Artificial intelligence:2030 నాటికి 1.2 కోట్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నAI, మహిళలకే ఎక్కువ ప్రమాదం!
Artificial intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శ్రామికశక్తిలో పెను మార్పులకు కారణమవుతోంది. భవిష్యత్తులో మనుషుల స్థానాలను AI భర్తీ చేస్తుందని, ఉద్యోగాలకు ఎసరు పెడుతుందని ప్రజలు భయపడుతున్నారు.
Artificial intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచ శ్రామికశక్తిలో పెను మార్పులకు కారణమవుతోంది. భవిష్యత్తులో కార్యాలయాల్లో మనుషుల స్థానాలను AI భర్తీ చేస్తుందని, చివరికి ఉద్యోగాలకు ఎసరు పెడుతుందని ప్రజలు భయపడుతున్నారు. కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌ను AI స్వాధీనం చేసుకుంటుందనే భయం సర్వత్రా ఉందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. AI ప్రభావంతో పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంది.
మెకిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ 'జెనరేటివ్ AI అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఇన్ అమెరికా' అనే పేరుతో నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు, ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2030 నాటికి US జాబ్ మార్కెట్‌పై AI గణనీయమైన ప్రభావంపై చూపుతుందని తేలింది. 2030 నాటికి ఒక్క USలో మాత్రమే సుమారు 12 మిలియన్ల డేటా సేకరణ, పునరావృత పనులతో కూడిన ఉద్యోగాల్లో AI ఆధారిత ఆటోమేషన్ భర్తీ చేయబడుతుందని పేర్కొంది.
నివేదికలో మరో ముఖ్యమైన ఆందోళన ఏమిటంటే.. ఈ ఉద్యోగ మార్పులు పురుషులతో పోలిస్తే మహిళలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. మహిళలు ఎక్కువగా ఉండే పరిశ్రమల్లో AI ఎక్కువ పాత్ర పోషిస్తుందని ఫలితంగా పురుషుల కంటే ఎక్కువగా మహిళలు 1.5 రెట్లు కొత్త ఉద్యోగాలను వెతుక్కోవాల్సి ఉంటుందని పేర్కొంది.
వర్క్‌ఫోర్స్‌లో మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఉన్నప్పటికీ, 21 శాతం మంది మహిళలు AI ఆటోమేషన్‌కు గురవుతున్నారని నివేదిక ప్రముఖంగా తెలిపింది. ఆఫీస్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, ఫుడ్ సర్వీస్ పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్‌లోని కస్టమర్ సర్వీస్ ప్రతినిధులలో 80 శాతం మంది మహిళలే. ఆఫీస్ సపోర్ట్ వర్కర్లలో 60 శాతం మంది మహిళలు ఉన్నారని నివేదిక వెల్లడించింది. రాబోయే సంవత్సరాల్లో AI ఈ రెండు రంగాల్లో ఎక్కువగా ప్రభావితం చేయనుంది.
క్లర్క్‌ల రంగంలో ఉద్యోగాలు 1.6 మిలియన్లకు తగ్గుతుందని, రిటైల్ రంగంలో సేల్స్‌పర్సన్లు 8,30,000, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌ల కోసం 710,000, క్యాషియర్లు 6,30,000కి పడిపోతుందని పేర్కొంది. అత్యధిక వేతన స్థానాల్లో ఉన్నవారి కంటే తక్కువ వేతన ఉద్యోగాల్లో ఉన్న కార్మికులు, తరచుగా మహిళలు తమ వృత్తులు లేదా ఉద్యోగాలను మార్చుకోవాల్సిన అవసరం 14 రెట్లు ఎక్కువగా ఉంటుందని నివేదికలో వెల్లడైంది. కొత్త రంగాల్లో రాణించాలంటే నైపుణ్యాలు సైతం అవసరం ఉంటుందని తేలింది. ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. ఇప్పటికీ పురుషుల కంటే మహిళలకు దాదాపు 22 శాతం తక్కువ వేతనం లభిస్తోంది.
కెనాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్ మరో నివేదిక ప్రకారం, US వర్క్‌ఫోర్స్‌లో పది మంది మహిళల్లో ఎనిమిది మంది, సుమారు 58.87 మిలియన్ల మంది మహిళలు, AI ఆటోమేషన్‌కు ఎక్కువ అవకాశం ఉన్న రంగాలు, వృత్తులు, ఉద్యోగాల్లో పనిచేస్తున్నారని పేర్కొంది. అలాగే పురుషుల సంఖ్య పదికి ఆరుగా ఉంది, మొత్తం సుమారు 48.62 మిలియన్లు ఆటోమేషన్‌కు గురయ్యే రంగాల్లో ఉన్నారు. మొత్తం మీద చూస్తే పురుషుల కంటే 21% ఎక్కువ మంది మహిళలు AI ఆటోమేషన్ దెబ్బకు ఉద్యోగాలు కోల్పోనున్నారు.
నియామక పద్ధతుల్లో గణనీయమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని నివేదిక వెల్లడించింది. ఆధారాల కంటే నైపుణ్యాలు, సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామీణ కార్మికులు, వికలాంగులు వంటి విస్మరించబడిన జనాభా నుంచి నియమించుకోవాలని, అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా శిక్షణను అందించాలని యజమానులకు సూచించింది. AI ఆటోమేషన్ ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోనున్న మహిళా కార్మికులను రక్షించడానికి ఇలాంటి చర్యలే చేపట్టాలని కోరింది.
అయితే AI కొన్ని ఉద్యోగాలకు ఎసరు పెడితే.. కొన్ని ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పిస్తుందని తెలిపింది. ఉదాహరణకు, AIలో సంక్లిష్ట సమస్యల పరిష్కారం, క్రిటికల్ థింకింగ్, సృజనాత్మకత, అధునాతన సాంకేతిక నైపుణ్యాల రంగంలో ఉద్యోగ అవకాశాలను పెంచుతుందని మెకిన్సే నివేదిక పేర్కొంది. అందువల్ల, AI రంగంలో రాణించాలంటే మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఉద్యోగులందరూ తమ నైపుణ్యాన్ని పెంకోవాలని, అభివృద్ధి చెందుతున్న వాటి చుట్టూ ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించింది.