Bangladesh Train Accident: ఢాకా సమీపంలో రెండు రైళ్లు ఢీ, 15 మంది మృతి! సంఖ్య మరింత పెరిగే ఛాన్స్
Bangladesh Train Accident News: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో సోమవారం రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో పలువురు మృతిచెందారు.
Bangladesh Train Mishap : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో సోమవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 15 మంది మరణించగా, మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు. ప్యాసింజర్ ట్రైన్, గూడ్స్ రైలు ఢీకొనడంతో విషాదం చోటుచేసుకుంది. ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలో భైరబ్ అనే ప్రాంతంలో గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైలు ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
కిశోర్గంజ్నుంచి ఢాకాకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. దాంతో రైళ్ల బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొందరు ప్రయాణికులు అక్కడిక్కడే దుర్మరణం చెందగా, మరికొందరు బోగీల కింద చిక్కుకుని నరకయాతన అనుభవించారు. భైరబ్ కు చెందిన అధికారి సాదికర్ రహ్మాన్ రైళ్లు ఢీకొన్న ఘటనపై స్పందించారు. సమాచారం అందించిన వెంటనే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 15 మృతదేహాలను వెలికితీశారని వెల్లడించారు. దాదాపు 100 మంది గాయపడగా, వారిని అంబులెన్స్ లలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరు ప్రయాణికులు చనిపోయే అవకాశం ఉందని అధికారి చెప్పారు.
Fire official says two trains collided outside the Bangladeshi capital, killing a dozen people and injuring scores, reports AP
— Press Trust of India (@PTI_News) October 23, 2023
అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తోందని భైరబ్ ఫైర్ స్టేషన్ సూపర్ వైజర్ మోషరఫ్ హొస్సేన్ తెలిపారని రాయ్ టర్స్ రిపోర్ట్ చేసింది. భైరబ్ స్టేషన్ మాస్టర్ యూసుఫ్ మాట్లాడుతూ.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రైళ్లు ఢీకొన్న ప్రమాదంతో ఢాకా నుంచి చిట్టగాంగ్, సిల్లెట్ నుంచి కిషోర్‌గంజ్‌ల మధ్య రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు చెప్పారు.
బంగ్లాదేశ్‌లో తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢాకా రైల్వే పోలీసు సూపరింటెండెంట్ అనోవర్ హొస్సేన్ అన్నారు. ప్రభుత్వం దీనిపై ఫోకస్ చేసి, ప్రమాదాలను నివారించడానికి చర్యలు చేపట్టాలన్నారు.