Turkey Earthquake : టర్కీ భూకంపాన్ని ముందుగా పసిగట్టిన పక్షులు, వీడియో వైరల్!
Turkey Earthquake : టర్కీ, సిరియా భూకంపాలను పక్షులు ముందుగానే పసిగట్టాయా? ఏదో విపత్తు రాబోతుందని గ్రహించాయా? నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అవునంటారు.
Turkey Earthquake : ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలం అయ్యాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం భారీ భూకంపాలు సంభవించాయి. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు కుప్పకూలాయి. ఇప్పటివరకు రెండు దేశాల్లో 2300 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. అయితే ప్రకృతి ప్రకోపాన్ని పక్షులు ముందుగానే గుర్తించాయి. భూకంపం సంభవించడానికి కొన్ని క్షణాల ముందు పక్షులు వింతగా ప్రవర్తించాయని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో సోమవారం తెల్లవారుజామున పక్షులన్నీ భవనాల పై భాగం తిరుగుతూ దగ్గర్లోని చెట్ల పైకి చేరాయి. భూకంపం సంభవించే క్షణాల ముందు పక్షలు ఇలా వింతగా ప్రవర్తించాలని సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ విపత్తులను జంతువులు, పక్షులు ముందుగానే పసిగడతాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదో ఘోరం జరగబోతుందని పక్షులు ముందుగానే గ్రహించాయంటున్నారు.
🚨In Turkey, strange behavior was observed in birds just before the earthquake.👀#Turkey #TurkeyEarthquake #Turkish pic.twitter.com/yPnQRaSCRq
— OsintTV📺 (@OsintTV) February 6, 2023
టర్కీ, సిరియాలు అతలాకుతలం
టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే భారీగా ప్రాణ నష్టం సంభవించగా.. మృతుల సంఖ్య 2300కు చేరుకుంది. ఆగ్నేయ టర్కీ ప్రాంతంలో, ఉత్తర సిరియాలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8 గా నమోదు అయింది. భూకంప తీవ్రతకు భారీ భవనాలు నిమిషాల్లో నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని, మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. టర్కీలోని 10 నగరాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉంది. ఈ భూకంపం కారణంగా వందలాది మంది చనిపోగా, వేలాది మంది గాయపడ్డారు. టర్రీ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. ఆగ్నేయ టర్కీలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
పేకమేడల్లా కూలిపోయిన భవనాలు
దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం ఎక్కువగా ఉంది. టర్కీలోని దియర్‌బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో 20 సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సిరియాలోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాలు, రెబల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో 783 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. భవనాల శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ పెను ప్రమాదం జరిగింది. టర్కీలోని 10 ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించింది. ఇప్పటివరకు 2300 మంది మరణించినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. 5300 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రతతో టర్కీలో దాదాపు 3 వేల భవనాలు ధ్వంసమయ్యాయి.