Next CM for Karnataka: కర్ణాటక నెక్ట్ సీఎం ఎవరు? ఈసారి ఛాన్స్ ఎవరికి?
సీఎం యడియూరప్ప రాజీనామా చేస్తే కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి ఎవరు? బీజేపీ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంది? ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.?
కర్టాటక నెక్ట్ సీఎం ఎవరు? ప్రస్తుతం ఇదే రాజకీయాల్లో హాట్ టాపిక్. ఈ నెల 26న యడియూరప్ప రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆయన కూడా హింట్ ఇచ్చారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని తెలిపారు యడియూరప్ప. మరి యడియూరప్ప స్థానంలో ఎవరికి ఆ అవకాశం దక్కనుంది. బీజేపీ అధిష్ఠానం ఎవరికి ఎంపిక చేసే అవకాశం ఉంది.
అధిష్ఠానానికి సవాల్..
యడియూరప్ప వారసుడు ఎవరన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదని కర్ణాటక బీజేపీలోని ఒకవర్గం వాదిస్తుండగా, మార్పు తథ్యమంటోంది మరో వర్గం. యడియూరప్ప స్థానంలో బలమైన నేతను నియమించడం పార్టీకి సవాలేనని బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియ సజావుగా సాగాలంటే యడియూరప్ప వారసుడిగా ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేని మాస్ లీడర్ కావాలంటున్నారు. అలాంటి నేతను వెతికి పట్టుకోవడం అంత ఈజీ కాదంటున్నారు బీజేపీ నేతలు. కులాల మధ్య సమతూకం పాటిస్తూ కొత్తసీఎంను ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిదేనంటున్నారు.
ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి..
కర్ణాటకలో లింగాయత్ వర్గం జనాభా 16 శాతానికి పైగానే ఉంది. దీంతో ఈ వర్గాన్ని విస్మరించలేని పరిస్థితి. లింగాయత్‌లు బీజేపీకి అండగా నిలుస్తున్నారు. లింగాయత్‌ల ఆగ్రహానికి గురైతే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. సీఎం రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి, బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి.ఎల్.సంతోష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జోషీ, సంతోష్ బ్రాహ్మణ సామాజికవర్గం నేతలు. సి.టి.రవి ఒక్కళిగ వర్గం నాయకుడు. అయితే, బీజేపీ హైకమాండ్ అనూహ్యంగా కొత్త నేతను సీఎంపదవిలో కూర్చోబెట్టే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
కర్ణాటకలో ఒక్కళిగ కూడా బలమైన సామాజిక వర్గమే. ఈ వర్గంలో పట్టుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం రేసులో మరో బ్రాహ్మణ నాయకుడు, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ఖగేరీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. రామకృష్ణ హెగ్డే తర్వాత 1988 నుంచి ఇప్పటిదాకా కర్ణాటక సీఎంగా బ్రాహ్మణులకు అవకాశం దక్కలేదు.
ఇక యడియూరప్ప ప్రత్యర్థి, సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తనకు సీఎం పదవి ఖాయమంటున్నారు. ఆయన హిందుత్వవాది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ నెగ్గాలంటే హిందుత్వవాదికే పట్టం కట్టాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారని, అందులో భాగంగానే తనవైపు మొగ్గు చూపుతున్నారని బసనగౌడ చెబుతున్నారు. మంత్రులు మురుగేష్ నిరానీ, బసవరాజ్ ఎస్.బొమ్మై, ఆర్.అశోక్, సి.ఎన్.అశ్వత్థ నారాయణ్, జగదీష్ షెట్టర్, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
మరి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి. బలమైన నాయకత్వంతోనే రాబోయే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.