస్ ఎవరంటే?
మలయాళం మూవీ 'నీరమ్' కథా నేపథ్యం నుంచి 'నువ్వే కావాలి' స్టోరీని రూపొందించారు. ఈ మూవీలో ఫస్ట్ మహేష్ బాబును అనుకున్నారట. అయితే, ఆయన రెస్పాండ్ కాకపోవడంతో సుమంత్‌కు కథ వెళ్లిందట. ఆయన మరో మూవీతో బిజీగా ఉండడంతో ఇక వేరే హీరోను తీసుకోవాలని ప్లాన్ చేశారు. అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా 20 - 30 సినిమాల్లో నటించారు తరుణ్. ఆయనైతే సరిపోతారని భావించి సెలక్ట్ చేశారు. ఇక ఇంటర్ చదివే టైంలో ఓ యాడ్‌లో నటించిన రిచాను చూసి హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ మూవీతోనే తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రెండో హీరోగా సాయి కిరణ్ ఎంపికయ్యారు.
ఇక ఈ మూవీతోనే హీరో సునీల్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. తరుణ్‌తో కలిసి ఆయన చేసిన కామెడీ నవ్వులు పూయించింది. కాలేజీలో సీన్స్ వేరే లెవల్‌లో ఉంటాయి. వీరి పెయిర్ ఆ తర్వాత మూవీస్‌లోనూ కొనసాగింది. కోవైసరళ కామెడీ సైతం అదిరిపోయింది. చలపతిరావు, గిరిబాబు, వర్ష, ఢిల్లీ రాజేశ్వరి, అన్నపూర్ణ, శంకర్ మేల్కొటే, ఎంఎస్ నారాయణ, సుధ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సాంగ్స్ To డైలాగ్స్ వరకూ
ఈ మూవీకి సాంగ్స్ నుంచి డైలాగ్స్ వరకూ అన్నీ ఎవర్ గ్రీన్. కోటి మ్యూజిక్ యూత్‌ను మెస్మరైజ్ చేసింది. 'అనగనగా ఆకాశం ఉంది', 'ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్లుంటుంది.' పాటలు యూత్‌ను ఊపు ఊపేశాయి. హార్ట్ టచింగ్ ఎమోషన్ సాంగ్స్ కూడా మంత్రముగ్ధులను చేశాయి. అప్పట్లో ఈ పాటలు కాలేజీ, స్కూల్ ఈవెంట్స్‌లో ట్రెండ్ సృష్టించాయి. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ వేరే లెవల్. 'దంపతులు విడిపోవడానికి విడాకులు ఉన్నాయి. అన్నదమ్ములు విడిపోవడానికి ఆస్తులు ఉన్నాయి. కానీ ఫ్రెండ్స్ విడిపోవడానికి ఏమీ లేవు.', 'గుండెలో ఉన్న మాటలు కేవలం కళ్లతోనే చెప్పగలం' అనే డైలాగ్స్ ఇప్పటికీ మనసును హత్తుకుంటాయి.
పిల్లల నుంచి పెద్దల వరకూ మెచ్చిన ఎవర్ గ్రీన్ 'నువ్వే కావాలి' అవార్డుల్లోనూ సత్తా చాటింది. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకోగా... బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్‌గా విజయ్ భాస్కర్, ఉత్తమ నటుడిగా తరుణ్, ఉత్తమ నటిగా రిచాకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి.





















